'ఫియర్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

'ఫియర్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
  • వేదిక ప్రధాన పాత్రగా 'ఫియర్'
  • డిసెంబర్ 14న విడుదలైన సినిమా 
  • ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • వేదిక పాత్రపైనే పూర్తి ఫోకస్ 
  • తేలిపోయిన మిగతా పాత్రలు

తెలుగు తెరపైకి అప్పుడప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలు వస్తూ ఉంటాయి. అలా వచ్చిన సినిమానే 'ఫియర్'. వేదిక ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, హరిత గోగినేని దర్శకత్వం వహించారు. అభి - హరిత గోగినేని నిర్మించిన ఈ సినిమా, డిసెంబర్ 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచే 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

కథ: సింధు (వేదిక) బిందు (వేదిక) ట్విన్స్. వారి పేరెంట్స్ (జయప్రకాశ్ - పవిత్ర లోకేశ్) ఇద్దరు పిల్లలను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా సింధుకి భయం ఎక్కువ. ఆ భయం ఆమె వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. తనని ఎవరో రహస్యంగా గమనిస్తున్నారనీ .. వెంటాడుతున్నారని ఆమె భావిస్తూ ఉంటుంది. అలాగే తాను ఇష్టపడిన సంపత్ (అరవింద్ కృష్ణ) తనకి దూరమైపోతాడేమోనని ఆందోళన చెందుతూ ఉంటుంది.

సింధు భయం ఆమెతో పాటు ఆమె చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కారణంగానే స్కూల్ డేస్ నుంచి ఆమె చదువు సరిగ్గా సాగదు. తనకి ఎవరో హాని తలపెడుతున్నారని భావించిన ఆమె, ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అందువలన ఆమెకి ఫ్రెండ్స్ కూడా ఉండరు. పేరెంట్స్ ఆమెను ఒక మెంటల్ హాస్పిటల్ లో చేరుస్తారు. అక్కడ ఆమె అందరినీ సంపత్ గురించి అడుగుతూ ఉంటుంది.

సింధు అంతగా భయపడటానికి కారణం ఏమిటి? ఆమె విషయంలో బిందు ఎలా ప్రవర్తిస్తుంది? సంపత్ ఎవరు? అతని గురించి సింధు ఎందుకు అంతగా తపిస్తోంది? మెంటల్ హాస్పిటల్ నుంచి ఓ మామూలు మనిషిగా సింధు బయటికి వస్తుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: సాధారణంగా కొంతమంది ఒంటరిగా ఉండటానికి భయపడుతూ ఉంటారు. మరికొంతమంది చీకటికి భయపడుతూ ఉంటారు. అలా కాకుండా ఏదో జరిగిపోతుందని భావిస్తూ, ఏదో ఊహించుకుని కొంతమంది భయపడిపోతుంటారు. అలాంటి ఒక మానసిక స్థితి కలిగిన నాయిక చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె కేంద్రంగానే ఈ కథ నడుస్తూ ఉంటుంది. 

సింధు పాత్ర చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉండటం .. ఆమెలోని భయం వయసుతో పాటు పెరుగుతూ వెళ్లడంపై దృష్టి పెట్టారు. అయితే ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న కథ .. కథనం అంత ఆసక్తికరంగా అనిపించవు. చిన్నపిల్లలకు సంబంధించిన సీన్స్ .. మెంటల్ హాస్పిటల్ కి సంబంధించిన సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. చివర్లో ఆడియన్స్ ఆశించే స్పార్క్ కూడా ఏమీ కనిపించదు. 

ఒక వైపున చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ .. మరో వైపు నుంచి కొంత ఏజ్ వచ్చిన తరువాత ఫ్లాష్ బ్యాక్ ..  ప్రస్తుతం జరుగుతున్న కథ. ఇలా ఈ మూడు ట్రాకులను టచ్ చేస్తూ వెళ్లారు. దాంతో కాస్త ఇబ్బంది కలుగుతుంది. అనవసరమైన భయాలతో .. భ్రమలతో కూడిన తన పాత్రకి వేదిక న్యాయం చేసింది. కానీ ఆ పాత్ర చుట్టూ బలమైన .. ఆసక్తికరమైన నేపథ్యం లేకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. 

పనితీరు: ఆండ్రూ ఫొటోగ్రఫీ .. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. హరిత గోగినేని ఎడిటింగ్ ఓకే. తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో రూపొందించిన ఈ సినిమాలో, నాయిక పాత్రపై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టారు. నాయిక మానసిక స్థితికి, ఉత్కంఠభరితమైన డ్రామా తోడైతే మరింత బాగుండేది. 

Movie Name: Fear

Release Date: 2025-01-23
Cast: Vedika, Arvind Krishna, Jaya Praksh, Pavitra Lokesh
Director: Haritha Gogineni
Producer: AR Abhi
Music: Anoop Rubens
Banner: Dattatreya Media
Review By: Peddinti

Fear Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews