'ఏలియన్ : రొములస్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • ఆగస్టు 23న థియేటర్లకు వచ్చిన సినిమా
  • వేల కోట్ల వసూళ్లను చూసిన కంటెంట్  
  • ఈ నెల 21వ తేదీ నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలు
  • ప్రధాన బలంగా నిలిచే నేపథ్య సంగీతం 

'ఏలియన్' పేరుతో 1979లో వచ్చిన సినిమాకి ఫ్రాంచైజీగా, 1986 .. 1992 .. 1997 .. 2012 .. 2017లలో సినిమాలు వచ్చాయి. 2017 తరువాత ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన సినిమానే 'ఏలియన్ రొములస్'.  ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 675 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 3 వేల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: ఈ కథ 2142లో జరుగుతుంది. రెయిన్( కైలీ స్పెనీ) ఆమె తన సోదరుడిగా భావించే ఆండీ ( డేవిడ్ జాన్సన్) నిర్బంధ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఆండీ ఆర్టిఫీషియల్ గా తయారు చేయబడిన వ్యక్తి. స్పేస్ షిప్ లలోకి వెళ్లే యాక్సిస్ అతనికి ఉంటుంది. అతనితో తమ సొంత ప్రాంతానికి వెళ్లడానికి అనుమతి లేని కారణంగా రెయిన్ అసంతృప్తితో ఉంటుంది. అదే విషయాన్ని ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టేలర్ (ఆర్చీ రెనాక్స్)కి చెబుతుంది. 

ఒక పాత స్పేస్ స్టేషన్ గురించి రెయిన్ దగ్గర ఆర్చీ ప్రస్తావిస్తాడు. అందులోని విలువైన వస్తువులను దక్కించుకోవాలనే ఆలోచనను వ్యక్తం చేశాడు. ఆ స్పేస్ స్టేషన్ లోకి ఆండీ యాక్సెస్ తో మాత్రమే వెళ్లగలమని చెబుతాడు. ఈ విషయం బయటపడితే, తమ ప్రయాణాలపై నిషేధాన్ని ఎదుర్కోవలసి వస్తుందనే ఆందోళనను రెయిన్ వ్యక్తం చేస్తుంది. అలాంటిదేం జరగకుండా తాను చూసుకుంటానని అతను మాట ఇస్తాడు. ఆర్చీ చెల్లెలు 'కె'తో పాటు మరో ఇద్దరు ఆ స్పేస్ షిప్ లో ఉంటారు. మొత్తం ఆరుగురు అందులో బయల్దేరతారు.

అలా ఆ స్పేస్ షిప్ లో కొంతదూరం ప్రయాణించిన తరువాత వారు ఆ స్పేస్ స్టేషన్ కి చేరుకుంటారు. అది పాతకాలం నాటి   స్పేస్ స్టేషన్ కాదనీ, కొంతకాలంగా వాడుకలో లేదనే విషయాన్ని గ్రహిస్తారు. ఆ స్టేషన్ లోని ఇతర వస్తు సామాగ్రితో పాటు 'ఫ్యూయెల్' కూడా తీసుకుపోవాలని భావిస్తారు. అందుకోసం ఒక్కో రూమ్ ను ఓపెన్ చేస్తూ వెళతారు. అలా ఒక రూమ్ ఓపెన్ చేయగానే ఒక రకమైన వింత జీవులు వాళ్లపై ఎటాక్ చేస్తాయి. అవి తమ శరీరంలో బ్లడ్ ను కాకుండా యాసిడ్ ను కలిగి ఉన్నాయనే విషయాన్ని వాళ్లు తెలుసుకుంటారు. 

ఆ వింతజీవులకు కళ్లు ఉండవనీ, శబ్దాన్ని బట్టి దాడి చేస్తాయనే విషయం వాళ్లకి అర్థమవుతుంది. ఆడవాళ్లపై ఆ జీవులు ఎటాక్ చేసిన కాసేపట్లోనే, వారి గర్భంలో నుంచి ఏలియన్ పుట్టుకొస్తుందని తెలుసుకుని షాక్ అవుతారు. అంతలో ఆ టీమ్ లోని ఒక యువతిపై ఆ జీవులు దాడి చేయడం .. కొంతసేపట్లోనే ఆమె శరీరాన్ని చీల్చుకుని ఏలియన్ బయటికి రావడం జరిగిపోతుంది. ఆ ఏలియన్ బారి నుంచి మిగతావారు తప్పించుకోగలిగారా లేదా? అనేది మిగతా కథ.         

