'రాబిన్ హుడ్' - మూవీ రివ్యూ!

'రాబిన్ హుడ్' - మూవీ రివ్యూ!
  • 'రాబిన్ హుడ్' గా థియేటర్స్ కి వచ్చిన నితిన్
  • రొటీన్ గా అనిపించే కథ 
  • ఆసక్తికరంగా సాగని కథనం  
  • అంతంత మాత్రంగా వర్కౌట్ అయిన కామెడీ 
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. అందుకు కారణం గతంలో వెంకీ కుడుముల - నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'భీష్మ' పెద్ద హిట్ కొట్టడమే. కొంత గ్యాప్ తరువాత ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

కథ: రామ్ (నితిన్) ఓ అనాథ. అతను అనాథ ఆశ్రమంలోనే పెరుగుతాడు. తనవంటి అనాథల పోషణ కోసం మూర్తి (శుభలేఖ సుధాకర్) ఎంతగా కష్టపడుతున్నది రామ్ గమనిస్తాడు. సమాజంలో సాయం చేసేవారు తక్కువ .. సాయం చేస్తున్నట్టుగా నటించేవారు ఎక్కువ అనే విషయం అతనికి అర్థమవుతుంది. దాంతో అక్రమ మార్గాల్లో కూడబెడుతున్నవారి నుంచి దొంగతనాలు చేసి, అనాథశరణాలయాలకు ఆ డబ్బు పంపిస్తూ 'రాబిన్ హుడ్' గా మారిపోతాడు. 

అలా రాబిన్ హుడ్ కారణంగా పెద్ద మొత్తంలో పోగొట్టుకున్నవారిలో హోమ్ మినిస్టర్ (ఆడుకాలం నరేన్) సన్నిహితుడు కూడా ఉంటాడు. దాంతో వెంటనే హోమ్ మినిస్టర్ జోక్యం చేసుకుంటాడు. రాబిన్ హుడ్ ను పట్టుకోవడనికి స్పెషల్ ఆఫీసర్ విక్టర్ (షైన్ టామ్ చాకో)ను రంగంలోకి దింపుతాడు. తనదైన స్టైల్లో అతను రాబిన్ హుడ్ ను పట్టుకోవడానికి వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. 

ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో శ్రీమంతుడైన అభినవ్ వాసుదేవ్ (షిజు) కూతురే 'నీరా'. తన కాళ్లపై తాను నిలబడాలనే స్వభావం ఆమెది. ఒక రోజున ఆమెకి ఇండియాలోని 'రుద్రకొండ' నుంచి ఒక కాల్ వస్తుంది. సామి (దేవదత్త నాగే) అనుచరులు 'నీరా' బంధువులను బెదిరించి ఆమెకి కాల్ చేయిస్తారు. దాంతో తనవాళ్లు ఆపదలో ఉన్నారని భావించిన 'నీరా' వెంటనే 'రుద్రకొండ'కి బయల్దేరుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? సామి అనే దుర్మార్గుడికి 'నీరా'తో పని ఏంటి? ఆమెకి రాబిన్ హుడ్ ఎలా తారసపడతాడు? అనేది మిగతా కథ.    

విశ్లేషణ: అన్నం పెట్టినవాళ్లను మరిచిపోకూడదు .. వాళ్లు ఆపదలో పడినప్పుడు విడిచిపెట్టకూడదు' అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. అలాగే దురాశ ఉన్నవాళ్లు దుర్మార్గులతో చేరతారు. ఆ దుర్మార్గులు చేసే పాపాల ఫలితాలను వాళ్ల చుట్టూ చేరినవారు కూడా అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేసిన కథ ఇది. 

