మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన చిత్రం 'మట్కా
వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవంబర్ 14న చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
'మట్కా' కథ ఎలా ఉండబోతోంది ?
-వాసు అనే అబ్బాయి కథే మట్కా. తను బర్మా నుంచి శరణార్థి గా వైజాగ్ వస్తాడు. 1958 నుంచి 82 వరకు తను అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తాం. వాసు అనే అబ్బాయి లైఫ్ స్టోరీ ఇది.
మట్కా కింగ్ రతన్ ఖత్రి క్యారెక్టర్ తో వాసుకి పోలిక ఉందా?
-డైరెక్టర్ గారు ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేద్దామని భావించారు. రతన్ ఖత్రి ది ముంబై నేపథ్యం. తను పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. పైగా ఆయన చేసిన పనులను జనాలు రూమర్స్ లా మాట్లాడుకోవడమే తప్పితే కొన్నిటికి ఆధారాలు లేవు. సెల్ ఫోన్స్ లేని రోజుల్లో దేశం మొత్తం ఒకే నెంబర్ ని ఒకే రోజు పంపించడాని చెప్తుంటారు. తను ఎలా పంపించాడో ఎవరికీ తెలియదు. మా డైరెక్టర్ గారు ఒకవేళ తనే మట్కా కింగ్ అయి ఉంటే తను ఎలా చేసేవారో అని ఆలోచించి ఆయనకు వచ్చిన ఐడియాస్ తో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేశారు.
కరుణ కుమార్ గారి గత సినిమాల్లో కుల వివక్ష అనేది ఎక్కడో అండర్ లైన్ గా ఉంటుంది. ఇందులో ఎలాంటి పాయింట్ ని టచ్ చేశారు?
-మట్కా సందేశాత్మక చిత్రం కాదు. ఇది ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిలిం. వాసు క్యారెక్టర్ లో తనకి ఎవడూ హెల్ప్ చేయడనే ఒక బాధ, కోపం కనిపిస్తుంది. వాసు క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తున్న కొద్దీ తను చెప్పేది కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది. కొన్నిసార్లు పాపమనిపిస్తుం. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ మీద కోపం కూడా వస్తుంది. ప్రతి ఈ మనిషిలో ఐదేళ్ల కు ఒకసారి తన వ్యక్తిత్వం ఎక్కడో చోట మారుతూ ఉంటుంది. వాసు క్యారెక్టర్ లో ఇవన్నీ కనిపిస్తాయి.
ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటి?
ఈ దేశంలో చెలామణి అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. వాసు ఆ ఒక్క పెర్సెంట్ లో వుండాలనుకుంటాడు. ఇది కాన్సెప్ట్ అఫ్ ది ఫిల్మ్.
ఈ సినిమా ని ఒప్పుకోవడానికి ప్రధాన కారణం?
-మట్కా సినిమాని ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ క్యారెక్టరైజేషన్. చాలా స్ట్రాంగ్ గా రాసిన క్యారెక్టర్ ఇది. మంచి, చెడు అని కాదు.. ఆడియన్స్ థియేటర్స్ లో కూర్చున్నప్పుడు ఒక క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అవ్వాలి, వాడు గెలవాలనుకోవాలి, వాడిని ప్రేమించాలి.. అదే కమర్షియల్ సినిమా ఫార్ములా. అలా చూసుకుంటే వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు. 60, 70 టైమ్స్ లోకి ఆడియన్స్ వెళ్తారు. రెండున్నర గంటలు వాసు తో పాటు ట్రావెల్ అవుతారు. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి చేసిన సినిమా ఇది. అభిమానులందరికీ నచ్చేలా వుంటుంది.
ఇందులో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం కోసం ఎలాంటి వర్క్ చేశారు ?
-డైరెక్టర్ గారు, నేను మాట్లాడుకుని ఆ లుక్ ని డిజైన్ చేశాం. ఏజ్ కి తగ్గట్టు ఒక ఏఐ రిఫరెన్స్ తీసుకున్నాం. ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తూ ఆ క్యారెక్టర్ చేశాను. కమర్షియల్ గా ఉంటూ అందరికీ అప్పీల్ అవుతూ రియలిజం క్లోజ్ వుండే ప్రయత్నం చేశాం.
ఒక క్రిమినల్ స్టోరీ ని చెప్తున్నప్పుడు వాళ్ళ ఎమోషనల్ పెయిన్ కూడా కనెక్ట్ అయ్యేలా చూపించాలి కదా.. మరి ఇందులో వాసు క్యారెక్టర్ లో ఎమోషన్ ఎలా ఉంటుంది?
-ఇందులో సెకండ్ హాఫ్ లో చాలా బ్యూటిఫుల్ సీన్ ఉంది. వాసు క్యారెక్టర్ తన పెయిన్ చెప్తున్నప్పుడు, అసలు తను ఎందుకు అలా అయ్యాడో కూతురుతో ఒక పిట్ట కథలా చెబుతున్నప్పుడు.. ఆ స్టోరీ విన్న ఎవరికైనా కళ్ళ నుంచి నీరు వస్తాయి. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. దాదాపు ఒక వారం రోజులు పాటు ఆ సీన్, డైలాగ్స్ ని చదువుతూనే ఉన్నాను. ఆ సీన్ ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సైట్ మెంట్ ఉంది.
ఇందులో వైలెన్స్ డోసు ఎక్కువగా ఉంటుందా?
-సినిమాకి యు/ఏ ఇచ్చారు. మేము 'ఏ' ఇస్తారనుకున్నాం(నవ్వుతూ). సినిమాలో వైలెన్స్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లు ఒక 9 వరకు ఉన్నాయి. సెకండాఫ్ హాఫ్ ఒక రివెంజ్ డ్రామా జోన్ లోకి వెళుతుంది. లాస్ట్ లో సినిమా యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుంది.
దాదాపు నాలుగు గెటప్స్ లో కనిపిస్తున్నారు కదా ఒక్కొక్క గేటప్ కి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు?
-యాక్టర్ కి ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అదృష్టం. ఈ క్యారెక్టర్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. లాస్ట్ మూడు సినిమాల్లో పెర్ఫార్మెన్స్ పరంగా కొంచెం లిమిటేషన్స్ ఉండే సినిమాలే చేశాను. గద్దల కొండ గణేష్ తర్వాత మళ్లీ అలాంటి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే సినిమా కోసం చూస్తున్నప్పుడు ఈ కథ వచ్చింది. డెఫినెట్ గా వాసు లాంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా ఉంటుంది. స్క్రీన్ పై వరుణ్ అని కాకుండా వాసులనే చూడాలి. దాని కోసం కష్టపడాల్సిందే. గద్దల కొండ గణేష్ తర్వాత నేను బయటకి వెళ్ళినప్పుడు వరుణ్ అని కాకుండా గణేష్ అని పిలిచారు. అది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంటు. యాక్టర్ గా నన్ను క్యారెక్టర్ పేరుతో పిలిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. నా ప్రయారిటీ కూడా అదే.