'హైడ్ న్ సీక్' (ఆహా) మూవీ రివ్యూ!

  • విశ్వంత్ హీరోగా 'హైడ్ న్ సీక్'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా  
  • క్రితం ఏడాది సెప్టెంబర్లో జరిగిన రిలీజ్ 
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • ఉత్కంఠను రేపలేకపోయిన కంటెంట్

విశ్వంత్ హీరోగా రూపొందిన సినిమానే 'హైడ్ న్ సీక్'. బసిరెడ్డి రాణా తెరకెక్కించిన ఈ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైంది. సెప్టెంబర్ 20వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఆశించినస్థాయిలో ఆడియన్స్ కి రీచ్ కాలేదు. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: కర్నూల్ కి చెందిన ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు శివ (విశ్వంత్). ఆర్మీ డాక్టర్ కావాలనేది అతని కోరిక. అతని తండ్రి .. బావ ఇద్దరూ కూడా ఆర్మీలోనే చనిపోతారు. అందువలన శివ ఆర్మీలోకి వెళ్లడానికి అతని అక్కయ్య నిరాకరిస్తుంది. అతను మాత్రం వినిపించుకోకుండా రహస్యంగా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ ఉంటాడు. అతను .. వర్ష (రియా సచ్ దేవ) ప్రేమించుకుంటారు.

వర్ష తండ్రి కేకే (సాక్షి శివ) ఓ డాక్టర్. అతను శివతో వర్ష పెళ్లి జరిపించడానికి అంగీకరిస్తాడు. ఈ నేపథ్యంలోనే కర్నూల్ లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. రాత్రివేళలో హంతకుడు ఒక బలమైన ఆయుధంతో దాడి చేస్తూ ఉంటాడు. ఆయుధానికి సంబంధించిన ఒక భాగాన్ని ఆ ప్రదేశంలో వదిలి వెళుతూ ఉంటాడు. దాంతో హంతకుడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ వైష్ణవి (శిల్ప మంజునాథ్) రంగంలోకి దిగుతుంది. 

హంతకుడు ఉపయోగిస్తున్న ఆయుధం పురాతన కాలానికి చెందినదనీ, దానిని హంతకుడు అక్రమంగా సంపాదించాడని వైష్ణవికి అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలోనే మరో రెండు హత్యలు జరుగుతాయి. ఆ సమయంలో అక్కడ దొరికిన ఆధారాలను బట్టి, హంతకుడు శివ అయ్యుంటాడని పోలీసులు భావిస్తారు. అతని కోసం గాలించడం మొదలుపెడతారు. అప్పుడు శివ ఏం చేస్తాడు? అసలు హంతకులు ఎవరు? దేని కోసం హత్యలు చేస్తున్నారు? అనేది మిగతా కథ.

విశ్లేషణ: కర్నూల్ లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలను ఎవరు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? అనే ఆసక్తిని రేకెత్తించేలా ఈ కథను తయారు చేసుకున్నారు. ఫస్టు మర్డర్ తోనే దర్శకుడు కథను మొదలుపెట్టాడు. ఒక వైపున మర్డర్లు .. మరో వైపున హీరోకి గల సిస్టర్ సెంటిమెంట్ .. ఇంకో వైపున వర్షతో లవ్ .. ఇలా మూడు వైపులా నుంచి ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది.

వరుసగా జరుగుతున్న హత్యలతో ఫస్టాఫ్ .. హంతకులను పట్టుకోవడానికి పోలీస్ వారు చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ కొనసాగుతుంది. అటు హత్యలు .. ఇటు హంతకులు .. ఆ మధ్యలో హత్యలకు ఉపయోగించే పురాతన కాలం నాటి ఆయుధం కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆ ఆయుధం గురించిన పరిశోధన కూడా కథలో చోటు చేసుకుంటుంది. దాంతో హంతకులు ఆ ఆయుధాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటనే కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది.

హత్యలు .. ఆయుధం .. హంతకులు .. ఈ మూడు అంశాలను కలుపుకుంటూ దర్శకుడు ముందుకు వెళ్లాడు. అయితే హత్యలు జరిగే తీరును .. హంతకులు ఎవరనే విషయంపై జరుగుతున్న విచారణను దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించలేకపోయాడు. హత్యలు చేయడానికి హంతకుడు పురాతన కాలం నాటి ఆయుధాన్నే ఎందుకు ఎంచుకున్నాడనేది అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. తెరపై పోలీసుల హడావిడి డైలాగ్స్ లోనే తప్ప చేతల్లో కనిపించదు. ఇక హీరోపై పోలీసులకు అనుమానాన్ని కలిగించే సన్నివేశం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.

పనితీరు: కథలో మరీ కొత్తదనమేమీ లేదు. కథనం నిదానంగా .. నింపాదిగా .. తాపీగా సాగుతూ ఉంటుంది. పోలీస్ కథల్లో ఉండవలసిన వేగం కనిపించదు. దర్శకుడు ఎంచుకున్న లైన్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. కాకపోతే అది తెరపై ఆశించినస్థాయిలో ఉత్కంఠను రేకెత్తించలేకపోయింది. పోలీసు పాత్రలు యాక్షన్ లోకి దిగకుండా, సందేహాలు - సమాధానాలు అన్నట్టుగా వ్యవహరించేలా చేయడం విచిత్రం. 

ఆర్టిస్టుల నటన విషయానికి వస్తే, ఎవరూ చేయడానికి అక్కడ పెద్దగా విషయమేమీ కనిపించదు. సాక్షి శివ వంటి ఒక మంచి ఆర్టిస్టును కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. చిన్నరామ్ ఫొటోగ్రఫీ .. లిజో కె జోస్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. అమర్ రెడ్డి ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా .. అందువలన దర్శకుడు ఆ ట్రాక్ లో నుంచి బయటికి రాలేదు. లవ్ .. రొమాన్స్ .. కామెడీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి చాలానే ప్రయత్నించాడు. కానీ ఆడియన్స్ మాత్రం అంతగా పట్టించుకోరు. ఎందుకంటే కథ అయిపోయేముందు కంగారు ఎందుకని మిన్నకుండిపోతారు. కథలో చాలానే మలుపులు ఉంటాయి .. కానీ ఆ మలుపులలో విషయం లేకపోవడమే మైనస్.

Movie Name: Hide N Seek

Release Date: 2025-01-10
Cast: Vishwanth, Riya Sachdev, Shilpa Manjunath, Sakshi Shiva
Director: Basireeddy Rana
Producer: Narendra Buchireddy
Music: Lijo K Jose
Banner: Ethnic Creative Studio

Hide N Seek Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews