'వేరే లెవెల్ ఆఫీస్' (ఆహా) వెబ్ సిరీస్ రివ్యూ!

  • తమిళంలో మెప్పించిన 'వెరా మారి ఆఫీస్'
  •  ఆ సిరీస్ స్పూర్తితో రూపొందిన తెలుగు సిరీస్ 
  • లవ్ .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగే కామెడీ కంటెంట్ 
  •  అందుబాటులోకి వారానికి రెండు ఎపిసోడ్స్ 
తమిళంలో ఆ మధ్య 'వెరా మారి ఆఫీస్' అనే తమిళ సిరీస్ వచ్చింది. ఆ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సిరీస్ స్పూర్తితో 50 ఎపిసోడ్స్ గా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ 'వేరే లెవెల్ ఆఫీస్'.  ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం 3 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. వారానికి రెండు ఎపిసోడ్స్ చొప్పున అందుబాటులోకి రానున్నాయి. 

కథ: హైదరాబాదులో ఓ కార్పొరేట్ ఆఫీసులో రమ్య .. ఆదిత్య .. సూరి .. లవ్ లీ లక్కీ .. కిశోర్ .. సుందరరాజన్ కొత్తగా చేరతారు. రమ్య - ఆదిత్యలకి జాయినింగ్ రోజునే పరిచయం ఏర్పడుతుంది. సూరి విలేజ్ నేపథ్యం నుంచి వస్తాడు. తనకి జాబ్ లేదని అప్పటి వరకూ చులకనగా చూసినవారికి తానేమిటనేది చూపించడం కోసమే అతను సిటీకి వస్తాడు. ఇక లవ్లీ లక్కీ యూ ట్యూబ్ వీడియోస్ చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది.

ఆఫీసుకి సీనియర్ హెచ్ ఆర్ గా సుబ్రమణ్య శాస్త్రి (మిర్చి కిరణ్)  ఉంటాడు. సీనియర్స్ గా సత్య (బిగ్ బాస్ అఖిల్) .. లీనా వ్యవహరిస్తూ ఉంటారు. మిగతావారి విషయంలో పనిరాక్షసుడిలా ప్రవర్తించే సుబ్రమణ్య శాస్త్రి, లీనా విషయంలో మాత్రం మెత్తబడిపోతుంటాడు. ఆమె ఎవరితో మాట్లాడినా తట్టుకోలేకపోతుంటాడు. అది గమనించిన లీనా అతనితో పాటు ఆఫీసు వర్క్ ను కూడా లైట్ తీసుకుంటూ ఉంటుంది. 

ఆ సంస్థకి బ్రాంచ్ డైరెక్టర్ గా నిషా ( కాజల్) పనిచేస్తూ ఉంటుంది. బ్రాంచ్ డైరెక్టర్ గా సంస్థ పనితీరును మెరుగుపరిచే బాధ్యత ఆమెపైనే ఉంటుంది. అయితే తన వైవాహిక జీవితంలోని సమస్యల కారణంగా ఆమె తన పనులపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటుంది. ఒక వైపున ఆఫీసు పనులు .. మరో వైపున తన కొడుకును చూసుకోవడంలో ఆమె సతమతమవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ:ఈ మధ్య కాలంలో యూత్ ను దృష్టిలో పెట్టుకుని, కార్పొరేట్ ఆఫీసుల నేపథ్యంతో కూడిన కథలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వస్తున్నాయి. ఈ తరహా కథలు తెలుగులోను ఎక్కువగానే తయారవుతున్నాయి. అలా వచ్చిన వెబ్ సిరీస్ గా 'వేరే లెవెల్ ఆఫీస్' కనిపిస్తుంది. ఒక కార్పొరేట్ ఆఫీస్ .. అందులో పనిచేసే ఎంప్లాయిస్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

మొదటి ఎపిసోడ్ లోనే ప్రధానమైన పాత్రలను పరిచయం చేయడం బాగుంది. ఆయా పాత్రల నేపథ్యం .. స్వరూప స్వభావాలను ఆవిష్కరించారు. ఆ పాత్రల బలాలు .. బలహీనతలతో కలుపుకుని ఈ కథ నడవడానికి అవసరమైన ట్రాక్ వేసేశారు. ఇది కామెడీ టచ్ తో కూడిన కంటెంట్ అనే విషయం టైటిల్ ను బట్టే తెలిసిపోతుంది. అయితే మొదటి మూడు ఎపిసోడ్స్ లో ఆశించిన స్థాయి కామెడీ కనిపించలేదనే చెప్పాలి. డైలాగులు ఎక్కువున్నాయి .. కానీ వాటిలో ఉన్న  విషయం  తక్కువ.   

 ప్రేమ .. ఆకర్షణ .. ఒత్తిడి .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ, వినోదభరితమైన ఈ కథ ముందుకెళ్లనుందనే విషయం అర్థమైపోతుంది. కథ ఇప్పుడే మొదలైంది. ఆ కథతో ఇంకా ప్రయాణం చేయవలసిన దూరం చాలా ఉంది. ఈ లోగా వచ్చే కొత్త పాత్రలు .. తీసుకునే కొత్త మలుపులు కథను మరింత ఆసక్తికరంగా మార్చే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి .. కథా పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఈ సిరీస్ ఏ స్థాయిలో మేజిక్కు చేస్తుందో. 

పనితీరు: ఈ సిరీస్ లో .. బుల్లితెర వైపు నుంచి క్రేజ్ ఉన్నవారితో పాటు, అంతగా తెలియని వారూ ఉన్నారు. కొత్త వాళ్ల నుంచి మరింత అవుట్ పుట్ రాబట్టుకుంటే బాగుండేదని అనిపిస్తుంది. మిగతా ఎపిసోడ్స్ లో దార్లో పడతారేమో మరి. లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ వైపు నుంచి ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారనేది వెయిట్ చేయాలి. 

చింతపల్లి ప్రదీప్ రెడ్డి ఫొటోగ్రఫీ .. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం .. రామకృష్ణ ఎడిటింగ్ ఫరవాలేదు. సంభాషణల పరంగా ఛమక్కులైతే లేవు. మరి మున్ముందు కనెక్ట్ అవుతాయేమో. 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' సీజన్ 1 .. సీజన్ కూడా ఇలాంటి ఒక నేపథ్యంతో వచ్చినవే. వాటిని యూత్ రిసీవ్ చేసుకుంది. ఆ స్థాయి ఎంటర్టైన్ మెంట్ ను .. ఎమోషన్స్ ను ఈ సిరీస్ ఇస్తుందా అనేది చూడాలి. 

Movie Name: Vere level Office

Release Date: 2024-12-12
Cast: Akhil Sardhak, Shubhasri, RJ Kajal, Ritu Choudary
Director: E Satthi Babu
Producer: Asha jyothi Gogineni- Varun Choudary
Music: Ajay Arasada
Banner: Varun Entertainment

Vere level Office Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews