హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ న్యూరోసైన్స్ స‌ద‌స్సు ప్రారంభం

Related image

* అల్ట్రాసౌండ్‌తోనే మెద‌డులో క‌ణితుల ధ్వంసం

* ఏఐ ప‌రిజ్ఞానంతో స్ట్రోక్ విష‌యంలో క‌చ్చిత‌మైన నిర్ణ‌యాలు

* లోప‌ల‌కు వెళ్లి క‌ణితిని తినేసే బుల్లి రోబో

* మెద‌డు చికిత్స‌ల్లో స‌రికొత్త విప్ల‌వాలపై విస్తృత చ‌ర్చ‌

* కిమ్స్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహి వెల్ల‌డి

 
హైద‌రాబాద్, జ‌న‌వ‌రి 5, 2023: ప్ర‌స్తుతం మెద‌డులో ఏదైనా క‌ణితి ఉందంటే చాలావ‌ర‌కు దాన్ని శ‌స్త్రచికిత్స‌తో తొల‌గిస్తున్నారు. దానివ‌ల్ల ఒక్కోసారి కొన్ని దుష్ప్ర‌భావాలు కూడా ఉంటాయి, శ‌స్త్రచికిత్స త‌ర్వాత రోగి కోలుకునేందుకు కూడా స‌మ‌యం ప‌డుతుంది. కేవ‌లం ఒక సెంటీమీట‌రు ప‌రిమాణంలో ఉండే చిన్న రోబోను క‌ణితి వ‌ద్ద‌కు ప్ర‌వేశ‌పెడితే, అది క‌ణితిని తినేసి.. బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే ఎలా ఉంటుంది!! రాబోయే 10 ఏళ్ల‌లో ఈ కాప్స్యూల్ రోబోలు మెద‌డులో క‌ణితుల‌కు శ‌స్త్రచికిత్స‌ల తీరునే మార్చేస్తాయి. ఇలాంటి అనేక స‌రికొత్త ప‌రిణామాల గురించి చ‌ర్చించేందుకు హైద‌రాబాద్‌లో ఓ అంత‌ర్జాతీయ స్థాయి శాస్త్రీయ స‌ద‌స్సు శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. శుక్ర‌, శ‌నివారాల్లో రామోజీ ఫిలింసిటీలోను, ఆదివారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్ప‌త్రిలోను ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. ఇందులో 12 దేశాల‌కు చెందిన 125 మందికి వైద్య నిపుణులు పాల్గొంటున్నారు.  స‌ద‌స్సు విశేషాల‌ను కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి వివ‌రించారు. గ‌తంలో అమెరికా, యూర‌ప్‌ల‌లో జ‌రిగిన ఈ స‌ద‌స్సు మ‌న దేశంలో జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసార‌ని ఆయ‌న చెప్పారు. న్యూరోస‌ర్జ‌రీల‌లో రాబోయే కొన్నేళ్ల‌లో జ‌రిగే ప‌రిణామాల‌ను తెలిపారు.

 
క‌ణితిని ధ్వంసం చేయ‌డానికి అల్ట్రాసౌండ్‌

“సాధార‌ణంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్‌ను ఉద‌ర సంబంధ విష‌యాలు తెలుసుకోవ‌డానికే వాడుతారు. కానీ భ‌విష్య‌త్తులో కొన్నిర‌కాల క‌ణితుల‌ను కేవ‌లం అల్ట్రాసౌండ్ ద్వారానే ధ్వంసం చేయొచ్చు. అప్పుడు ఇక శ‌స్త్రచికిత్స‌ల అవ‌స‌రం కూడా ఉండ‌దు. దీనిపై ఇప్ప‌టికే ఔష‌ధ ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. మ‌రో రెండు మూడేళ్ల‌లోనే ఇది అంద‌రికీ అందుబాటులోకి రావ‌చ్చు. దానివ‌ల్ల రేడియేష‌న్ దుష్ప్ర‌భావాల‌ను కొంత‌వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. కేన్స‌ర్ కాని క‌ణితుల‌కే అల్ట్రాసౌండ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మామూలుగా అయితే కీమోథెర‌పీ ఏజెంట్లు మెద‌డులోకి వెళ్ల‌వు. అక్క‌డ ఒక అడ్డుగోడ ఉండ‌ట‌మే అందుకు కార‌ణం. హై ఇంటెన్సిటీ ఫోక‌స్డ్

అల్ట్రాసౌండ్‌ను ఉప‌యోగించి నేరుగా మెద‌డులోని ఇబ్బందిని స‌రిచేసే అవ‌కాశం ఇప్పుడు వ‌స్తోంది. ప్ర‌స్తుతం దీన్ని గైన‌కాల‌జీలో ఫైబ్రాయిడ్ల చికిత్స‌కు, పార్కిన్స‌న్స్ డిసీజ్ చికిత్స‌లోను ఉప‌యోగిస్తున్నారు. గ‌తంలో కేవ‌లం ఓపీ డ‌యాగ్న‌స్టిక్ కోస‌మే వాడే అల్ట్రాసౌండ్ ఇప్పుడు మెద‌డు చికిత్స‌ల‌కూ వాడే అవ‌కాశం వ‌స్తోంది.

 
ఏఐ సాయంతో క‌చ్చిత‌మైన నిర్ణ‌యాలు

బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో ఎంఆర్ఐకి ఏఐ ప‌రిజ్ఞానాన్ని జోడించ‌డం వ‌ల్ల క‌చ్చిత‌మైన నిర్ణ‌యాలు, త‌క్కువ స‌మ‌యంలోనే తీసుకునేందుకు వీలు క‌లుగుతుంది. స్ట్రోక్ వ‌చ్చిన త‌ర్వాత 4 నుంచి 5 గంట‌ల్లోగానే చికిత్స చేయాలి. అయితే, ఎంఆర్ఐ చేసి ఆ ఫిల్ములు చూసిన‌ప్పుడు వైద్యులు త‌మ అనుభ‌వాన్ని బ‌ట్టి మెద‌డు ఎంత‌మేర దెబ్బ‌తింతో అంచ‌నా వేస్తారు. దాన్ని ఒక‌రు 30% అనొచ్చు, మ‌రొక‌రు 40, ఇంకొకరు 50% అనొచ్చు. దానివ‌ల్ల చికిత్స చేయాలా, వ‌ద్దా అనేది వేర్వేరు వైద్యుల అభిప్రాయాల్లో మారుతుంది. కానీ, ఎంఆర్ఐ విశ్లేష‌ణ‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల అది క‌చ్చిత‌మైన వివ‌రాలు చెబుతుంది. దానివ‌ల్ల ఏ త‌ర‌హా చికిత్స చేయాల‌న్న విష‌యం వెంట‌నే తేలిపోతుంది. అలాగే, ఎంఆర్ఐ తీసిన త‌ర్వాత రేడియాల‌జిస్టు చూసి, దానిపై రిపోర్టు ఇవ్వ‌డానికి కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది. అదే అక్క‌డ ఏఐని ఉప‌యోగిస్తే నిమిషాల వ్య‌వ‌ధిలో అత్యంత క‌చ్చిత‌మైన నివేదిక వ‌స్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు అనుభ‌వం ఉన్న‌, లేని వైద్యులు వేర్వేరుగా చెప్ప‌డం వ‌ల్ల రోగులు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. ఇక‌పై అలాంటి ఇబ్బందులు ఉండ‌వు. పైగా స్ట్రోక్ వ‌చ్చిన‌వారిలో 30-40% రోగుల‌కు ఇంజెక్ష‌న్ల‌తోనే స‌రిపోవ‌చ్చు. ఆ నిర్ణ‌యం వెంట‌నే వ‌స్తే వారికి శ‌స్త్రచికిత్స‌ల‌కు అయ్యే వ్య‌యం, స‌మ‌యం త‌ప్పుతాయి. 

కాప్స్యూల్ రోబో.. క‌ణితిని తినేస్తుంది!

మెద‌డులో ఉండే క‌ణితుల‌ను నిర్మూలించ‌డానికి ఒక సెంటీమీట‌రు ప‌రిమాణంలో ఉండే చిన్న‌పాటి రోబోను లోప‌ల ప్ర‌వేశ‌పెడ‌తారు. ఇందుకు చిన్న రంధ్రం చేస్తే స‌రిపోతుంది. అది క‌ణితి మొత్తాన్ని తినేస్తుంది. ఆ త‌ర్వాత దాన్ని బ‌య‌ట‌కు తీసేయొచ్చు. ఇక శ‌స్త్రచికిత్స చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ప్ర‌స్తుతం క‌ణితి వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి మాత్ర‌మే రోబోల‌ను వాడుతున్నారు గానీ, ఇవి పూర్తిగా విభిన్నం. రోడ్ల‌ను, డ్రెయిన్ల‌ను శుభ్రం చేసే యంత్రాలు లోప‌ల‌కు వెళ్లి ఎలా శుభ్రం చేస్తాయో, ఇవీ స‌రిగ్గా అలాగే ప‌నిచేస్తాయి. కానీ, ఇంకొంత అత్యాధునికంగా చేస్తాయి. ఇది అంద‌రికీ అందుబాటులోకి రావ‌డానికి మ‌రో ప‌దేళ్లు ప‌ట్టొచ్చు. ప్ర‌స్తుతం ల్యాబ్ ద‌శ‌లోనే ఉంది. ఇంకా ప్ర‌యోగాలు కూడా చేయ‌ట్లేదు.

 
ఇలాంటి అనేక శాస్త్రీయ అంశాల‌పై సైన్‌కాన్ (సొసైటీ ఫ‌ర్ ఇమేజ్ గైడెడ్ న్యూరోఇంట‌ర్వెన్ష‌న్స్ కాన్ఫ‌రెన్స్)లో చ‌ర్చిస్తారు. ఈ స‌ద‌స్సు పూర్తిగా శాస్త్ర ప‌రిశోధ‌న‌ల‌కు సంబంధించిన‌ది. రాబోయే కొన్ని సంవ‌త్స‌రాల‌లో న్యూరాల‌జీ, న్యూరోస‌ర్జ‌రీలలో రాబోయే మార్పుల గురించి ఇందులో స‌మ‌గ్ర చ‌ర్చ జ‌రుగుతోంది” అని డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి వివ‌రించారు. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, యూరోపియ‌న్ దేశాల‌కు చెందిన 74 మంది వ‌క్త‌లు ఇందులో పాల్గొంటున్నట్లు తెలిపారు.

 
ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రి ఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు మాట్లాడుతూ, “న్యూరో సంబంధిత అంశాల్లో అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధిస్తున్న ఈ త‌రుణంలో హైద‌రాబాద్‌లో సైన్‌కాన్‌కు ఆతిథ్యం ఇవ్వ‌డం మాకెంతో సంతోష‌క‌ర‌మైన విష‌యం. స‌మీప భ‌విష్య‌త్తులో న్యూరోస‌ర్జ‌రీల తీరుతెన్నుల‌ను స‌మూలంగా మార్చేందుకు అవ‌స‌ర‌మైన ప‌రిజ్ఞానాన్ని ఈ స‌ద‌స్సు అందిస్తుంది. మెద‌డులో క‌ణితుల చికిత్స‌ల‌కు అల్ట్రాసౌండ్ ఉప‌యోగించ‌డం, స్ట్రోక్ కేసుల‌లో ఏఐ సాంకేతిక‌త‌ను వినియోగించ‌డం, కాప్స్యూల్ రోబోల ప‌రిచ‌యం లాంటివి అనూహ్య‌మైన మార్పులు. ఇవ‌న్నీ రోగుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటాయి” అని చెప్పారు.

More Press Releases