తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహణలో ‘అవధాన వైభవం’
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 65 వ సాహిత్య సమావేశం: అవధాన వైభవం – “నేటి అవధానుల నోట ... నాటి మేటి అవధానుల సాహితీఝరి” ఘనంగా జరిగింది.
తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తన తొలి పలుకులలో “అందరినీ ఆకర్షించి, ఆహ్లాదపరచే కళ మన తెలుగు అవధానం అని, అలాంటి ప్రక్రియలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అవధానులందరికీ ఆహ్వానం అంటూ” సభను ప్రారంభించారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొంతమంది అవధానులు, అమెరికా దేశంలో ఉన్న మరికొంతమంది అవధానులు ఒకే వేదిక మీద పాల్గొన్న ఈ అవధానుల సమ్మేళనం సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిలుస్తుందన్నారు. 13 వ శతాబ్దకాలం నుండి అవధానకళ ఉన్నప్పటికీ, విద్వాన్ మాడభూషి వేంకటాచార్యులు గార్ని ఆధునిక కాలంలో అవధానానికి ఆద్యులుగా పరిగణిస్తారు. 150 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 22, 1872లో కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో మొదటి అవధానం జరిగినట్లు చారిత్రిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి విశిష్ట అవధానకళ అంతరించిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత, తెలుగు ప్రభుత్వాల మీద, విశ్వవిద్యాలయాల మీద, సాహితీ సంస్థలపైన ఉందన్నారు.”
ముఖ్యఅతిథిగా హాజరైన అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ .... తెలుగు వారికే సొంతమైన ఈ అవధాన ప్రక్రియలో ఎందరో అవధానులు అత్యంత ప్రతిభావంతంగా అవధానాలు చేశారని, కాలక్రమంలో యీ అవధానకళ కూడా అనేక మార్పులకు గురైనప్పటికీ, యువ అవధానులను తయారుజెయ్యడం, అవధానవైభవం కోల్పోకుండా భావితరాలకు ఈ కళను అందించవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని గుర్తుచేస్తూ, శతావధాని గాడేపల్లి వీర రాఘవ శాస్త్రి గారి అవధానవైభవాన్ని గొప్పగా ఆవిష్కరించారు.”
విశిష్ట అతిథులుగా పాల్గొన్న అవధానులలో .. మహిళావధాని డా. బులుసు అపర్ణ - అవధాని శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సాహితీ వైభవాన్ని; అవధాని డా. బోచ్కర్ ఓం ప్రకాష్ - జంటఅవధానులు: తిరుపతి వేంకటకవులు (శ్రీ దివాకర్ల తిరుపతిశాస్త్రి, శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి) గారి వైభవాన్ని, ఆముదాల మురళి - అవధాని పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు అవధాన విన్యాసాలను; అవధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ - జంట అవధానులు: వేంకట రామకృష్ణకవులు (శ్రీ ఓలేటి వేంకటరామశాస్త్రి, శ్రీ వేదుల రామకృష్ణశాస్త్రి) అవధాన కళను; 17 సంవత్సరాల వయస్సులోనే శతావధానం చేసిన ఉప్పలధడియం భరత్ శర్మ -శతావధాని డా. కడప వెంకట సుబ్బన్న పాండిత్య ప్రతిభను; అమెరికాదేశపు తొలి అవధాని డా. పుదూర్ జగదీశ్వరన్ - కొప్పరపు సోదరకవుల (వేంకటసుబ్బరాయశర్మ, వేంకటరమణశర్మ) ఆశుకవితా పద్యవేగం గురించి; అమెరికా అవధాని నేమాని సోమయాజులు - అవధాని శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు సాహిత్య వైభవాన్ని చక్కగా విశ్లేషించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న అవధానులందరూ అలనాటి అవధానుల సమస్యాపూరణం, దత్తపది, ఆశుకవితా అంశాలను గొప్పగా ఆవిష్కరించి సభను విజయవంతం చేశారు.