తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో - “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్, టెక్సస్, అమెరికా: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగిన - 77వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21)’ సందర్భంగా “నా భాషే నా శ్వాస” (పసిప్రాయంనుండే పిల్లలకు దేశ, విదేశాలలో తల్లిభాష ఎలా నేర్పుతున్నారు?) అనే కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలికి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సభను ప్రారంభించారు. సభకు అధ్యక్షతవహించిన తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – అప్పటి తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) లో ‘బెంగాలీభాష’ అధికార గుర్తింపు కోసం 1952లో ఫిబ్రవరి 21న పాకిస్తాన్ ప్రభుత్వ తూటాలకు బలిఅయిన వారి స్మారకంగా ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించిందని గుర్తుచేశారు. మాతృభాషలో సరైన పునాదిఏర్పడిన తర్వాతే ఆంగ్లం లేదా ఇతర భాషలను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి వీలు కల్గుతుందనే వాస్తవాన్ని విస్మరించకూడదని, ఆంగ్లభాష మోజులోపడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదని, ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.”
ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెన్నం ఉమ మాట్లాడుతూ – “పిల్లలు పసివయస్సులో తన తల్లి, కుటుంబసభ్యుల వాతావరణంలో మాతృభాషను వినికిడి ద్వారా, అనుకరణ ద్వారా, గమనించడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని ఆ పరిస్థితులను కల్పించవలసిన బాధ్యత పెద్దలమీదే ఎక్కువగా ఉంటుంది అన్నారు. చాలా అర్ధవంతమైన, అవసరమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులకు, పాల్గొన్న విశిష్టఅతిథులకు అభినందనలు తెలియజేశారు.”
విశిష్టఅతిథులుగా-శ్రీ పరవస్తు ఫణి శయన సూరి, ‘తెలుగుదండు’-విశాఖపట్నం; శ్రీ మణికొండ వేదకుమార్, ‘బాలచెలిమి’, ‘దక్కన్ లాండ్’–హైదరాబాద్; శ్రీ ఏనుగు అంకమ నాయుడు, ‘సాహిత్యాభిలాషి’, ‘సంఘసేవకులు’–తిరుపతి; డా. మురహరరావు ఉమాగాంధీ, ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారగ్రహీత, విశాఖపట్నం; శ్రీమతి జ్యోతిర్మయి కొత్త, ‘పాఠశాల’-షార్లెట్, నార్త్ కరోలినా, అమెరికా; శ్రీ ఫణి డొక్కా, ‘అంతర్జాతీయ తెలుగుబడి’-అట్లాంటా, జార్జియా, అమెరికా; శ్రీ వెంకట రామారావు పాలూరి, సిలికానాంధ్ర ‘మనబడి’-డాలస్, టెక్సస్, అమెరికా; శ్రీ రవిశంకర్ విన్నకోట, ‘పాఠశాల’-కొలంబియా, సౌత్ కరోలినా, అమెరికా; శ్రీ భానుప్రకాష్ మాగులూరి, తానా ‘పాఠశాల’-వర్జీనియా, అమెరికా; మరియు శ్రీమతి ఇందిర చెరువు, తెలుగు సాంస్కృతిక సమితి ‘తెలుగుబడి’-హ్యూస్టన్, టెక్సస్, అమెరికా పాల్గొని పిల్లలకు తెలుగుభాషను నేర్పడంలో వారు అనుసరిస్తున్న వినూత్న విధానాలను, సాధిస్తున్న ఫలితాలను సోదాహరణం గా వివరిస్తూ, తల్లిభాషను భావితరాలకు అందించడంలో తల్లిదండ్రుల శ్రద్ధ, ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో అవసరం అన్నారు.
తానా సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన కార్యకర్తలకు, ప్రసారమాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె లో వీక్షించవచ్చును. https://youtu.be/-s2aegzZi14?si=qVDfjudJ_n99zGWq