ఆదిత్య, శశాంక్‌లకు ఘనంగా ఉషశ్రీ సంస్కృతి పురస్కారం

మనసు ముందు , కనుల ముందు స్పష్టంగా రామాయణ, భారత, భాగవత కథల్ని సుమారు నాలుగు దశాబ్దాలపాటు రేడియో ద్వారా వాక్చిత్రంగా దర్శింపజేస లక్షల శ్రోతల్ని అభిమానులుగా సంపాదించుకున్న ఘనత నిస్సందేహంగా ఉషశ్రీదేనని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
ఉషశ్రీ మిషన్ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో ఉషశ్రీ సంస్కృతి సత్కారం పేరిట యువ ఆధ్యాత్మిక సంగీత గాయకులయిన కృష్ణ ఆదిత్య , కృష్ణశశాంక్‌లకు ‘ఉషశ్రీ సంస్కృతి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న మరొక ముఖ్య అతిథి, ప్రముఖ పండితులు పసర్లపాటి బంగారేశ్వరశర్మ మాట్లాడుతూ రామాయణ, భారత, కావ్య ఇతిహాస సంస్కృతిలో ఉషశ్రీ అద్భుత గళం బలమైన అంతర్భాగమని, ఉషశ్రీ ఒక్కొక్క వాక్కు ఒక్కొక్క ప్రత్యక్ష పవిత్ర దృశ్యమని వివరించారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూపంగా పవిత్ర విలువలతో అత్యంత ఆకర్షణీయంగా రచించిన ‘అదివో ... అల్లదివో’ అమోఘ గ్రంథాన్ని ఆహూతులందరికీ అందించారు. అత్యంత సమ్మోహనంగా ఉన్న ఈ పురాణపండ శ్రీనివాస్ దివ్య గ్రంథంతో పాటు తిరుమల లడ్డును ఆహూతులందరికీ ఉచితంగా అందించిన ఉషశ్రీ కుమార్తె జయంతి, అల్లుడు సుబ్రహ్మణ్యంను రసజ్ఞులందరూ అభినందించారు. పురస్కారాన్ని అందుకున్న అభినవ లవకుశులు ఆదిత్య, శశాంక్‌లు ఆలపించిన అద్భుత కీర్తనలు అందరినీ అలరించాయి.
త్వరలో నిర్వహించబోయే ఉషశ్రీ శత జయంతి వేడుకల గురించి , ఉషశ్రీ విగ్రహ ప్రతిష్ఠ గురించి , ఉషశ్రీ ప్రచురణల గురించి కుమార్తె వైజయంతి విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి అనంతలక్ష్మి , ఉషశ్రీ కుమార్తెలు డాక్టర్ గాయత్రీదేవి , వైజయంతి తదితర ప్రముఖులు ప్రసంగించారు.