జనసేన లక్ష్యం తప్పకుండా సాధిస్తాం: పవన్ కల్యాణ్
- నేనెవరికీ గులాంగిరీ చేయను... ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తాను •
- వర్జీనియాలో ప్రవాసాంధ్ర జనసేన అభిమానుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
• ఓటు అమ్మకం నష్టం ఇప్పుడు తెలియకపోవచ్చు ఎంతోమంది మహానుభావులు మేధోమథనం చేసి రాజ్యాంగం రూపకల్పన చేస్తే.. కొంతమంది రాజకీయ నాయకులు పద్దతి పాడు లేకుండా రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఓటు అమ్ముకునే దుస్థితికి దేశం దిగజారిపోయింది. ఓటు అమ్ముకుంటే జరిగే నష్టం ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ బిడ్డల భవిష్యత్తుకు చాలా గట్టి దెబ్బ తగులుతుంది. ఇవన్ని చెబితే వెటకారాలు చేస్తారు. కానీ కొన్ని రోజులకు మనం చెప్పిందే నిజమని నమ్మి మన వెంట నడుస్తారు. ఓడిపోయిన తరవాత ఎంత పర్సెంటేజ్ ఓటు వచ్చింది అని అడిగితే ఏడు నుంచి ఎనిమిది శాతం అని చెప్పారు... అంటే లక్షల మంది మనల్ని గుర్తించారు అన్నాను. వారికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు వెళ్దామని చెప్పి పార్టీ కార్యకలాపాల్లోకి వెళ్లిపోయాను. నేను గులాంగిరీ చేసి బతకలేను...ఆత్మగౌరవంతో వెళ్తాను. అందరి ఆత్మగౌరవం నిల్పాలి. అది లభించని చోట వజ్రాలు ఇచ్చినా ఉండను. వాటిని కింద పడేసి వెళ్లిపోతాను. రాష్ట్రం విడిపోయాక చాలా బాధ్యతగా ఉండాలి. అక్కడ వ్యక్తిగత రాజకీయ లబ్ధి కాదు... ప్రజల గురించి ఆలోచించాలి అని భాగస్వామ్యపక్షాలకు చెప్పాను. మార్పు కోసం వచ్చినవాడిని. నా స్వీయ రాజకీయ లబ్ధి చూసుకొనేవాడినే అయితే బీజేపీ, టీడీపీతో గొడవపెట్టుకోను. గెలిచే సీట్లు తీసుకొని వారితో కలిసేవాడిని. ఇందులో నా ప్రయోజనం ఉండదు. నేను ఓడిపోయినా అదో అవమానంగా భావించలేదు. గెలవలేకపోవచ్చు... కానే చిత్తశుద్ధితో బలమైన పోరాటం చేశాను. పని చేసినవాళ్ళకి పిలిచి టికెట్ ఇచ్చాను. అవమానం ఎందుకు ఉండాలి... వేల కోట్లు దోచేసి, అక్రమాలు చేసి... ఆ తరవాత జైల్లో పెడతారనుకొనేవాళ్ళకి ఓటమి అంటే భయం. క్షణికమైన భావోద్వేగాలు, కారణాలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన డబ్బులో, ఇతర ఒత్తిళ్ళకో లోబడి అటువైపు కొందరు వెళ్ళిపోయినా... జనసేన పట్ల నిజమైన అభిమానం ఉన్నవారు అలాగే నిలబడ్డారు. • ధైర్యంగా ముందుకే ఈ ఎన్నికల్లో వైరిపక్షాలు వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయి. అలాంటి రాజకీయ పద్మవ్యూహంలోకి వెళ్ళి క్షేమంగా వచ్చింది జనసేన పార్టీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఓ 20 రోజుల తరవాత నేను విజయవాడలో ఉండగా కేరళ నుంచి వచ్చిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి నన్ను కలిశారు. ‘మీరు ఏ విధానాల గురించి, పబ్లిక్ పాలసీల గురించి ఆలోచిస్తున్నారో అవి కేరళలో ఉన్నాయి.. ఒకసారి వచ్చి చూడండి... ఇప్పుడు వచ్చిన ఫలితం గురించి నిరాశ చెందవద్దు. మీ విధానాలు బాగున్నాయి’ అని చెప్పారు. అడుగడుగునా పరాజయం వెనక్కి వెళ్లిపోమని బెదిరిస్తుంది... కానీ ధైర్యంతో ముందుకే వెళ్దాం. అపజయం అనేది వ్యర్థాలను తొలగించుకొంటూ విజయం దిశగా వెళ్ళే ప్రక్రియలో భాగం. ఓటమి లేదు.. మజిలీయే ఉంది. ఒక గమ్యం నుంచి మరో గమ్యానికి వెళ్తాను. జనసేన లక్ష్యం కచ్చితంగా సాధిద్దాం” అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ శేఖర్ పులి పాల్గొన్నారు.