'గాంధీ తాత చెట్టు' మూవీ రివ్యూ!

'గాంధీ తాత చెట్టు' మూవీ రివ్యూ!
  • 'గాంధీ తాత చెట్టు' రివ్యూ
  • సుకృతి వేణి ప్రధాన పాత్రలో 'గాంధీ తాత చెట్టు'
  • హృదయానికి హత్తుకునే ఎమోషన్స్‌
  • ఆలోచింపజేసే సందేశం
టైటిల్‌తోనే అందరిని ఆకర్షించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె 'సుకృతి వేణి' ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకురాలు. సుకుమార్‌ భార్య తబితా సుకుమార్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ప్రివ్యూను ఒకరోజు ముందుగానే మీడియాకు ప్రదర్శించారు మేకర్స్‌. ఈ సినిమాగురించి ఒకసారి అలా సమీక్షించుకుందాం.   

కథ: రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) ఊరిలో మంచి మనిషిగా, గాంధేయవాదిగా అందరికి ఇష్టమైన వ్యక్తి. ఓ చెట్టుతో స్నేహం కూడా చేస్తుంటాడు. సొంత ఊరిలో.. ఊరి మనుషుల మధ్య ఉంటూ, ప్రకృతికి దగ్గరగా ఉండటం ఇష్టపడే వ్యక్తి అతను.  తన కొడుకు కూతురుకు గాంధీ (సుకృతి వేణి) అని పేరు పెట్టుకుంటాడు. గాంధీకి తాత అంటే ఎంతో ఇష్టం. తాత పాటించే గాంధీ భావాలను, విలువలను తను కూడా పాటిస్తుంది. తోటి స్నేహితులు కూడా తప్పు చేస్తే వారికి నచ్చజెపుతుంది. 

అనుకోకుండా  ఊరికి కెమికల్‌ ఫ్యాక్టరీ స్థాపన కోసం ఓ పెట్టుబడి దారుడి తరపున సతీష్‌ (రాగ్‌ మయూర్‌) అనే ఏజెంట్‌ వస్తాడు. ఊరిలో అందరి పొలాలను తమ ఫ్యాకర్టీ కొరకు అమ్మాలని అంటాడు.  అయితే అప్పటివరకు ఊరిలో పండించిన చెరకు పంటను కూడా తీసుకోవడానికి షుగర్‌ ఫ్యాకర్టీ వాళ్లు కూడా నిరాకరించడంతో.. వ్యవసాయం చేయడం లాభం లేదని,  గ్రామస్తులందరూ సతీష్‌కు పొలాలను అమ్మేస్తారు. 

కానీ ఊరిలో ఉండటానికి మాత్రమే ఇష్టపడే వ్యక్తి రామచంద్రయ్య తన పొలాన్ని ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇక అప్పుడు జరిగిందేమిటి? రామచంద్రయ్య పొలాన్ని కెమికల్‌ ఫ్యాక్టరీ వాళ్లు ఎలా దక్కించుకున్నారు? సతీష్‌ రాకతో రామచంద్రయ్య కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? తాత అడుగుజాడల్లో గాంధీ ఎందుకు నడవాల్సి వచ్చింది? పరిశ్రమల పేరుతో ఊరును నాశనం చేయాలనుకున్న కెమికల్ ఫ్యాక్టరీ పన్నాగం ఫలించిందా? ఊరును, తాత చెట్టును కాపాడాటానికి గాంధీ ఏం చేసింది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఇది రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రం కాదు. చాలా రోజుల తరువాత ఓ పల్లెటూరి వాతావరణంలో ఎటువంటి రక్తపాతం, హింస లేకుండా ఓ ప్లెజెంట్‌ స్టోరీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈ చిత్రం దర్శకురాలు పద్మావతి మల్లాది ఎంచుకున్న సందేశాత్మకమైన కథ అందరిని ఆలోచింపజేసే విధంగా ఉంది. 

ముఖ్యంగా గాంధీ పాత్రను, ఆ పాత్రను డిజైన్‌ చేసిన విధానం, కథలో ఎమోషన్‌ పండించిన విధానం బాగున్నాయి. ప్రతి సన్నివేశం, చిత్రంలోని ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది. తొలిభాగంలో అక్కడక్కడా కాస్త స్లో అనిపించినా సెకండాఫ్‌లో ఎమోషన్స్   అందరి హృదయాలను హత్తుకుంటుంది. మనం పీల్చే గాలి విలువ, చెట్ల పెంపకం ఇలాంటి అంశాలను చక్కగా వివరించారు. అయితే సినిమాటిక్‌ గా ఎక్కడా కూడా కమర్షియల్‌ అంశాలు ఈ చిత్రంలో జోడించలేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చేయడం, ఈ తరం ప్రేక్షకులకు గాంధీ సిద్దాంతాలు, ఆయన భావ జాలాలు చెప్పాలనుకోవడం అభినందనీయం. 

ముఖ్యంగా సినిమా చూస్తున్నంత సేపు మనం ఆ సినిమాలో క్యారెక్టర్స్‌తో ట్రావెల్ అవుతుంటాం. సినిమాలో రామచంద్రయ్యకు ఇష్టమైన చెట్టు ఊగుతుంటే.. దాని తాలుకూ గాలి మన హృదయాలకు తాకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం షూటింగ్‌ చేసిన ఊర్లో మనుషులతో యాక్ట్‌ చేయించడంతో పాత్రలు చాలా సహజంగా అనిపించాయి. సినిమాలో తాత-మనవరాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా గాంధీ (సుకృతి వేణి) గుండు కొట్టించుకునే సీన్‌తో పాటు పతాక సన్నివేశాలు అందరి హృదయాలను బరువెక్కిస్తాయి.

నటీనటుల పనితీరు: గాంధీ పాత్రలో సుకృతి వేణి నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆమె నటన ఎంతో సహజంగా అనిపించింది. కీలక సన్నివేశాల్లో, ఎమోషన్స్‌ సీన్స్‌లో సుకృతి నటన ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులను తలపించింది. పాత్రకు తగ్గట్టుగా తన శారీరక భాషను మార్చుకుంది. ఆమె నటనే ఈ చిత్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళింది.

  రామచంద్రయ్యగా చక్రపాణి ఆ పాత్రలో జీవించాడు. గాంధేయవాదిగా, గ్రామపెద్దగా ఆయన నటన  ఎంతో బాగుంది గాంధీ తల్లితండ్రులుగా యాక్ట్‌ చేసిన లావణ్య, రఘురామ్‌ ఇద్దరూ సహజ నటనతో ఆకట్టుకున్నారు. గాంధీకి స్నేహితులుగా నటించిన భానుప్రకాశ్‌, నేహాల్‌ ఆనంద్‌లు కూడా కొత్త ఆర్టిస్టుల్లా అనిపించలేదు. అక్కడక్కడా ఈ రెండు పాత్రలు కాస్త వినోదాన్ని పండించారు. పారిశ్రామిక వేత్తకు ప్రతినిధిగా సతీష్‌ పాత్రలో రాగ్‌ మయూర్‌ నటన అభినందనీయం. ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా కనిపించింది. 

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే శ్రీజిత, విశ్వ ఫోటోగ్రఫీ బాగుంది. కథ మూడ్‌కు తగినట్టుగా సన్నివేశాలను, గ్రామీణ నేపథాన్ని చాలా చక్కగా చూపించారు. రీ సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. అచ్చ తెలంగాణ మాండలికంలో సంభాషణలు ఉండటం సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఎటువంటి సినిమాటిక్‌ అంశాల జోలికి వెళ్లకుండా చిత్రాన్ని నిర్మాతలు ఎంతో సహజంగా నిర్మించిన విధానం బాగుంది. 

 గ్రామీణ వాతావరణంలో పచ్చదనం ప్రాముఖ్యత, అభివృద్ది పేరిట జరిగే విధ్వంసం, గాంధీ సిద్దాంతాలు అంశాలు ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎంతో రిఫ్రెషింగ్‌ ఉంది. ఎటువంటి హింస, రక్తపాతం లేకుండా ఆహ్తాదకరంగా సాగిపోయే ఈ సినిమాను అందరూ తమ పిల్లలతో కలిసి చూసే విధంగా ఉంటుంది. కమర్షియల్‌ లెక్కలు వేసుకోకుండా వచ్చే ఇలాంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందితే, మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

Movie Name: Gandhi Tatha Chettu

Release Date: 2025-01-23
Cast: Sukriti Veni, Anand Chakrapani, Raghuram, Bhanu Prakash, Nehal Anand, Rag Mayur.
Director: Padmavati Malladi
Producer: Naveen Yerneni - Ravi Shankar
Music: Re
Banner: Mythri Movie Makers - Sukumar Writings
Review By: Madhu

Gandhi Tatha Chettu Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews