'లీలా వినోదం' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

  • మరో ప్రేమకథగా 'లీలా వినోదం'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • చిన్న పాయింటును చాలాదూరం లాగిన దర్శకుడు
  • బలమైన పాత్రలను వదిలేసిన వైనం
  • లీలగా కనిపించిన వినోదం  

యూ ట్యూబర్ గా షణ్ముఖ్ జస్వంత్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. షార్ట్ ఫిలిమ్స్ .. వెబ్ సిరీస్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను, హీరోగా చేసిన సినిమానే 'లీలా వినోదం'. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి, పవన్ సుంకర దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు నుంచే 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ: ఈ కథ 'తణుకు' నేపథ్యంలో .. 2008లో నడుస్తుంది. ప్రసాద్ (షణ్ముఖ్) తణుకులో ఓ మిడిల్ క్లాస్ కి చెందిన కుర్రాడు. అతనికి రాజీవ్ .. అశోక్ .. సాగర్ అనే ఫ్రెండ్స్ ఉంటారు. కాలేజ్ చదువు పూర్తికావడంతో, పోలీస్ డిపార్టుమెంటులో జాబ్ కొట్టాలనే ఆలోచనలో ఉంటాడతను. డిగ్రీ మూడేళ్లలో అతను అదే కాలేజ్ లో చదువుతున్న లీలా ( అనఘ అజిత్)ను ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పడు. 

లీలను లవ్ చేస్తున్న సంగతిని ఆమెతో చెప్పమని, ప్రసాద్ తో అతని ఫ్రెండ్స్ అంటారు. దాంతో ప్రసాద్ ఒక రోజున ధైర్యం చేసి ఆమె ఫోన్ కి మెసేజ్ చేస్తాడు. ఆమెను లవ్ చేస్తున్న విషయాన్ని చెబుతాడు. అయితే ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో కంగారుపడిపోతాడు. తాను మెసేజ్ చేసిన విషయం వాళ్ల ఇంట్లో తెలిసిపోయిందేమోనని భయపడిపోతాడు. తన కారణంగా ఆ ఇంట్లో గొడవ జరుగుతుందేమోనని ఆందోళన చెందుతాడు. 

అసలే ప్రతి విషయానికి ఏదేదో ఊహించుకుని కంగారుపడిపోయే ప్రసాద్ కి రాజీవ్ ధైర్యం చెబుతాడు. లీలా వాళ్లింట్లో అసలు ఏం జరిగి ఉంటుందనేది తెలుసుకోవడమే ఈ సమస్యకి పరిష్కారం అని చెబుతాడు. అశోక్ .. సాగర్ కూడా అతను చెప్పింది సరిగ్గానే ఉందని అంటారు. అందరూ కలిసి లీలా వాళ్ల ఇంటికి ఆమె స్నేహతురాలైన స్వర్ణను పంపిస్తారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.

విశ్లేషణ: ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడిన తరువాత .. కొన్ని రోజుల పాటు మాటలు నడిచాక ఐలవ్ యూ చెప్పడం కాలేజ్ రోజుల్లో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే, ఆ లవర్ ఎంతగా టెన్షన్ పడిపోతాడు? అనే ఒక లైన్ పై ఈ కథ నడుస్తుంది. హీరో సందేహాలకు తెరదించడమే ఈ కథకు ముగింపు అవుతుంది. 

షణ్ముఖ్ జస్వంత్ .. అతని ముగ్గురు స్నేహితుల పాత్రలకు మాత్రమే దర్శకుడు ప్రాధాన్యతనిచ్చాడు. కథ అంతా కూడా వీళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ పేరుతోనే టైటిల్ ఉన్నప్పటికీ, ఈ సినిమాలో ఆమె పాత్ర నామమాత్రం. అడపా దడపా మాత్రమే అలా కనిపించి వెళ్లిపోతూ ఉంటుంది. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ వంటి వాటి జోలికి హీరో - హీరోయిన్ వెళ్లకుండా దర్శకుడు గట్టి జాగ్రత్తలే తీసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో ఆమని, హీరోయిన్ తల్లిదండ్రులుగా రూప లక్ష్మి - గోపరాజు రమణ కనిపిస్తారు. ఈ కారణంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆడియన్స్ ఆశిస్తారు. కానీ వాళ్లు  అటువైపు వెళ్లకుండా దర్శకుడు కట్టడి చేశాడు. ఫలితంగా ఈ ముగ్గురు ఆర్టిస్టులు ఒకటి .. రెండు సీన్స్ లో మాత్రమే కనిపిస్తారు. 'ఏదో జరిగిపోయి ఉంటుంది' అనే హీరో ఊహ తప్ప అసలు కథ మాత్రం నడవలేదు. ముగింపు కూడా అసంపూర్తిగా అనిపిస్తుంది .. అలా ఉండటమే కొత్తదనం అనుకుంటే గొడవే లేదు. 

పనితీరు: షణ్ముఖ్ జస్వంత్ .. అనఘ .. నటన ఫరవాలేదు. స్నేహితుల పాత్రలను పోషించిన కుర్రాళ్ల నుంచి మరింత మంచి అవుట్ పుట్ రాబట్టవలసింది. దర్శకుడు పవన్ సుంకరకి ఇదే ఫస్టు ఫిల్మ్. అందువలన ఆ కొత్తదనం కనిపిస్తూనే ఉంది. ప్రేమకథల్లో సాధారణంగా ఎదురయ్యే ఒక అనుభవాన్ని మెయిన్ లైన్ గా తీసుకోవడానికి కారణమేమిటనేది అర్థం కాదు.

పోనీ ప్రతి విషయాన్ని గురించి అతిగా ఆలోచించడం .. ఏదేదో ఊహించుకోవడం హీరోకి అలవాటు అనే అంశాన్ని హైలైట్ చేయలేదు. ఆమని .. గోపరాజు రమణ .. రూపలక్ష్మి వంటి మంచి ఆర్టిస్టులను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అలాగే ఫ్రెండ్స్ ట్రాక్ వైపు నుంచి కూడా సరైన కామెడీ రాసుకుని ఉంటే బాగుండేది. ఫరవాలేదు అనిపించే ఒక ప్రేమకథను మధ్యలో ఆపేసినట్టు అనిపిస్తుంది. 

అనుష్ కుమార్ ఫొటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. పంటకాలువలు .. పొలం గట్ల నేపథ్యంలో సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. కృష్ణచేతన్ అందించిన నేపథ్య సంగీతం ఫరవాలేదు. నరేశ్ అడుప ఎడిటింగ్ ఓకే.

సినిమా ప్రధానమైన ఉద్దేశం వినోదమే. హీరో - హీరోయిన్ మధ్య లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ ఉండాలనే ప్రేక్షకులు కోరుకుంటారు. అలా కాకుండా హీరో పొలం గట్లపై .. హీరోయిన్ ఇంట్లో కూర్చుని మెసేజ్ లు చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కథ మొత్తం అయిపోయిన తరువాత వాళ్లు కలుసుకోవడం వలన ఆడియన్స్ కి ఒరిగే ప్రయోజనం ఏముంటుంది? అనే విషయంపై కాస్తంత కసరత్తు చేయాల్సింది. 

Movie Name: Leela Vinodam

Release Date: 2024-12-19
Cast: Shanmukh Jaswanth, Anagha Ajith, Amani, Rupa Lakshmi, Goparaju Ramana
Director: Pavan Sunkara
Producer: Sridhar
Music: Krishna Chethan
Banner: Sri Akkiyan Arts

Leela Vinodam Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews