'సార్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ !

  • తమిళంలో రూపొందిన 'సార్'
  • 1960 - 80లలో నడిచే కథ 
  • గ్రామీణ నేపథ్యమే ప్రధానమైన బలం  
  • సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు
  • కనెక్ట్ అయ్యే ఎమోషన్స్  

తమిళంలో దర్శకుడిగా వెట్రి మారన్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటూ ఆలోచింపజేస్తూ ఉంటాయి. అలాంటి ఆయన సమర్పించిన సినిమానే 'సార్'. బోస్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ: ఈ కథ 1960 - 80 మధ్యలో జరుగుతుంది. అది అడవీ ప్రదేశానికి ఆనుకుని ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ కొండయ్య స్వామి కుటుంబమే పెత్తనం చేస్తూ ఉంటుంది. ఆ ఊరి ప్రజలంతా 'పోతురాజు'ను గ్రామదేవతగా కొలుస్తూ ఉంటారు. కొండయ్యస్వామి తన ఒంటిపైకి పోతురాజు పూనుతున్నాడని నాటకమాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటాడు. ఈ విషయంలో అతనికి వడ్డీ వ్యాపారస్థుడైన కమలయ్య వంటి కొంతమంది సపోర్టు ఉంటుంది. 

అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి అంజన్నరావు మాస్టారుగా వస్తాడు. అక్కడి ప్రజలకు చదువు గొప్పతనం గురించి చెబుతాడు. అయితే అక్కడివారు చదువుకుంటే, భవిష్యత్తులో తమని ఎదిరిస్తారని భావించిన కొండయస్వామి, ఎప్పటికప్పుడు ఆ ఊళ్లోని 'బడి'ని కూల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా వాళ్లను ఎదిరిస్తూ ఆ బడిని కాపాడుతూ వచ్చిన అంజన్నరావు ఒకానొక సమయంలో మతిస్థిమితం కోల్పోతాడు. 

అదే సమయంలో అంజన్నరావు కొడుకు అంజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఆ గ్రామానికి వస్తాడు. తన తండ్రి ఆపిన చోటు నుంచి తాను సంస్కరణలు మొదలుపెడతాడు. బడిని అభివృద్ధి చేస్తూ వెళతాడు. అలా 30 ఏళ్ల పాటు అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. తన కొడుకు 'శివ'ను బాగా చదివించి అదే గ్రామానికి అధ్యాపకుడిగా తీసుకుని వస్తాడు. శివ వచ్చిన కొన్ని రోజులకే అంజయ్య కూడా మతి స్థిమితాన్ని కోల్పోతాడు.

 శివ అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న వెంకటలక్ష్మిని ప్రేమిస్తాడు .. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె కనిపించకుండా పోతుంది. శివకి కూడా మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే భార్య వెళ్లిపోయిందనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. దాంతో తన తాత కాలం నుంచి జరుగుతున్న కుట్రపై శివకి అనుమానం కలుగుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: 1960 - 80లలో వెనుకబడిన ప్రాంతాలలో చాలా సహజంగా కనిపిస్తూ వచ్చిన సంఘటనల సమాహారం ఇది. అప్పట్లో గ్రామాలలోని నిరక్షరాస్యతను అడ్డుపెట్టుకుని కొన్ని కుటుంబాల వారు తమ పెత్తనాన్ని కొనసాగించారు. అక్కడ ప్రజలను చదువు ద్వారా చైతన్యవంతులను చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, మూఢనమ్మకాల పేరుతో ఆ ప్రజలనే రెచ్చగొట్టి, ఉపాధ్యాయులను తరిమేశారు. ఆ అంశంపైనే నడిచే కథ ఇది.

ఒక చిన్న గ్రామం .. అక్కడ ఏర్పాటు చేసిన ఒక చిన్న స్కూలు. పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే  ఒక అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయ కుటుంబం. ఆ కుటుంబాన్ని తరిమేయడానికి ప్రయత్నించే ఒక పెత్తందారీ కుటుంబం. వీటి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. సహజత్వమే ఈ కథకు ప్రాణం. వాస్తవానికి దగ్గరగా ఆవిష్కరించిన సన్నివేశాలే ప్రధానమైన బలం. పాత్రలను మలచిన విధానమే ప్రత్యేకమైన ఆకర్షణ. 

తరతరాలుగా ఒక గ్రామాన్ని చదువుకు దూరంగా ఉంచడానికి ఒక వర్గం వారు చేసే పోరాటాన్ని, ఒక ఉపాధ్యాయ కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనే అంశాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. బరువైన .. బలమైన ఎమోషన్స్, సున్నితమైన ప్రేమకథ ప్రేక్షకులకు కనెక్టు అవుతాయి. చాలా తక్కువ బడ్జెట్ లో ఆనాటి ఒక బలమైన సమస్యను దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తీరు ప్రశంసనీయంగా అనిపిస్తుంది. 

పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. తెరపై ఆర్టిస్టులు కాకుండా పాత్రలు మాత్రమే కనిపించేలా సహజత్వాన్ని తీసుకుని వచ్చారు. ఇనియన్ జె హరీశ్ ఫొటోగ్రఫీ .. సిద్ధు కుమార్ నేపథ్య సంగీతం .. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ కంటెంట్ ను మరింత కనెక్ట్ చేస్తాయి. 

ఇది రెగ్యులర్ వచ్చే వినోదపరమైన అంశాలతో కూడిన సినిమా కాదు. కేవలం ఆనాటి గ్రామీణ వ్యవస్థ .. అక్కడ తమ పెత్తనం సాగడానికి కొంతమంది చేసే ప్రయత్నాలు .. వారిని ఎదిరించడానికి చేసే పోరాటంగా ఈ కథ కనిపిస్తుంది. ఆనాటి గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండేది .. అప్పటివారిలో మూఢనమ్మకాలు ఎంత బలంగా ఉండేవనేది తెలుసుకోవాలనుకున్నవారికి ఈ కథ కనెక్ట్ అవుతుంది.

Movie Name: SIR

Release Date: 2024-12-06
Cast: Vimal, Chaya Devi Kannan, Siraj S, Saravanan
Director: Bose Venkat
Producer: Siraj Nilofer - Siraj
Music: Siddhu Kumar
Banner: SSS Pictures

SIR Rating: 2.50 out of 5


More Movie Reviews