డాలస్ లో పద్మవిభూషణ్ రామోజీ రావు గారికి ఘననివాళి
డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్టెక్స్) ఆధ్వర్యంలో అక్షర యోధుడు, ప్రధాన సంపాదకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారికి డాలస్ నగరంలో అధికసంఖ్యలో హాజరైన ప్రవాసాంధ్రులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ “రామోజీ రావు ఒక విశిష్ట వ్యక్తి అని, ఏ రంగంలో ఆయన దృష్టిపెట్టినా ఆ కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమయ్యేవారని, ప్రతిభకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, వ్యక్తిగతంగా ఆయనతో అనేక అనుభవాలున్నాయని, తెలుగుభాష అంటే ఆయనకు ప్రాణమని, సంగీత, సాహిత్య వికాసాల కోసం నిరంతరం కృషిచేసిన కృషీవలుడని, చివరకు మరణాన్ని కూడా చిరునవ్వుతో ఆహ్వానించిన ధీరోదాత్తుడు” అన్నారు.
తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ ఒక చిన్న గ్రామంలో, సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఎవ్వరూ ఊహించలేనంత ఎత్తకు ఎదిగిన రామోజీ రావు గారి జీవితం కేవలం తెలుగువారికే గాక విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఒక సంధర్బంలో రామోజీ రావు గారిని ప్రత్యేకంగా కలసి ఒక గంటకు పైగా ఆయనతో జరిపిన సంభాషణ నా జీవితంలో ఒక మధురమైన అనుభూతి అన్నారు. రామోజీ రావు గారి జీవన ప్రస్థానంలో సాగిన కృషి, పట్టుదల, క్రమశిక్షణ, దూరదృష్టితో ఎన్ని కష్టాలు ఎదురైనా, తలవంచకుండా ధైర్యంగా ఎదుర్కొనడం, జీవనగమనంలో ఎంతమంది ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, సున్నితంగా తిరస్కరిస్తూ, తమ ఆశయ సాధనపై దృష్టిపెట్టి అనుకున్నది సాధించడం ముఖ్యమనే ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయం, ఏ రంగంలో ఉన్నవారికైనా అనుసరణీయం” అన్నారు.
ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు తనికెళ్ళ భరణి, కళారత్న కె.వి సత్యనారాయణ, ప్రసిద్ధకవి డా. వడ్డేపల్లి కృష్ణ, ప్రముఖ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, రచయిత సాయి లక్కరాజు, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస చక్రవర్తి తట్టా, ప్రముఖ కళాకారుడు చంద్రశేఖర్, తేజస్వి సుధాకర్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై రామోజీ రావు గారికి ఘన నివాళులర్పించారు.
తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, టాన్ టెక్స్ అధ్యక్షులు సతీష్ బండారు, టాన్ టెక్స్ పాలకమండలి అధిపతి సురేష్ మండువ, టాన్ టెక్స్ తెలుగు సాహిత్యవేదిక సమన్వయకర్త దయాకర్ మాడా, వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు - చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, మాధవి లోకిరెడ్డి, దీపికా రెడ్డి, అర్పితా రెడ్డి, కళ్యాణి తాడిమేటి, చైతన్య రెడ్డి గాదె, రఘునాథ రెడ్డి, నరసింహ పోపూరి, వీర లెనిన్ తుళ్ళూరి, శ్రీకాంత్ పోలవరపు, శ్రీనాథ్ వట్టం, ప్రవీణ్ బిల్లా, మురళీ వెన్నం, పరమేష్ దేవినేని, సుబ్బు జొన్నలగడ్డ, అనంత్ మల్లవరపు, శారద సింగిరెడ్డి, లెనిన్ వేముల, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఏం.వి.ఎల్ ప్రసాద్, డా. పూదూర్ జగదీశ్వరన్, డా. పులిగండ్ల విశ్వనాథం, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరి ప్రబృతులు రామోజీ రావు గారి నిలువెత్తు చిత్రానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.