క్ష‌య వ్యాధిని అరిక‌డుదాం- అంత‌ర్జాతీయ క్ష‌య వ్యాధి దినోత్స‌వం- మార్చి 24న

Related image

డాక్టర్. విశాల్ కుమార్ చిటికేశి

కన్సల్టెంట్ క్లినికల్ మరియు ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్

కిమ్స్ హాస్పిట‌ల్స్‌, సికింద్రబాద్.

 
ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి 24న ప్ర‌పంచ క్ష‌య (టిబి) వ్యాధి దినోత్స‌వంగా నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా క్ష‌య వ్యాధి గురించి అవ‌గాహన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. అవును మనం క్షయ వ్యాధిని అంతం చేయగలం అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నారు.

ఇప్ప‌టికీ మన దేశంలో  ప్ర‌తి రోజూ 1400 మందికి పైగా ఈ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణిస్తున్నారంటే... ఈ వ్యాధి ఎంత ప్రాణాంత‌క‌ర‌మో మ‌నం అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధికి నివార‌ణ‌, చికిత్స ఉన్నా... వ్యాధి గురించి స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల వ్యాధి నిర్ధారణ, చికిత్స‌లో మ‌రియు టిబి స‌మూల నిర్మూల‌న‌లో ఎన్నో అవాంత‌రాలు ఎద‌రువుతున్నాయి.

ఈ క్ష‌య వ్యాధి 'మైకోబాక్టీరియం ట్యుబ‌ర్కులోసిస్' అనే బ్యాక్టీరియా వ‌ల్ల వ‌స్తుంది. ఊపిరితిత్తులు లేదా గొంతు టిబి ఉన్న రోగి ద‌గ్గిన‌ప్పుడు లేదా మాట్లాడినప్పుడు వెలుబ‌డే తుంప‌రలు ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి పీల్చిన‌ప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. టిబి వ్యాధి సాధార‌ణంగా ఊరిపితిత్తుల‌కు సంక్ర‌మిస్తుంది. కొన్ని సార్లు ఈ వ్యాధి మెడ చుట్టూ ఉన్న లింఫ్ గ్రంథుల‌కు (లింఫ్ నోడ్ టిబి), వెన్నెముక‌కు (స్పైన్ టిబి), మెద‌డు (టిబి మెనింజైటిస్‌), గుండెకు, ఎముక‌ల‌కు మ‌రియు కీళ్ల‌కు ఇలా మ‌న శ‌రీరంలో ఏ అవ‌య‌వానికైనా రావ‌చ్చు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడతారు.

గత 2 దశాబ్దాలుగా భారతదేశంలో క్షయవ్యాధి సంభవం తగ్గుతోంది. దీనికి విరుద్ధంగా, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ సంభవం ముఖ్యంగా కొత్త ప్రారంభంలో టీబీ నిర్ధారణలో పెరుగుతోంది.

న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ అంటే DNA ఆధారిత పరీక్షల ఆధారంగా టీబీ మరియు డ్రగ్ రెసిస్టెన్స్‌ని నిర్ధారించడానికి అందుబాటులో ఉన్న వివిధ రకాల డయాగ్నోస్టిక్‌ల గురించి వైద్య సోదరులలో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ పరీక్షలు చాలా ప్రారంభ దశలో టీబీ నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు చేశాయి.

చికిత్సా అంశాలలో, బెడాక్విలిన్ మరియు డెలామానిడ్ వంటి డ్రగ్ రెసిస్టెంట్ టిబికి కొత్త ఔషధాల లభ్యత చాలా మంది రోగులకు ఈ వ్యాధి నుండి తక్కువ వ్యవధిలో కోలుకోవడానికి సహాయపడింది.

ఊపిరితిత్తుల టిబి వ‌చ్చిన వారికి దీర్ఘ‌కాలికంగా ద‌గ్గు (రెండు వారాలకు మించి), గ‌ళ్ల ప‌డ‌డం, జ్వ‌రం, ఛాతీనొప్పి, ఆక‌లి లేక‌పోవ‌డం, బ‌రువు త‌గ్గ‌డం, కొన్నిసార్లు ద‌గ్గిన‌ప్పుడు ర‌క్తం ప‌డ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు స‌రైన స‌మ‌యంలో సంప్ర‌దిస్తే, వారికి ఛాతి ఎక్స్‌రే లేదా సి.టి స్కాన్‌, గ‌ళ్ల ప‌రీక్ష మరియు టిబి  రెసిస్టెన్స్ వంటి వివిధ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఈ వ్యాధిని గుర్తిస్తారు. స‌రైన స‌మ‌యంలో వ్యాధి నిర్ధారణ చేస్తే మందుల‌తో ఈ వ్యాధిని వంద శాతం న‌యం చేయ‌వ‌చ్చు. అయితే ఈ చికిత్స స‌మ‌యం 6 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. ఈ 6నెల‌ల స‌మ‌యంలో, ప‌ల్మోనాల‌జిస్ట్ వైద్యుని ప‌ర్య‌వేక్ష‌ణలో క్ర‌మం త‌ప్ప‌కుండా మందుల‌ను వేసుకోవాలి. కొంత మంది కొన్ని వారాల చికిత్స అనంత‌రం జ్వరం, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాల నుండి ఉప‌శ‌మ‌నం పొందాక‌, వైద్యుల‌ను సంప్ర‌దించ‌కుండా మందులు వేసుకోవ‌డం మానేస్తారు. ఇలాంటి వారిలో మందుల‌కు లొంగ‌ని టిబి (డ్ర‌గ్ రెసిస్టెంట్ టిబి) లేదా టిబి జ‌బ్బు రెండోసారి రావ‌డం, ఊపిరితిత్తుల‌లో దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు వేధించ‌డం జ‌ర‌గ‌చ్చు.

డ్ర‌గ్ రెసిస్టెంట్ టిబి వ‌చ్చిన వారు ద్వితీయ శ్రేణి టిబి మందులు 9 నుండి 24 నెల‌ల వ‌ర‌కు వాడాల్సివ‌స్తుంది. ఈ చికిత్స‌లో వాడే మందుల‌కు ఒకింత దుష్ప్ర‌భావాలు ఎక్కువ క‌నుక, త‌రుచూ ర‌క్త పరీక్ష‌లు,గుండె పరీక్షలు, వినికిడి మ‌రియు కంటి ప‌రీక్ష‌లు చేయాల్సి వ‌స్తుంది. టిబిని త్వ‌ర‌గా గుర్తించ‌డం, 6 నెల‌ల చికిత్స క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం ద్వారా చాలా వ‌ర‌కు ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్ రెసిస్టెంట్ టిబి పెర‌గ‌కుండా నియంత్రివ‌చ్చు.

మాస్క్ ధ‌రించ‌డం, చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవ‌డం, ద‌గ్గిన‌ప్పుడు లేదా తుమ్మిన‌ప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవ‌డం వంటి జాగ్ర‌త్త‌ల ద్వారా టిబిని అరిక‌ట్ట‌వ‌చ్చు.

 మనమందరం బాధ్యతతో వ్యవహరించి టిబి ని సమూలంగా నిర్మూలిద్దాం.

More Press Releases