విశ్లేషణ: ఈ సినిమాకి ఫెడే అల్వారిజ్ దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన నుంచి 'ఈవిల్ డెడ్' .. 'డోంట్ బ్రీత్' వంటి హారర్ సినిమాలు రావడం వలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. పై రెండు సినిమాలు కూడా భయానికే 'దడ' పుట్టించే కంటెంట్ కలిగినవి. ఆ సినిమాలను దృష్టిలో పెట్టుకుని వెళ్లినవారికి ఈ సినిమా సంతృప్తిని కలిగిస్తుందా అంటే కలిగిస్తుందనే చెప్పాలి.

ఇది రెండు గంటల నిడివి కలిగిన సినిమా. కాకపోతే ఒక గంటసేపు దాటిన తరువాతనే ఏలియన్ ఎంట్రీ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలలో కాస్త లీడ్ ఎక్కువగా ఉండటం జరుగుతూనే ఉంటుంది. అసలు కంటెంట్ దగ్గరికి తీసుకుని వెళ్లడానికి వాళ్లు కొంత సమయం తీసుకుంటారు. ఈ సినిమా విషయంలోను అదే జరుగుతుంది. కనుక కాసేపు వెయిట్ చేయాలంతే. ఎప్పుడైతే స్పేస్ స్టేషన్ లో నిద్రాణ స్థితిలో ఉన్న ఏలియన్స్ ను వారు టచ్ చేశారో అక్కడి నుంచి ఊపిరి బిగబట్టవలసిందే. 

అది స్పేస్ స్టేషన్ .. ఏలియన్స్ దాడి .. తప్పించుకోవడానికి తమ స్పేస్ షిప్ వరకూ వెళ్లలేని పరిస్థితి. వెళ్లిన ఆరుగురు ఎలా బయటపడతార్రా భగవంతుడా? అనుకోని ఆడియన్స్ ఉండరు. ఇక జుగుప్సాకరంగా కనిపించే ఏలియన్స్ ను .. అవి అత్యంత దారుణంగా చంపే సన్నివేశాలను .. మనుషుల గర్భాలను చీల్చుకుని బయటికి రావడం వంటి దృశ్యాలను చూసి తట్టుకోవడం కష్టమేనని చెప్పాలి. 

పనితీరు: హాలీవుడ్ మూవీ గనుక, నిర్మాణ విలువలు ఆ స్థాయిలోనే కనిపిస్తాయి. దర్శకుడు ఫెడే అల్వారిజ్, ఈ కంటెంట్ ను ఉత్కంఠభరితంగా అందించడంలో సక్సెస్ అయ్యాడు. గ్రావిటీతో కూడిన దృశ్యాలను గొప్పగా ఆవిష్కరించాడు. అసలు కథ పట్టాలు ఎక్కిన దగ్గర నుంచి, కదలకుండా కూర్చోబెట్టేస్తాడు. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టుల నటన హైలైట్ అనే చెప్పాలి. ఏలియన్ ఎటు వైపు నుంచి దాడి చేస్తుందో తెలియక, బిక్కిబిక్కుమంటూనే అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నించే సన్నివేశాలలో వారి సహజమైన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ పరంగా వంక బెట్టడానికి లేదు. బెంజమిన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందని అనిపిస్తుంది. 

'ఏలియన్' ఫ్రాంచైజీ నుంచి వరుసగా వస్తున్న సినిమాలను ఫాలో అయితేనే ఈ కథ అర్థమవుతుందేమోనని చాలామంది అనుకుంటారు. కానీ కాస్త దృష్టి పెడితే, కథ మొదలైన కాసేపటికే విషయం అర్థమైపోతుంది. కథాకథనాలు .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. సాంకేతిక పరమైన అంశాల పరంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. అసభ్యకరమైన సన్నివేశాలు లేవు .. భయానక దృశ్యాలను చూసి తట్టుకోగలిగే ధైర్యం ఉంటే చాలు. 

Movie Name: Alien Romulus

Release Date: 2024-11-21
Cast: Cailee Spaeny, David Jonsson, Archie Renaux, Isabela Merced, Spike Fearn
Director: Fede Alvarej
Producer: Ridley Scott
Music: Benjamin Walifisch
Banner: Scott Free Productions

Alien Romulus Rating: 3.25 out of 5

Trailer

More Movie Reviews