మేడారం జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఫోటోలు ఇవిగో!

Related image

తెలంగాణ కుంభ మేళా సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం జాతరకు వచ్చి తల్లులను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో మేడారం చేరుకున్నారు. వారికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పుష్ప గుచ్చం శాలువాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడ నుండి నేరుగా గద్దెల వద్దకు చేరుకొని పట్టువస్త్రాలు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుని తల్లులను దర్శించుకున్నారు.

గవర్నర్లతో పాటు రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించిన అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వసతికు చేరుకున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నోడల్ అధికారి వీపి గౌతమ్, ఓఎస్డి కృష్ణ ఆదిత్య ఏటూర్ నాగారం ప్రాజెక్ట్ అధికారి హనుమంతు కొండిబా జెడ్ లు జ్ఞాపికను గవర్నర్లకు అందజేశారు.

ఎండోమెంట్ శాఖ అధికారులు లడ్డు బెల్లం ప్రసాదాలు, శాలువా, మెమెంటో ఇద్దరి గవర్నర్లకు అందజేశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ దీవెనెలు దేశంలోని ప్రతి ఒక్కరికి కలగాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ తల్లి ఆశీస్సులు అందాలని తెలిపారు. గిరిజన సంస్కృతిని ఇలాగే కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు. తనకు చాలా ఆనందంగా ఉందని జాతరకు రావడం చాలా గొప్ప అనుభవం అని పేర్కొన్నారు. ఇంత గొప్ప జాతరకు హాజరుకావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ జాతర ప్రకృతితో మమేకమైందని తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తల్లిని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.

More Press Releases