'యూఐ' - మూవీ రివ్యూ!

  • ఉపేంద్ర తాజా చిత్రంగా రూపొందిన 'యూఐ'
  • తన మార్క్ సినిమా అనిపించిన హీరో
  • పద్ధతి లేకుండా నడిచే పాత్రలు  
  • అయోమయానికి గురిచేసే కథాకథనాలు 

ఉపేంద్ర కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'యూఐ'. ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. దర్శకత్వం ఉపేంద్రనే. మనోహరన్ - శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. మొదటి నుంచి కూడా ఉపేంద్ర సినిమాలు టైటిల్ దగ్గర నుంచి ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తూ ఉంటాయి. ఆయన నుంచి వచ్చిన ఈ సినిమా అదే పద్ధతిలో కొనసాగిందా? కొత్తదనం ఏమైనా కనిపించిందా? అనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరుగుతుంది. అలాంటి ఆ యువతికి సంతానం లేని వీరస్వామి (అచ్యుత కుమార్) దంపతులు ఆశ్రయం కల్పిస్తారు. కొంతకాలం తరువాత  ఆ యువతికి పురిటి నొప్పులు మొదలవుతాయి. జోష్యం చెప్పడంలో అనుభవం ఉన్న వీరస్వామి, 'కల్కి భగవానుడు' జన్మించనున్నాడని భావిస్తాడు. అయితే అతను అనుకున్న ముహూర్తానికి ఐదు నిమిషాల ముందే ఒక మగ శిశువు జన్మిస్తాడు. అతను గొప్ప సత్యవంతుడు అవుతాడని ఊహించిన  వీరస్వామి, 'సత్య' అని నామకరణ చేస్తాడు.      

అయితే వీరస్వామి దంపతులకు తెలియకుండా ఆ వెంటనే ఆ తల్లి మరో శిశువును కంటుంది. ఆ శిశువును ఎవరో దంపతులు అపహరిస్తారు. వాళ్ల దగ్గర అతను పెరుగుతాడు. అతను తనకి తానుగా 'కల్కి' భగవానుడిగా ప్రకటించుకుంటాడు. తన తల్లికి అన్యాయం చేసిన వారిపై .. ఆ విషయంలో చూస్తూ ఉండిపోయిన ఈ సమాజంపై అతను కోపంతో ఉంటాడు. అలాంటి ఈ సమాజాన్ని సర్వనాశనం చేయాలనే ద్వేషంతో ఉంటాడు. తన అన్నయ్య అయిన 'సత్య' సమాజానికి మంచి చేస్తుండటం చూసి రగిలిపోతాడు. అతణ్ణి తీసుకొచ్చి తన సొంత కారాగారంలో బంధిస్తాడు. 

అవినీతిపరుడు .. రాజకీయనాయకుడైన వామన్ రావు (రవిశంకర్)కి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో సత్య ఉంటే, అతణ్ణి సెంట్రల్ కి సమ్రాట్టును చేస్తానని కల్కి చేరువవుతాడు. సమాజానికి హాని చేసే ఆవేశంలో కల్కి ఉంటే, అతణ్ణి కట్టడి చేయడానికి ఆ జైలు నుంచి బయటపడే ఆలోచనలో సత్య ఉంటాడు. ఈ పోరాటంలో విజయం ఎవరికి దక్కుతుంది? వామన్ రావు పరిస్థితి ఏమిటి? అసలు 'UI' అంటే ఏమిటి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

విశ్లేషణ: ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చినది ఉపేంద్రనే. ఉపేంద్ర ఒక హీరోగా ఎలాంటి సినిమాలు చేస్తాడు? ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు ఎలా ఉంటాయి? అనే విషయంలో ఇక్కడి ఆడియన్స్ కి ఒక అవగాహన ఉంది. అందుకు కారణం గతంలో ఆయన చేసిన సినిమాలు .. పాత్రలే. టైటిల్ దగ్గర నుంచే ఆడియన్స్ ను అయోమయంలో పడేయడం ఆయన స్టైల్. గతంలో ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉందా అంటే ఎంతమాత్రం  లేదనే చెప్పాలి.

సాధారణంగా ఒక కథ మొదలైన తరువాత అది  అర్థం కానప్పుడు ప్రేక్షకులు అయోమయంలో పడుతూ ఉంటారు. కానీ ఆ పనిని టైటిల్స్ దగ్గర నుంచే ఉపేంద్ర మొదలుపెట్టాడు. టైటిల్స్ సమయంలో గ్రాఫిక్స్ లో తలపై టోపీ .. టోపీపై మెదడు చూపించినప్పుడే ఆడియన్స్ కి చిన్నపాటి డౌట్ వస్తుంది. 'మీరు తెలివైన వాళ్లయితే థియేటర్ నుంచి ఇప్పుడే బయటికి వెళ్లిపోండి .. మూర్ఖులైతే సినిమా మొత్తం చూడండి' అంటూ ఆరంభంలోనే ఉపేంద్ర గందరగోళంలో పడేస్తాడు. ఆ తరువాత చిన్న సవరణ చేసి, లోపల ఉండాలో .. బయటికి వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితిని కల్పించాడు.     

ఒక ఉపేంద్రను తట్టుకోవడమే కష్టమనుకుంటే ఈ సినిమాలో ఇద్దరు ఉపేంద్రలు తెరపైకి వస్తారు. తల పక్కకి తిప్పామంటే కథ ఎక్కడ జరుగుతుందో .. ఏ కాలంలో జరుగుతుందో కూడా తెలియకుండా పోతుంది. ఎవరు హీరో .. ఎవరు విలన్ అనేది అర్థం కాదు. ప్రకృతిమాత .. బానిసలు .. మహాయుద్ధం .. సత్యయుగం వంటి మాటలు ఆడియన్స్ ను బెదరగొడుతూ ఉంటాయి. కథ .. కథనం .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. సన్నివేశాలను ఆవిష్కరించిన విధానం ఏదీ పద్ధతిగా అనిపించదు. అందువలన ఈ సినిమా కథేమిటని థియేటర్లలో నుంచి బయటికి రాగానే అడిగినా, అరగంటసేపు ఆలోచించకుండా చెప్పలేరు.

'కల్కి' భగవానుడి అవతారాన్ని అని హీరో చెప్పుకోవడం ఒక ఎత్తు .. అందుకు విరుద్ధంగా నల్లగుర్రంపై .. నల్ల డ్రెస్ వేసుకుని తిరగడం ఒక ఎత్తు .. గుర్రానికి దున్నపోతు కొమ్ములు తగిలించడం మరో ఎత్తు. ఇక ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఇచ్చిన వివరణ మరో ఎత్తు. ఉపేంద్ర ఏదో చెప్పాలనుకున్నాడు .. ఆయనకి  చెప్పడం రాలేదా? లేకపోతే మనకే సరిగ్గా అర్థం కాలేదా? అనే ఒక డైలమాలోనే ఆడియన్స్ బయటికి వస్తారు.  

పనితీరు: రచయితగా .. దర్శకుడిగా ఉపేంద్ర గందరగోళాన్ని సృష్టించాడనే చెప్పాలి. ఈ సినిమాలో ఎవరికి తోచింది వాళ్లు చేసుకుంటూ వెళుతుంటారు. హీరోతో సంబంధం లేకుండా .. ఆయన ప్రమేయమే లేకుండా హీరోయిన్ ప్రేమించడం ఈ సినిమాలో జరిగిన మరో విచిత్రం. ఆమెను హీరోయిన్ అనొచ్చునో లేదో కూడా మనకి తెలియదు. 

అజనీశ్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం .. వేణుగోపాల్ కెమెరా పనితనం .. విజయ్ రాజ్ ఎడిటింగ్ కథకు తగినట్టుగానే అనిపిస్తాయి. అతకని సన్నివేశాలు .. అర్థంకాని సన్నివేశాలతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. ఉపేంద్ర తప్పేం లేదు .. ముందుమాటగా .. ముందు లైన్ గా ఆయన చెప్పాడు. వినిపించుకోకపోతే ఆయనేం చేస్తాడు పాపం. 

Movie Name: UI

Release Date: 2024-12-20
Cast: Upendra, Reeshma Nanaiah, Murali Sharma, Achyuth Kumar, Ravi Shankar
Director: Upendra
Producer: Manoharan - Sreekanth
Music: Ajaneesh Loknath
Banner: Lahari Films - Venus Enterrtainers

UI Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews