ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి... గోనె ప్రకాశ్‌ రావు బహిరంగ లేఖ

Related image

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి...

గోనె ప్రకాశ్‌ రావు బహిరంగ లేఖ....

 

వైఎస్‌ఆర్‌ కుటుంబంతో నాకు 30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి పేరు ప్రతిష్టతలకు భంగం కలుగుతుండడంతో బాధతప్త హృదయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముద్దుబిడ్డ అయిన శ్రీమతి షర్మిలపైన జరుగుతున్న విషప్రచారాన్ని తట్టుకోలేక కొన్ని వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురాదల్చాను. శ్రీమతి షర్మిలపైన జరుగుతున్న ప్రచారంలో కచ్చితంగా మీ హస్తం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, మీకు అత్యంత సన్నిహితులు ఆమెపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, విషప్రచారంతో పాటు వాటికి మీ కనుసైగలలో నడిచే వివిధ మీడియా సంస్థలతోపాటు మీ సొంత మీడియా అయిన సాక్షి పత్రిక, సాక్షి టీవీలో తాటికాయలంత అక్షరాలతో వస్తున్న వార్తలే అందుకు నిదర్శనం.

నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ...తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ... తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన ఈ సినిమా పాట మీరు వినే ఉంటారు. మీ కోసం, వైఎస్‌ఆర్‌సీపీ కోసం కాళ్లు బొప్పిలెక్కేటట్టు సుదీర్ఘ పాదయాత్ర చేసిన మీ చెల్లెలు శ్రీమతి షర్మిలపై మీరు కనీసం ప్రేమానురాగాలు చూపగాపోగా ఆమెపై దుష్ప్రచారం చేయడానికి మీరే కుట్రలు, కుతంత్రాలు పాల్పడడం క్షమించరాని నేరం.

తోబుట్టువు, ఇంటి ఆడబిడ్డ కంటనీరు పెట్టడం మీకు, మీ కుటుంబానికి మంచిది కాదు. కనీసం ఇప్పటికైనా మీ తోబుట్టువు శ్రీమతి షర్మిలపైన మీరు, మీ సన్నిహితులు మీ సోషల్‌ మీడియా,  మీ సొంత మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని వైఎస్‌ఆర్‌ కుటుంబం శ్రేయోభిలాషిగా మీకు నేను హితవు చెబుతున్నాను.

పదవి కోసం, ఆస్తుల కోసం, మీ స్వార్థం కోసం సొంత చెల్లెలిపైనే ఇంత దారుణానికి ఒడిగడుతారని నేను కలలో కూడా ఊహించలేదు.  శ్రీమతి షర్మిలపై మీరు చేయిస్తున్న విషప్రచారంతో స్వర్గంలోని దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది. దివంగత నేత పేరు చెప్పుకొని మీరు అధికారం, ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు. అటువంటిది మీరు దివంగత నేతకు నిజమైన వారసులైతే ఆయన ఆత్మ క్షోభించే విధంగా ప్రవర్తించరు.

శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా తాను ‘‘జగనన్న వదిలిన బాణాన్ని’’ అని స్పష్టంగా ప్రకటించారు. ఆమె స్వార్థపూరితంతో పాదయాత్ర చేస్తే మీరు వదిలిన బాణం అని ఎందుకు ప్రకటిస్తారు..? 

మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత, వైఎస్‌ఆర్‌సీపీని బతికించుకోవడానికి ఏమి చేస్తే బాగుంటుందని పార్టీ ముఖ్యుల మధ్య చర్చ జరిగిన సందర్భంలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు పాదయాత్ర, లేదా బస్సుయాత్ర చేస్తే బాగుంటుందని పలువురు సీనియర్లు నేతలు సూచించడం జరిగింది. ఇందులో నాకు కూడా భాగస్వామ్యం ఉంది.

పార్టీని బతికించడం కోసం, కష్టాల్లో మీకు అండగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో మీ సోదరి తన కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా వదులుకొని కష్టానష్టాలు ఎదుర్కొంటూ మీకోసం దాదాపు 3200 కి.మీ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా ఆమె కాలికి గాయమైనా, అప్పటి టీఆర్‌ఎస్‌ నేతలు ఇబ్బంది పెట్టినా మొక్కువాని దీక్షతో పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసి వైఎస్‌ఆర్‌సీపీని బతికించారు. ఈ రోజు మీరు అనుభవిస్తున్న అధికారం మీ సోదరి ఆ రోజు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టడం వలనే. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. కనీసం మీరు బయటికి చెప్పకపోయినా మీ అంతరాత్మను ప్రశ్నించుకుంటే వాస్తవాలు తెలుస్తాయి.

మీ మంది మార్బలం చేత శ్రీమతి షర్మిల పాదయాత్ర తన స్వార్థం కోసం చేసిందని, వాస్తవానికి ఆ పాదయాత్ర  మీ భార్య శ్రీమతి భారతి చేయాల్సిందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మీ సతీమణి పాదయాత్ర చేయాలనే విషయం పక్కనపెడితే కనీసం శ్రీమతి షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆమెతో కలిసి  ఒక్కరోజు కూడా పాదయాత్రలో పాల్గొన్న దాఖలాలు నాకు గుర్తున్నంత వరకూ లేవు. ఆమె పాదయాత్ర చేస్తున్న సందర్భంలోనైనా వారి పిల్లలనైనా కనీసం తన వద్ద ఉంచుకొని వారి బాగోగులను చూసినట్టు కూడా లేదు. అటువంటిది శ్రీమతి షర్మిల తన స్వార్థం కోసం పాదయాత్ర చేసిందని మీ అనుచరులు ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం..?

వైఎస్‌ఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ఆయన అభిమానులు అందరూ కలిసి స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీ కష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల గారు 3200 కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారా...? లేదా..? మీరు జైలులో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచింది వైఎస్‌ఆర్‌ శ్రేయోభిలాషులా...? లేదా ఇప్పుడు మీ చుట్టూ చేరిన భజనపరులా...? వ్యక్తిగతంగా షర్మిలమ్మను విమర్శిస్తున్న మీ మంది మార్బలం మీరు జైలులో ఉన్నప్పుడు ఎక్కడున్నారు...?  రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యం అని చెప్పే మీరు రాజన్న కుటుంబాన్ని విచ్ఛినం చేస్తున్నారనేది నిజం కాదా..?

మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, జైలులో ఉన్నప్పుడు శ్రీమతి షర్మిల, మీ తల్లిగారు శ్రీమతి విజయమ్మ గారు నిద్రాహారాలు మాని మీ కోసం, మీరు స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీ కోసం ఎండనక, వాననక 24 గంటలు కష్టపడి పార్టీని, మిమ్మల్ని రక్షించుకున్నారు. ఈ విషయం మీరు, మీ మంది మార్బలం మరిచిపోయినా రాష్ట్ర ప్రజలు, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి శ్రేయోభిలాషులు మాత్రం మరిచిపోరు.

చేసిన మేలును మరవకపోవడం ‘‘వైఎస్‌ఆర్‌ బ్రాండ్‌’’... అటువంటిది ఆయన కుమారుడైన మీరు మీ స్వార్థం కోసం చేసిన మేలును మరిచిపోతే ‘‘వైఎస్‌ఆర్‌ బ్రాండ్‌కు’’ మీరు తిలోదకాలు ఇచ్చినవారవుతారు.

మాట తప్పను....మడమ తిప్పను అని నిత్యం మీరు వల్లిస్తుంటారు. వాస్తవానికి మీ నైజం మాట తప్పడం... మడమ తిప్పడం... మేలు చేసిన వారిని మరిచిపోవడం... పదకి కోసం, ధనం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం తల్లిని, సోదరిని, ఆప్తులని, దివంగత నేత వైఎస్‌ఆర్‌ శ్రేయోభిలాషులను దూరం చేసుకోవడం. దీనికి అనేక ఉదంతాలు ఉన్నాయి.

మీకు సహాయం చేసిన వారిని, మీకు అండగా నిలబడిన వారిపట్ల ఎటువంటి కృతజ్ఞతా భావం లేకుండా వారిని మీ అవసరం తీరిన తర్వాత వదులుకుంటారనే విషయం అనేక సార్లు రుజువయ్యింది. మీరు జైలులో ఉన్నప్పుడు గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకొని మీ తల్లిగారు శ్రీమతి విజయమ్మ గారు పార్టీ కోసం అనేక కష్టాలు, నిందలు మీకోసం పడ్డారు. అరెస్టయ్యారు. ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. పార్టీని నిలబెట్టారు. అంత త్యాగం చేసినా మీ సొంత తల్లిని ఎటువంటి అధికారాలు లేని గౌరవ అధ్యక్ష పదవి నుండి మీరు బలవంతానా తొలగించారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు.

అదే విధంగా మీ సమీప బంధువు మీ తరఫున అనేక విషయాలను చక్కపెట్టిన శ్రీ సునీల్‌రెడ్డిని, మీరు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడిన శ్రీ గాలి జనార్థన్‌రెడ్డిని సీబీఐ వాళ్లు అరెస్టు చేసినప్పుడు వారెవరో మీకు తెలియదని మీడియా సాక్షిగా ప్రకటించి మీ పిరికితనాన్ని బయటపెట్టుకున్నారు. మీ కోసం జైలు పాలైన శ్రీ విజయ్‌ సాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌, ఐఏఎస్‌ అధికారిణి శ్రీమతి శ్రీలక్ష్మి, ఐఏఎస్‌ అధికారి శ్రీ బీ.పీ ఆచార్య తదితరులు అరెస్టయినప్పుడు వారిని ఓదార్చడానికి ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీరు వారితో ములాఖత్‌ అయి వారికి అండగా నిలబడలేదు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. ఈ ఉదంతాలన్నీ పరిశీలిస్తే మీరెంత స్వార్థపరులో స్పష్టమవుతుంది.

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తన ఆత్మగా చెప్పుకున్న డాక్టర్‌ కేవీపీ రామచంద్రారావు గారిని మీరు, మీ కుటుంబంలోని కొంత మంది సభ్యులు, మీ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారిని రెచ్చగొట్టి ఆయనపై విమర్శలు చేయించిన విషయం మీరు మర్చిపోయినా, దివంగత నేత వైఎస్‌ఆర్‌ అభిమానులు మర్చిపోరు. శ్రీమతి కొండా సురేఖ గారు మీ తండ్రి గారికి ఆత్మ అయిన శ్రీ కేవీపీగారిపైన చేసిన నిరాదరణమైన ఆరోపణలను ఈ రోజు వరకూ మీరు ఖండిరచలేదు. మీరు ప్రోత్సహించి మీ తండ్రి గారి ఆత్మ అయిన కేవీపీపై ఆరోపణలు చేయించి తిట్టించినందుకు కచ్చితంగా స్వర్గంలో వైఎస్‌ఆర్‌ గారి ఆత్మ క్షోభకు గురయి ఉంటుంది.  కొండా సురేఖ తన తప్పు తెలుసుకొని బహిరంగంగానే ఓ టీవీ చానెల్‌లో ఆమె చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పింది. కనీసం ఇప్పటికైనా మీరు మీ తండ్రి గారికి ఆత్మ అయిన కేవీపీ గారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి పాపపరిహారం చేసుకోవాలని కోరుతున్నాను.

శ్రీమతి షర్మిల పాదయాత్ర చేసినా, ఎన్నికల్లో ప్రచారం చేసినా 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీసీ గెలవలేదని మీ అనుచరులు, సకల శాఖ మంత్రి (సజ్జల రామకృష్ణరెడ్డి), పకోడిగాళ్లు (కొడాలి నాని), రింగు రాణీలు (రోజా) తదితరులు  అనేక విమర్శలు ఆమెపై చేస్తున్నారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మరణానంతరం జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో మీరు విస్తృతంగా ప్రచారం  చేశారు. మీరు ప్రచారం చేసిన చోట్ల ఎన్ని వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందింది..? ప్రతిపక్ష నేతగా మీరు దాదాపు పదిహేను రోజుల పాటు నంద్యాల ఉప ఎన్నికల్లో గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 25 వేల ఓట్ల పైచిలుకుతో గెలుపొందిన మాట వాస్తవం కాదా..?

2014లో మీరు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్ని గెలుపొందారు..? మీ తల్లిగారు  విజయమ్మగారిని విశాఖపట్నంలో ఎందుకు గెలిపించుకోలేకపోయారు..? మీరు జైలులో ఉన్నప్పుడు విస్తృతంగా ప్రచారం చేసి పదిహేను మందిని ఉప ఎన్నికల్లో విజయమ్మగారు, షర్మిల గారు గెలిపిస్తే 2014 ఎన్నికల్లో  మెజార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు..? దయచేసి మీ సోదరి, మీ తల్లిగారు మీ కోసం చేసిన త్యాగాలను తక్కువ చేసి చూపకండి. 2019 ఎన్నికల్లో కూడా మీరు కేవలం రెండు మూడు సభల్లో పాల్గొని ప్రతి రోజూ సాయంత్రానికి హైదరాబాద్‌కు వచ్చేసినా మీ సోదరి, మీ తల్లిగారు రోజూ నాలుగైదు సభలలో పాల్గొనడమే కాకుండా రాత్రి పది గంటల వరకూ ప్రచారం చేశారు.ఈ విషయాలను మీరు మర్చిపోయి ఉంటారు. ఒక్కసారి 2019 ఎన్నికల సందర్భంగా మీ ప్రతిక సాక్షిలో వచ్చిన వార్తలను పంపుతాను. వాటిని చూసైనా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.

శ్రీమతి షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడాన్ని మీరు, మీ అనుచరులు తప్పుపడుతున్నారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మరణానంతరం 6 లేదా 7 సెప్టెంబర్‌ 2009 తేదీన మీ రక్తంలో ఉన్నది నూటికి నూరు శాతం కాంగ్రెస్‌ రక్తం అని బహిరంగంగా ప్రకటించిన విషయం మీరు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మర్చిపోలేదు. ఒక్కసారి మీ సాక్షి పత్రికలోనే వచ్చిన ఆ ప్రకటన పూర్తి పాఠాన్ని మీరు మరోమారు చదువుకుంటే మీ సోదరి శ్రీమతి షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడాన్ని కచ్చితంగా సమర్థించాల్సిందే.

కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చీలిక తెచ్చి రాజకీయాలు చేస్తుందని మీరు, మీ అనుచరులు ఆరోపించడం హాస్యాస్పదం. మీకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌ పార్టీని మీరు స్వప్రయోజనాలకు వాడుకున్నారు. కాంగ్రెస్‌తో పలు పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన మీరు పదవీకాంక్షతో, ధనదాహంతో కాంగ్రెస్‌ పార్టీని, కుటుంబ సభ్యులను, వైఎస్‌ఆర్‌ శ్రేయోభిలాషులను అవసరం తీరాక దూరం చేసుకున్నారనేది అక్షర సత్యం.

ఖమ్మం జిల్లాలో కొంత మంది ఆకతాయిలు ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఫ్లెక్సీలను చింపివేసిన సందర్భంగా 2009 అక్టోబర్‌ మాసంలో మీరు ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ తన  తల్లితో సమానమని ప్రకటించిన విషయం వాస్తవం కాదా..? మీ స్వార్థం కోసం, శ్రీమతి సోనియా గాంధీపై ఎన్ని విమర్శలు చేసినా ఆమె పెద్దమనస్సుతో మిమ్మల్ని క్షమించిన విషయం మీకు తెలియంది కాదు.

కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబం మొట్టమొదటి నుండి వైఎస్‌ కుటుంబానికి పూర్తిగా అండగా నిలబడిరది. మీ తండ్రి గారికి రెండు సార్లు ఏపీసీసీ అధ్యక్షులుగా, సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. మీరు కూడా మొట్టమొదటి సారి ఎంపీగా అయ్యింది కాంగ్రెస్‌ పార్టీ తరఫునే. మీరు ఈ రోజు సాక్షి దినపత్రిక, చానెల్‌, సిమెంట్‌ కంపెనీలతో పాటు ఇంకా అనేక వ్యాపారాలు చేస్తున్నారంటే కాంగ్రెస్‌ పార్టీ భిక్షే. మీ ఆధ్వర్యంలో నడిచే చానెల్‌ కంపెనీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ పేరుమీదే ఉంది. ఈ విషయాలని మీరు గుర్తుంచుకోవాలని, ఇన్ని ఉపకారాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని దూషించిన, మీ సోదరి శ్రీమతి షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడాన్ని తప్పుపట్టినా రాష్ట్ర ప్రజలు క్షమించరు.

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఎదుగుదలకు సహాయసహకారాలు అందించిన గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్‌ పార్టీని తన తుది శ్వాస విడిచే వరకూ మర్చిపోలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రతి పథకానికి గాంధీ కుటుంబం పేరు పెట్టారు. రాహుల్‌ గాంధీని ప్రధాని మంత్రి చేయాలని కలలు కన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం పాటుపడ్డారు. గతంలో తాను చేసిన తప్పులు సరిదిద్దుకోవడంలో భాగంగా, తండ్రి కలలను నిజం చేయడం కోసం మీ సోదరి శ్రీమతి షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీన్ని ఏ విధంగానూ తప్పు పట్టాల్సింది లేకపోగా, మీరు చేయాల్సిన పనిని ఆమె చేస్తున్నందుకు షర్మిలమ్మను అభినందించాల్సింది పోయి ఆమెపై నీలాపనిందలు వేయడం, క్యారెక్టర్‌ అసాసినేషన్‌ చేయడం భావ్యం కాదు. విజ్ఞులైన ప్రజలు ఈ అంశాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు.

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏ నాడు మతతత్వ పార్టీలతో చేతులు కలపలేదు. ముఖ్యంగా సెక్యులర్‌ భావాలు కలవ్యక్తి. బీజేపీతో ఏనాడు అంటకాగలేదు. ఆయన వారసుడని చెప్పుకునే మీరు మీ స్వార్థం కోసం, మీ కేసుల నుండి విముక్తి కోసం మతతత్వ బీజేపీతో అంటకాగడమే కాకుండా వారికి దాసోహం అవడాన్ని మీ తండ్రి గారి ఆశయాలకు తూట్లు పొడిచిన వారవుతారు. 2014 నుండి నేటి వరకు మీరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మతతత్వ బీజేపీకి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తున్నారు. 

శ్రీమతి షర్మిల తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడాని మీ అనుచరులు తప్పుపడుతున్నారు. వాస్తవానికి ఆమె పార్టీని విలీనం చేయాలా లేదా అనే అంశంపై పార్టీ నాయకులతో చర్చించే నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఏ విధంగా తప్పుపడుతారు..? 

వైఎస్‌ఆర్‌సీపీ అధినేతగా మీరు ఆనాడు సమైఖ్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో చర్చించారా..? కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకత్వంతో మీ స్వార్థం కోసం, మీ బెయిల్‌ కోసం లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని మీరు 27 జులై 2013 తేదీన పార్టీలోని ఏ ఒక్క నాయకుడిని సంప్రదించకుండా ఏకపక్షంగా సమైఖ్యాంధ్రకు కట్టుబడినట్టు నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా..?

2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో 119 నియోజకవర్గాలకు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మీరు అభ్యర్థులను నిలబెట్టారు. అయినా మీరు ఏ ఒక్క నియోజకవర్గంలో అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయలేదు. కనీసం మీ సోదరి, మీ తల్లిగారి చేత అయినా ప్రచారం చేయించలేదు. కేవలం మీరు, మీ కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లాలో మాత్రమే మూడు రోజుల పాటు ప్రచారం చేశారు. మీ కోసం, వైఎస్‌ఆర్‌సీపీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న అనేక మంది నాయకులను మీరు నట్టేట ముంచారు. అటువంటిది శ్రీమతి షర్మిల తెలంగాణలో పార్టీని రద్దు చేసుకోవడాన్ని మీరు ఎలా తప్పు పడుతారు..? ఆమె పార్టీ పెట్టిన ఏ ఒక్కరి చేత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించలేదు. ఆమె సొంతంగానే తమ పాదయాత్రకు, దీక్షలకు, ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకున్నారు. ఇది నూటికి నూరుపాళ్లు సత్యం. 

 వైఎస్‌ఆర్‌సీపీ కోసం, దివంగత నేత వైఎస్‌ఆర్‌ కోసం మీ పార్టీలో చేరి కోట్ల రూపాయలు పార్టీ కోసం, మీ ఓదార్పు, మీ సభల కోసం ఖర్చు చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే మీరు ఏకపక్షంగా సమైఖ్యాంధ్ర నిర్ణయం తీసుకోవడం వల్ల ఆనాడు తెలంగాణలో సీనియర్‌ నాయకులుగా ఉన్న బాజిరెడ్డి గోవర్థన్‌, కోనప్ప, కృష్ణారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కొండా సురేఖ, పువ్వాడ అజయ్‌, సంజీవ్‌రావు, జలగం వెంకట్రావు, మహిపాల్‌రెడ్డి, పుట్టా మధు ఇంకా అనేక మంది నాతోసహా పలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు  ఎనిమిది నుండి పది మంది వివిధ పార్టీలో చేరి ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ విషయం మీ అనుచరులకు ఒక్కసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ప్రస్తావిస్తున్నాను.

మీ సోదరి శ్రీమతి షర్మిల స్థానికతపై కూడా మీ అనుచరులు అనేక విమర్శలు చేస్తున్నారు. మీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన ఆర్‌.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి, పరిమళ్‌ తదితరులు స్థానికులా..? వీరు తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన వారు. గురువింద గింజ తన నలుపు ఎరగదు అనే సామెత వలె అనేక మంది స్థానికేతరులకు వివిధ పదవులు కట్టబెడుతున్న మీకు శ్రీమతి షర్మిల గారిని ప్రశ్నించే హక్కే లేదు.

 68 రోజుల పాటు దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రలో మీరు ఒక్కసారి అయినా పాల్గొని ఆయనతో కలిసి పాదయాత్ర చేశారా..? ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అనారోగ్యానికి గురై రాజమండ్రిలో ఉన్నప్పుడు మీరు కనీసం వచ్చి ఆయనను పరామర్శించారా..? మీ సోదరి శ్రీమతి వైఎస్‌.షర్మిల, మీ తల్లిగారు శ్రీమతి విజయమ్మ గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర జరిగిన ప్రతి ఒక్క జిల్లాలో కనీసం ఒక్క రోజు పాటు పాల్గొని ఆయనతోపాటు అడుగులో అడుగేశారు. ఇది వాస్తవం కాదా...? మీ మేనల్లుడు వైఎస్‌.రాజారెడ్డి కూడా (చిన్నపిల్లడైనా) తాత వైఎస్‌ఆర్‌ పాదయాత్ర సందర్భంగా తాండూరులో పాల్గొన్న విషయం మీకు తెలుసా..? మీ నాయనమ్మ కూడా ఒక రోజు పాదయాత్రకు వచ్చి మీ నాయనను ఆశీర్వదించిన మాట వాస్తవం కాదా..? మీరు గానీ, మీ శ్రీమతి గారు గానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా పాదయాత్రలో పాల్గొనలేదు. ఇది వాస్తవం కాదా..?

శ్రీ నారా చంద్రబాబు నాయుడు కనీ వినీ ఎరుగని రీతిలో విద్యుత్‌ చార్జీలు పెంచినప్పుడు పదకొండు రోజుల పాటు ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు మీ సోదరి, మీ తల్లిగారు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఆయన యోగక్షేమాలను, ఆరోగ్యాన్ని తెలుసుకున్నారు. మీరు  ఒక్కసారైనా దీక్షా శిబిరం వద్దకు వచ్చి ఆయనను పరామర్శించారా..? 

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ను బతికున్నని రోజులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారిని మీ అక్కున  చేర్చుకున్నారు.  ప్రస్తుతం వారు మీకు ప్రధాన సలహాదారులయ్యారు. మీ తల్లిగారిని అసెంబ్లీ సాక్షిగా తిట్టిన శ్రీ బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్‌ తదితరులకు మీ కెబినెట్‌లో స్థానం కల్పించడమే కాకుండా వారికి పెద్ద పీట వేస్తున్నారు. రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి మీరని ధర్మాన ప్రసాద్‌ బహిరంగంగానే మీ పై విమర్శలు చేశారు. ఇలా చెబుతూపోతే అనేక మంది ప్రస్తుతం మీ ఆంతరంగికులుగా  ఉన్నారు.

ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మీ అనుచరుల చేత మీ సోదరి షర్మిలపైన చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతున్నాను. ఏపీసీసీ అధ్యక్షురాలుగా రాష్ట్రానికి, ప్రజలకు సంబంధించి ఆమె లేవనెత్తుతున్న అంశాలకు సూటిగా సమాధానం చెప్పాలి తప్పా, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేయడం పాలకుడిగా మీకు తగదు.

                                                                                                                       అభినందనలతో....
                                                                                                                                 ఇట్లు
                                                                                                                                  మీ
                                                                                                                             గోనె ప్రకాశ్‌ రావు                     
                                                                                        

More Press Releases