ప్రొహిబిషన్ & ఎక్సైజ్, టూరిజం, కల్చర్ మరియు ఆర్కియాలజీ అధికారులతో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈరోజు సచివాలయంలో సమావేశం నిర్వహించారు

Related image

హైదరాబాద్, జనవరి 22 :: ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ ఆదాయాన్ని పెంపొందించే మార్గాలను, వనరులను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఎలైట్ బార్‌లు/ఎలైట్ షాప్‌లు మొదలైనవాటిని ఏర్పాటు చేయడానికి ఏకీకృత విధానంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎక్సైజ్, పోలీసు, సమాచార శాఖలతో కూడిన మల్టీ డైమెన్షనల్ టీమ్‌లను ఏర్పాటు చేసి డ్రగ్స్ ముప్పుపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన నొక్కి చెప్పారు. డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు సరైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో పురాతన కట్టడాలు, దేవస్థానాలు ఉన్న ప్రదేశాలలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్రం అత్యున్నత అవకాశాలను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాలంటే ఎండోమెంట్, టూరిజం, ఆర్టీసీ శాఖల సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని అనేక అడవులను ఎకో టూరిజం కోసం ఉపయోగించుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. “రాష్ట్రంలో సమృద్ధిగా సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశాలను కలిగి

ఉన్నప్పటికి సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం వలన వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన గమ్యస్థానాలను స్పష్టంగా నిర్దేశిస్తూ సమగ్ర పర్యాటక విధానాన్ని రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు తెలియజేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం మాత్రమే అన్ని టూరిజం ప్రాజెక్టులను చేపట్టదని, పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎక్సైజ్ శాఖ తమ బడ్జెట్ ప్రతిపాదనల్లో కార్యాలయ భవనాల నిర్మాణం, చెక్‌పోస్టుల పటిష్టత చేపట్టాలని ప్రతిపాదించింది. అదేవిధంగా పర్యాటక శాఖ కొత్త పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడంతో పాటు స్పిల్ ఓవర్ పనులకు నిధులను కోరింది.

ఆర్థిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, ఎక్సైజ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, టూరిజం అండ్‌ కల్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ఎక్సైజ్‌, టూరిజం, కల్చర్‌, ఆర్కియాలజీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

More Press Releases