రోబోటిక్ సర్జరీతో మూత్రాశయ రంధ్రానికి చికిత్స చేసిన ఏఐఎన్‌యూ వైద్యులు
** 35 ఏళ్ల క్రితం సాధారణ ప్రసవం కారణంగా రంధ్రం*
హైదరాబాద్, జూన్ 7th, 2024: యూరాలజీ రంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించేలా.. మూత్రాశయానికి పడిన అతిపెద్ద రంధ్రాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా విన్సీ రోబోటిక్ టెక్నాలజీ సాయంతో మూసేసిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు.. రోగికి ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఏఐఎన్‌యూలోని సీనియర్ కన్సల్టెంట్ మహిళా యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా కూడా ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు.
“అనంతపురం జిల్లాకు చెందిన 56 ఏళ్ల మహిళ.. గత 35 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అప్పట్లో సాధారణ ప్రసవం అయినప్పుడు ఆమె మూత్రాశయానికి పెద్ద రంధ్రం పడింది. అది దాదాపు ఐదారు సెంటీమీటర్ల పొడవు ఉంది. ఈ రంధ్రం కారణంగా ఆమెకు మూత్రం నిలిచేది కాదు. ఎప్పుడూ కారిపోతూనే ఉండేది. డైపర్లు లేదా ఏదైనా బట్ట అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ ఆమె ఎలాగోలా కాలం గడిపేసేవారు. ఇటీవల ఆమె భర్తకు మూత్రపిండాల్లో రాళ్లు తీయించడానికి ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలను చూసి, తన సమస్య కూడా చెప్పి, దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని ఆమె అడిగారు. అప్పుడు తగిన వైద్య పరీక్షలు చేసి చూసి.. ఇన్నాళ్లుగా ఎందుకు చూపించుకోలేదని అడిగాం. దానికి ఆమె.. కొందరు వైద్యుల వద్దకు వెళ్లినా రంధ్రం పెద్దది కావడంతో తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేయడం లాంటి కారణాలు చెప్పారు. దాంతో గత 35 ఏళ్లుగా ఆమె ఇలాగే బాధపడుతున్నారు.
ఇలాంటి సమస్యలకు సాధారణ శస్త్రచికిత్స చేస్తే ఎంతో కొంత చిన్న చిన్న రంధ్రాలు అలాగే వదిలేసే ప్రమాదం ఉంటుంది. కానీ ఏఐఎన్‌యూలో ఉన్న అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ సాయంతో మిల్లీమీటర్ల స్థాయి రంధ్రాలను కూడా వదలకుండా మొత్తం రంధ్రాన్ని చిన్న చిన్న కోతలతోనే పూడ్చగలిగాం. ఇందులో అత్యంత సున్నితమైన కణజాలాలు ఉంటాయి. వాటినీ కుట్టాలి. కుట్లు కూడా అత్యంత కచ్చితత్వంతో వేయాలి. రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ద్వారా దీన్నంతటినీ అత్యంత జాగ్రత్తగా, పూర్తి నిబద్ధతతో, ఏమాత్రం పొరపాట్లకు తావివ్వకుండా పూర్తిచేయగలిగాం.
ఈ అసాధారణ విజయం ఏఐఎన్‌యూ ఆస్పత్రిలో ఉన్న సరికొత్త ఆవిష్కరణలకు, వైద్యచికిత్సలలో నిరంతర ప్రయత్నాలకు నిదర్శనం. ఈ రోగి కొన్ని దశాబ్దాలుగా పడుతున్న బాధలను కేవలం కొద్ది గంటల్లోనే పూర్తిగా నయం చేయగలిగి, ఆమె జీవితానికి పెద్ద ఊరట కల్పించినందుకు ఎంతో గర్వపడుతున్నాం.
ఇలాంటి మూత్రశయ రంధ్రాలు ప్రస్తుత కాలంలో చాలా అరుదుగా వస్తాయి. ఎవరికైనా కొన్ని మిల్లీమీటర్ల స్థాయిలోనే పడుతుంటాయి. అలాంటి కేసుల్లోనూ వాళ్లు కొద్ది వారాలకే గమనించి వెంటనే వైద్యుల వద్దకు వస్తారు, వాటిని వారు చిన్నపాటి శస్త్రచికిత్సతో నయం చేసేస్తారు. కానీ ఇలా 35 ఏళ్లుగా అంత పెద్ద రంధ్రంతో బాధపడుతున్న రోగి ఉన్నప్పుడు.. వారికి చికిత్స చేసేందుకు ఇలాంటి రోబోటిక్ శస్త్రచికిత్స సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా కీలకం. అప్పుడే వారి జీవననాణ్యతను పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలం” అని డాక్టర్ గౌస్ వివరించారు.
వైద్యశాస్త్రంలో పరిమితులు రోజురోజుకూ చెరిగిపోతున్నాయి. అందువల్ల ఇలాంటివి లేదా ఇంతకంటే తీవ్రమైన సమస్యలనైనా పరిష్కరించడం అనేది ఆదునిక టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో పెద్ద ఇబ్బంది కాదు. డాక్టర్ గౌస్, ఏఐఎన్‌యూ ఆస్పత్రిలోని వైద్యబృందం ఇలాంటి మూత్రాశయ రంధ్రాల చికిత్సలలో సరికొత్త ప్రమాణాలను సృష్టించి, యూరాలజీ రంగంలో కొత్త ఆశలు రేపారు.