'అల వైకుంఠపురములో' మూవీ రివ్యూ

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక తండ్రి, తన కొడుకును శ్రీమంతుడిగా చూసుకోవాలనే స్వార్థంతో, పురిటిలోనే బిడ్డలను మారుస్తాడు. అలా మధ్యతరగతికి చెందిన ఆ బిడ్డ శ్రీమంతుల కుటుంబంలో పెరుగుతాడు. శ్రీమంతుల బిడ్డ మధ్యతరగతి ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఎదుగుతాడు. ఈ నిజం ఎలా బయటపడుతుంది? ఎప్పుడు బయటపడుతుంది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ సాగుతుంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో సహజంగానే 'అల వైకుంఠపురములో' సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఎప్పటిలానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలను మేళవించి త్రివిక్రమ్ ఈ కథను ఆవిష్కరించాడు. బన్నీ స్టైల్ కి త్రివిక్రమ్ తన మార్కును జోడించి అందించిన ఈ సినిమా, వాళ్లకి హ్యాట్రిక్ హిట్ ను అందిస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం.

రామచంద్రరావు(జయరామ్) శ్రీమంతుడు .. ఆయన అనేక సంస్థలను నిర్వహిస్తుంటాడు. వాల్మీకి (మురళీ శర్మ) మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన రామచంద్రరావు కోటీశ్వరుడు అయ్యాడనే ఈర్ష్యను లోపల పెట్టుకుని ఆయన దగ్గరే వాల్మీకి పనిచేస్తుంటాడు. ఇద్దరి భార్యలు ఒకే హాస్పిటల్లో .. ఒకే సమయంలో ప్రసవిస్తారు .. ఇద్దరికీ మగపిల్లలే జన్మిస్తారు. అయితే తన కొడుకును శ్రీమంతుడిగా చూసుకోవాలనే స్వార్థంతో వాల్మీకి బిడ్డలను మార్చేస్తాడు. ఈ విషయంలో అడ్డుపడిన నర్స్ .. వాల్మీకి కారణంగా 'కోమా'లోకి వెళుతుంది. రామచంద్రరావు ఇంట్లో వాల్మీకి కొడుకు రాజ్ (సుశాంత్) .. వాల్మీకి ఇంట్లో రామచంద్రరావు కొడుకు బంటు (అల్లు అర్జున్) పెరుగుతారు. ఒకనొక కీలకమైన సమయంలో తన తండ్రి రామచంద్రరావు అనే విషయం బంటుకు తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? పర్యవసానాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన మలుపులతో మిగతా కథ నడుస్తుంది.

కథగా చెప్పుకుంటే ఏమీ ఉండదు .. కథనంగా చూస్తే మాత్రం రసవత్తరంగా ఉంటుంది అనిపించేలా చేయడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. పెద్దగా బలమైన కథ కాకపోయినప్పటికీ, తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఆయన ఇంట్రెస్టింగ్ గానే చెప్పాడు. ఈ మొత్తం కథలో అల్లు అర్జున్ .. మురళీ శర్మ పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. స్వార్థానికి నిలువెత్తు నిదర్శనంగా మురళీశర్మ పాత్రను .. త్యాగానికి ఆనవాలుగా అల్లు అర్జున్ పాత్రను త్రివిక్రమ్ మలిచిన తీరు బాగుంది. ఈ రెండు పాత్రల మధ్య ఆయన కలిపిన కామెడీ .. ఎమోషన్ పాళ్లు కుదిరాయి.

కథానాయికగా పూజా హెగ్డే .. అల్లు అర్జున్ జీవితంలోకి ప్రవేశించే తీరును .. తన అసలు తల్లిదండ్రుల జీవితాల్లోకి అల్లు అర్జున్ ప్రవేశించే విధానాన్ని .. ఈ మధ్యలో నడిచే సన్నివేశాలను త్రివిక్రమ్ గొప్పగా చెప్పాడు. అయితే ప్రతినాయకుడైన అప్పలనాయుడు (సముద్రఖని)తో రామచంద్రరావుకి గల లావాదేవీలు ఏమిటి? రామచంద్రరావు నుంచి అప్పలనాయుడు ఆశిస్తున్నదేమిటి? అనే విషయంలో సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యే అంశాన్ని ఎంచుకుని వుంటే బాగుండేదనిపిస్తుంది.

బంటు పాత్రలో అల్లు అర్జున్ లుక్స్ పరంగాను .. నటన పరంగాను అదరగొట్టేశాడు. పూజా హెగ్డే కాంబినేషన్లోని రొమాంటిక్ సీన్స్ ను, తన చెల్లెలిని ఏడిపించినవారికి, తన అసలు తల్లిదండ్రులకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న అప్పలనాయుడు గ్యాంగ్ కి బుద్ధి చెప్పే యాక్షన్ సీన్స్ లోను .. తను ఎవరన్నది తెలుసుకుని తన కుటుంబానికి అండగా నిలిచే కొడుకుగా ఎమోషనల్ సీన్స్ లోను బన్నీ మెప్పించాడు. ఈ సినిమాలో కొత్తగా ఆయన వేసిన స్టెప్స్ అభిమానుల చేత విజిల్స్ వేయిస్తాయి. కథానాయిక పూజా హెగ్డే ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపించింది. నటన పరంగాను ఆకట్టుకుంటూ డాన్స్ విషయంలో బన్నీ సరసన తేలిపోకుండా జాగ్రత్త పడింది.

బన్నీ పెంపుడు తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన ఈ సినిమాకి హైలైట్. తనకిచ్చిన మేనరిజంతో మురళీశర్మ ఆ పాత్రకి జీవం పోశాడు. పాత్రలో నుంచి ఆయన ఎక్కడా బయటికి రాలేదు. విలన్ పాత్రలో సముద్రఖని తన మార్క్ చూపించాడు. అయితే ఆయన పాత్రను ఇంకా పవర్ఫుల్ గా మలిస్తే బాగుండేది. కథా పరంగా 'టబు' తన పాత్రలో ఎప్పుడూ ముభావంగానే కనిపించింది. పూర్తిగా గ్లామర్ ను కోల్పోయిన టబు, ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉండటంతో ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలగదు. ఈ పాత్రకి టబు అవసరమా అనిపిస్తుంది కూడా. ఇక సునీల్ ఇంత చిన్న పాత్రను చేస్తాడని ఎవరూ ఊహించరు. పోనీ చిన్న పాత్రే అయినా అది పేలిందా అంటే అదీ లేదు. జయరామ్ .. నవదీప్ .. సుశాంత్ .. నివేద పేతురేజ్ .. తనికెళ్ల భరణి .. వెన్నెల కిషోర్ తదితరులు ఓకే అనిపించారు.

త్రివిక్రమ్ కథాకథనాలకి పూర్తిస్థాయిలో సపోర్ట్ గా నిలిచింది ఏమిటయ్యా అంటే తమన్ సంగీతమనే చెప్పాలి. 'సామజ వర గమన' .. 'రాములో రాములా' .. 'బుట్టబొమ్మా' పాటలు యూత్ ను ఒక ఊపు ఊపేస్తాయి. సాహిత్యం పరంగాను .. ఆలాపన పరంగాను .. చిత్రీకరణపరంగాను ఈ మూడు పాటలు ఆడియన్స్ కి పూర్తిస్థాయి రిలీఫ్ ను ఇస్తాయి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది .. సన్నివేశాల్లో నుంచి ప్రేక్షకులు జారిపోకుండా రీ రికార్డింగ్ తన కూడా వాళ్లను తీసుకెళుతుంది. వినోద్ కెమెరా పనితనం బాగుంది. బన్నీని .. పూజా హెగ్డేని చాలా అందంగా చూపించాడు. ఫైట్స్ ను .. పాటలను చాలా ఎఫెక్టివ్ గా ఆవిష్కరించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది.
 
రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. ముఖ్యంగా తన చెల్లెలి చున్నీని లాగేసి తీసుకెళ్లిన రౌడీ గ్యాంగ్ దగ్గరికి బన్నీ వెళ్లి వాళ్లతో ఫైట్ చేస్తాడు. ఆ చున్నీని రౌడీల చేతనే తడిపించి .. వాళ్లతోనే నీళ్లు పోయేవరకూ పిండించి .. వాళ్లే ఆరబెట్టేసి .. మడతపెట్టి ఇచ్చేలా చేస్తాడు. ఇదంతా కూడా ఫైట్ లో భాగంగానే జరుగుతుంది. రామ్ లక్ష్మణ్ కొత్తగా డిజైన్ చేసిన ఈ ఫైట్ హైలైట్ గా నిలుస్తుంది.

ఇక సంభాషణల విషయంలో త్రివిక్రమ్ కి వంక బెట్టడానికి వీల్లేదన్న సంగతి తెలిసిందే. ఆయన తన పెన్ గన్ నుంచి మాటల తూటాలను చాలానే పేల్చాడు. 'నిజం చెప్పేటప్పుడే భయమేస్తుంది .. చెప్పకపోతే ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది' .. ' వాడు నీ కొడుకని ఎవరికీ చెప్పలేవు .. నేనేమో నిన్ను తండ్రిగా అంగీకరించను .. ఎందుకు నీ జీవితం' .. 'దేవుడికి దక్షిణ కావాలి .. రాజుకి రక్షణ కావాలి' ..' ఎవరినైనా ప్రేమించి చూడు అబద్ధం విలువ అర్థమవుతుంది' .. 'బయట నుంచి గాలి వస్తే తలుపులు వేసుకుంటాము .. కానీ ఇంట్లోనే తుఫాను మొదలైతే' .. 'కార్లు ఖాళీగా ఉన్నాయనీ .. రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు రావొద్దరరేయ్' .. 'నేను గెలవడం కంటే .. మీరు కలవడం  ఇంపార్టెంట్' వంటి డైలాగ్స్ పేలాయి.

కథ తేలికపాటిదే అయినా .. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో త్రివిక్రమ్ నడిపించాడు. ఎమోషనల్ సీన్స్ ను ఆడియన్స్ కి కనెక్ట్ చేసే ప్రయత్నంలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు స్లో అయినట్టు అనిపించినా, అవేం పెద్దగా ఇబ్బంది పెట్టవు. త్రివిక్రమ్ కథ .. మాటలు .. చిత్రీకరణకు, తమన్ సంగీతం .. రీ రికార్డింగ్ .. వినోద్ కెమెరా పనితనం .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. కొరియోగ్రఫీ తోడు కావడం వలన ఈ సినిమా బాగుందనిపిస్తుంది. బన్నీ అభిమానుల నుంచి మరి కాసిన్ని ఎక్కువ మార్కులే కొట్టేస్తుంది.        

Movie Name: Ala Vaikunthapurramuloo

Release Date: 2020-01-12
Cast: Allu Arjun, Pooja Hegde, Murali Sharma , Tabu, Nivetha Pethuraj, Rajendra Prasad, Sunil, Jayaram, Samuthirakani, Sushanth, Navadeep, Vennela Kishore
Director: Trivikram
Producer: Allu Aravind, Radha Krishna 
Music: Thaman 
Banner: Geetha Arts, Harika - Hassine Creations 

Ala Vaikunthapurramuloo Rating: 3.50 out of 5


More Movie Reviews