'ప్రావింకూడు షాపు' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

'ప్రావింకూడు షాపు' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
  • మలయాళంలో రూపొందిన సినిమా
  • బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
  • ఫరవాలేదనిపించే కంటెంట్ 
  • హైలైట్ గా నిలిచే లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో మలయాళంలో రూపొందిన సినిమానే 'ప్రావింకూడు షాపు'. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సౌబిన్ షాహిర్ .. బాసిల్ జోసెఫ్ .. చంబన్ వినోద్ జోస్ ప్రధానమైన పాత్రలను పోషించారు. జనవరి 16వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఓ మాదిరి వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. ఈ రోజు నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్  కి వచ్చిన ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.

కథ: అది అడవికి సమీపంలోని ఒక విలేజ్. అక్కడ బాబు ( శివజిత్) కల్లు దుకాణం నడుపుతూ ఉంటాడు. అతను మంచి కండపుష్ఠి కలిగినవాడు .. ధైర్యవంతుడు. చుట్టుపక్కల వాళ్లు అతనికి భయపడుతూ ఉంటారు. అలాంటి ఆయన కల్లుషాపులో ఒక 11మంది కస్టమర్లు కల్లు తాగుతూ ఉంటారు. జోరున వర్షం కురుస్తూ ఉండటంతో ఆ రాత్రివేళ ఇంటికి వెళ్లే అవకాశం లేక అక్కడే పేకాడుతూ ఉంటారు. తెల్లవారిన తరువాత చూస్తే, ఆ షాపులో 'ఉరితాడు'కి బాబు వ్రేళ్లాడుతూ ఉంటాడు. 

ఈ కేసును ఛేదించడం కోసం పోలీస్ ఆఫీసర్ సంతోష్ (బాసిల్ జోసెఫ్) రంగంలోకి దిగుతాడు. కల్లు దుకాణం మొత్తం అతను పరిశీలిస్తాడు. బాబు ఆత్మహత్య చేసుకోలేదనీ, అతనిని ఎవరో హత్య చేసి, ఆత్మహత్యలా చిత్రీకరించడానికి ప్రయత్నించారనే విషయం అతనికి అర్థమవుతుంది. బాబులాంటి వాడిని చంపడానికి ఒక వ్యక్తి బలం సరిపోదనీ, హంతకుడికి మరొకరు సాయం చేసి ఉండొచ్చునని భావిస్తాడు. 

బాబు చనిపోయిన సమయంలో 'కల్లు దుకాణం'లో ఉన్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటాడు. ఒక్కొక్కరి వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆ 11 మందిలో ఉన్న సునీ (చంబన్ వినోద్ జోస్) .. కన్నా (సౌబిన్ షాహిర్) లపై సంతోష్ కి సందేహం వస్తుంది. వాళ్లిద్దరు మాత్రమే కాకుండా, ఇందులో 'మెరిండా' (చాందిని) పాత్ర కూడా ఉండొచ్చునని అనుమానం కలుగుతుంది. కన్నా .. సునీపై సంతోష్ కి అనుమానం రావడానికి కారణం ఏమిటి? మెరిండా ఎవరు? ఆమెకి బాబుతో ఉన్న సంబంధం ఏమిటి? ఈ కేసు విషయంలో సంతోష్ స్పెషల్ ఫోకస్ పెట్టడానికి కారణం ఏమిటి? అనేవి ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. 

విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలను ఇంట్రెస్టింగ్ గా హ్యాండిల్ చేయడం మలయాళ దర్శకులకు బాగా తెలుసు. అందువలన ఈ తరహా కథలను ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఎక్కువగా చూస్తుంటారు. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా, లొకేషన్స్ ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. సన్నివేశాలకు లొకేషన్స్ మరింత బలాన్ని చేకూరుస్తాయి. 

ఒక మారుమూల గ్రామం .. ఒక కల్లుపాక చుట్టూ తిరిగే ఈ కథ, అనూహ్యమైన మలుపులతో ఆకట్టుకుంటుందని చెప్పలేము గానీ, ఫొటోగ్రఫి .. నేపథ్య సంగీతం పరంగా మంచి మార్కులు కొట్టేస్తుంది. కథలో ఉత్కంఠను రేకేతించే అంశాలు పెద్దగా లేకపోయినా, సాంకేతిక పరంగా ఇతర అంశాలు బోర్ అనిపించకుండా చేస్తాయి. అందువలన ప్రేక్షకులు కథలోని మలుపులను ఫాలో అవుతూనే ఉంటారు.

పనితీరు : బాసిల్ జోసెఫ్ .. సౌరభ్ షాహిర్ .. చెంబన్ వినోద్ జోస్ .. శివజిత్ పాత్రలను మలచిన తీరు బాగుంది. కనీ కనిపించకుండా, అనీ అనిపించకుండా బాసిల్ జోసెఫ్ పాత్రకి ఇచ్చిన కామెడి టచ్ కొత్తగా అనిపిస్తుంది. ఇక అసమర్థత కలిగిన పాత్రలో సౌరభ్ షాహిర్ నటన ఆకట్టుకుంటుంది. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. 

షిజూ ఖాలిద్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. అలాగే కథలో కొత్తదనం లేకపోయినా, దానిని పట్టుకుని ప్రేక్షకులు చివరివరకూ పరిగెత్తడంలో నేపథ్య సంగీతం ఇచ్చిన సపోర్ట్ గొప్పగా అనిపిస్తుంది. షఫీక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది.

ముగింపు
: కథ కొత్తదేమీ కాదు .. కథనంలో కూడా పెద్ద మేజిక్ ఏమీ కనిపించదు. కానీ లొకేషన్స్ ..  ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాను ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకుని వెళతాయి. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా బాసిల్ పాత్రకి ఇచ్చిన కామెడీ టచ్ ప్రత్యేకమైన ఆకర్షణగా  నిలుస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలుగానీ .. సంభాషణలుగాని లేని ఈ సినిమాను ఫ్యామిలీతో  కలిసి చూడొచ్చు. 


Movie Name: Pravinkoodu Shappu

Release Date: 2025-04-11
Cast: Soubin Shahir, Basil Joseph, Chemban Vinod Jose, Chandini Sridharan
Director: Sreeraj Sreenivsan
Producer: Anwar Rasheed
Music: Vishnu Vijay
Banner: Anwar Rasheed Entertainment
Review By: Peddinti

Pravinkoodu Shappu Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews