జీఓ నెం13పై పవన్ కల్యాణ్ స్పందన!
'చీకటి జిఓ' అన్న పవన్
'అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్సు కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జి.ఓ.నెం.13ను అర్ధరాత్రి వేళ జారీచేయడం తనను నమ్మి 151 అసెంబ్లీ స్థానాలలో గెలిపించిన ప్రజలను మోసంచేయడానికా? లేదా రాజధాని తరలింపుపై కేసులు విచారణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కళ్లుగప్పడానికా? ఇటువంటి చర్యల వల్ల బలైపోయేది చివరికి దానిపై సంతకాలు చేసే ఉద్యోగులే. రాష్ట్ర సచివాలయం ఆధ్వర్యంలో పని చేయవలసిన రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో అందులో పనిచేసే వారికీ అర్ధం కాకుండా ఉంది.
ఇలా తరలించడం వల్ల తాము కోర్ట్ కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటామో అని భయపడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు అందరినీ ముందుండి నడిపించే అత్యున్నత స్థాయి అధికారి సెలవు పెట్టేద్దామన్న ఆలోచనలో వున్నారని వస్తున్న వార్తలు వారు ఎంత అభద్రతాభావంలో వున్నారో తెలుపుతున్నాయి. జి.ఓ.నెం.13 విడుదలైనప్పుడే ఇది రాజధాని తరలింపుపై దాఖలైన కేసుల పరిధిలోకి వస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. వారు అనుకున్న విధంగానే ఈ జి.ఓ. హైకోర్ట్ ముందుకు వచ్చింది. ఇకనైనా వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ఈ దొడ్డిదారి చీకటి జి.ఓ.లు ఆపడం సర్వత్రా శ్రేయస్కరం.' అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.