ఈ కథ ఆస్ట్రేలియా .. హైదరాబాద్ లను టచ్ చేస్తూ 'రుద్రకొండ'లో జరుగుతుంది. విదేశాలలో ఉన్న హీరోయిన్ ను విలన్ రప్పించగా, అనుకోని విధంగా ఆమెతో హీరో జాయిన్ అవుతాడు. అలా హీరో - హీరోయిన్ - విలన్ డైరెక్టుగా బరిలోకి దిగుతారు. ఇక హీరో వైపు నుంచి రాజేంద్రప్రసాద్ .. హీరోయిన్ వైపు నుంచి వెన్నెల కిశోర్ కామెడీని పండించడానికి చేసిన ప్రయత్నం కొంతవరకూ ఫలించింది. 

ఈ కథకి సాధ్యమైనంత వరకూ కామెడీ టచ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కథ సీరియస్ గా కొనసాగవలసిన సందర్భాలలోను కామెడీని కలపడం అసంతృప్తిని కలిగిస్తుంది. హీరో ఆపరేషన్ చేస్తున్నాడా? ఆకతాయితనంతో చేస్తున్నాడా? అనే ఒక డౌట్ మనలను వెంటాడుతూనే ఉంటుంది. అది క్లైమాక్స్ చేరుకుంటున్న కొద్దీ పెద్దదవుతూ ఉంటుంది. చివర్లో ట్విస్టులు ఉన్నాయి .. కాకపోతే అప్పటికే విసిగిపోయిన ఆడియన్స్ ఇక పట్టించుకునే పరిస్థితి ఉండదు. 

పనితీరు: దర్శకుడు ఈ కథను కాసేపు నవ్వించడం కోసమే తయారు చేసుకున్నాడని సరిపెట్టుకోలేం. ఎందుకంటే సహజత్వానికి చాలా దూరంగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. 6 వేలకోట్ల ఆస్తిపాస్తులకు హీరోయిన్ వారసురాలు. అలాంటి ఆమె వాకీ టాకీలు కొనడానికి కూడా డబ్బులు లేని సెక్యూరిటీ ఏజన్సీని నమ్ముకుని విలన్ గ్యాంగ్ ను టచ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆడుకాలం నరేన్ .. మైమ్ గోపీ వంటి ఆరిస్టుల పాత్రలను దర్శకుడు సరిగ్గా డిజైన్ చేయలేదని అనిపిస్తుంది. షైన్ టామ్ చాకో పాత్ర కూడా డమ్మీగానే మిగిలిపోతుంది. చివర్లో ఒక్కసారిగా కొత్త కొత్త పాత్రలు పుట్టుకొచ్చి చిరాకుపెడతాయి. డేవిడ్ వార్నర్ పాత్ర కూడా అలాంటిదే.

ఇక నితిన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. శ్రీలీల కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది. వెన్నెల కిశోర్ పాత్ర కొంతవరకూ ఫరవాలేదు. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం అక్కడక్కడా పొంతన లేకుండా గుండెదడ పెంచుతుంది. సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, కోటి ట్రిమ్ చేయవలసిన సీన్స్ కొన్ని కనిపిస్తాయి. 

ముగింపు: కొన్ని సినిమాల్లో హీరో .. విలన్ ఆటకట్టిస్తాడు. మరి కొన్ని సినిమాలలో విలన్ ను ఆటపట్టిస్తాడు. ఈ సినిమాలో హీరో రెండోపని చేస్తాడు. చివర్లో విలన్ తో జోకులేస్తూ అతగాడిని అయోమయంలో పడేస్తాడు. విలన్ తో పాటు ఆడియన్స్ ను కూడా ఆటపట్టించడం ఇక్కడ కొసమెరుపు.   

Movie Name: Robinhood

Release Date: 2025-03-28
Cast: Nithiin,Sreeleela,Vennela Kishore,Rajendra Prasad, Devdatta Nage
Director: Venky Kudumula
Producer: Naveen Yerneni Yalamanchili Ravi Shankar
Music: G V Prakash Kumar
Banner: Mythri Movie Makers
Review By: Peddinti

Robinhood Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews