'తూటా' మూవీ రివ్యూ

'రఘు' చిన్నతనంలోనే ఆయన అన్నయ్య ఇల్లొదిలిపోతాడు. ఇంజనీరింగ్ చదువుతున్న రఘు .. సినిమాల్లో నటించే 'లేఖ' ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వలన రఘుకి దూరమైన ఆమె, కొంతకాలం తరువాత రఘుకి కాల్ చేస్తుంది. రఘు అన్నయ్యను గురించిన ఒక రహస్యం చెబుతుంది. అదేమిటి? లేఖతో పాటు అన్నయ్యను రక్షించుకోవడం కోసం రఘు ఏం చేస్తాడు? అనేవి మిగతా కథ. ఫస్టాఫ్ లో కథ అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. సెకండాఫ్ లో కొంత అర్థమైనప్పటికీ, ఆశించినస్థాయిలో లేని ముగింపు అసంతృప్తిని కలిగిస్తుంది.
తమిళనాట ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆయన చేసిన 'ఎన్నై నోకి పాయుమ్ తోటా' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ప్రయత్నించారుగానీ కుదరలేదు. పోటీ లేకుండా చూసుకుని ఈ రోజున ఈ సినిమాను ఇక్కడ విడుదల చేశారు. గౌతమ్ మీనన్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుందో ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే .. రఘు (ధనుశ్) అన్నయ్య గురుమూర్తి (శశికుమార్), ప్రేమించిన అమ్మాయిని కోల్పోతాడు. ఇంటికి దూరమైన అతని కోసం తల్లిదండ్రులు .. తమ్ముడు రఘు .. చెల్లెలు శ్రావ్య చాలా కాలంగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న లేఖ (మేఘ ఆకాశ్), కుమార్ అనే వ్యక్తి ఆశ్రయం పొందుతుంది. తనకి ఇష్టం లేకపోయినా అతని ఒత్తిడి కారణంగా సినిమాల్లో నటిస్తుంటుంది. అలా రఘు కాలేజ్ కి షూటింగుకి వచ్చిన లేఖ, మొదటిసారిగా అతణ్ణి అక్కడ చూస్తుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది.

రఘు .. లేఖను తన తల్లిదండ్రులకు పరిచయం చేసి, ఆమెతో పెళ్లికి వాళ్ల అనుమతి తీసుకుంటాడు. అయితే కుమార్ వచ్చి వాళ్లని బెదిరించి లేఖను తీసుకెళ్లిపోతాడు. అప్పటి నుంచి లేఖ జాడ లేకపోవడంతో రఘు వెదుకుతూనే ఉంటాడు. నాలుగేళ్ల తరువాత రఘుకి లేఖ కాల్ చేసి, అతని అన్నయ్యను గురించి ఒక రహస్యం చెబుతుంది. అదేమిటి? అప్పుడు రఘు ఏం చేస్తాడు? లేఖతో పాటు తన అన్నను రక్షించుకోగలుగుతాడా? అనేదే మిగతా కథ.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా గల కథలను సిద్ధం చేసుకోవడం, సహజత్వానికి దగ్గరగా ఆ కథను తెరపై ఆవిష్కరించడం గౌతమ్ మీనన్ ప్రత్యేకత. ఇక రొమాంటిక్ సీన్స్ విషయంలో ఆయన చేయి తిరిగిన దర్శకుడు. అవే అంశాలకి ప్రాధాన్యతనిస్తూ ఆయన ఈ సినిమాను చేశాడు. ఒక వైపున ప్రమాదం అంచుల్లో తను మనసిచ్చిన అమ్మాయి. మరో వైపున ఆపదలో తన తోడబుట్టిన అన్నయ్య. ఈ ఇద్దరిని ఒకే సమయంలో కాపాడుకోవలసిన బాధ్యతను ఆయన హీరో భుజాలపై పెట్టారు. కామెడీకి ఎంతమాత్రం అవకాశం ఇవ్వకపోవడమే పెద్ద లోపంగా కనిపిస్తుంది.  

దర్శకుడు కథను ఎక్కడైతే మొదలుపెట్టాడో .. విశ్రాంతి సమయానికి తిరిగి కథను అక్కడికే తీసుకొచ్చి, ఆ తరువాత అసలు కథను నడిపించే స్క్రీన్ ప్లే బాగుంది. అయితే సగటు ప్రేక్షకుడికి ఈ స్క్రీన్ ప్లే కొంత అయోమయాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. నాయక నాయికల పరిచయం వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది. ధనుశ్ లుక్ ఆకట్టుకునేలా డిజైన్ చేయలేకపోయారు. నాలుగు పాత్రలకి మించి ఏ పాత్ర రిజిస్టర్ చేయలేకపోయారు. పోలీస్ ఆఫీసర్ గా ధనుశ్ అన్నయ్య చేసిన ఆపరేషన్ దేని గురించి? అనే విషయాన్ని చెప్పడంలో క్లారిటీ లోపించింది. ప్రీ క్లైమాక్స్ ను ఇంట్రెస్టింగ్ పరుగులు తీయించిన దర్శకుడు, అంతకుమించిన ముగింపును ఇవ్వడంలో విఫలమయ్యాడు.

రఘు పాత్రలో ధనుశ్ బాగా చేశాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలలో తన మార్క్ చూపించాడు. అయితే లుక్ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసింది. కొత్తగా ట్రై చేసిన లుక్ బాగోలేదు. ఆ పాత్రకి అలా కనిపించవలసిన అవసరం కూడా లేదు. కథానాయికగా మేఘ ఆకాశ్ కొన్ని ఫ్రేమ్స్ లో అందంగా కనిపించింది .. పాత్ర పరిధిలో నటించింది. ఇక ధనుశ్ అన్నయ్యగా శశికుమార్ .. కుమార్ పాత్రను చేసిన వ్యక్తి కూడా ఓకే అనిపించారు.

శివ సంగీతం ఫరవాలేదు .. సందర్భంలో కుదురుకోవడానికి ప్రయత్నిస్తూ పాటలు సాగిపోతుంటాయి. నేపథ్య సంగీతానికి మంచి మార్కులే పడతాయి. యాక్షన్ సన్నివేశాల్లోను .. పాటల చిత్రీకరణలోను కెమెరా పనితనం కనిపిస్తుంది. కథాపరంగా చూసుకుంటే, ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ పనితనం కూడా ఫరవాలేదు. ఫైట్స్ .. కొరియోగ్రఫీ కూడా ఓకే అనిపిస్తాయి.

స్పష్టత లోపించిన కథ .. అయోమయానికి గురిచేసే కథనం .. ఇంట్రెస్టింగ్ గా లేని పాత్రల నేపథ్యాలు .. కామెడీకి దక్కని చోటు .. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలను హడావిడిగా మాత్రమే మిగిల్చిన క్లైమాక్స్ కారణంగా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలమైందని చెప్పొచ్చు.      


Movie Name: Thoota

Release Date: 2020-01-01
Cast: Dhanush, Megha Akash, Sasi Kumar, Ashwin, Sunaina, Senthil    
Director: Gautham Menon 
Producer: Tata Reddy, Sathyanarayana Reddy 
Music: Darbuka Siva
Banner: Vijayabheri  

Thoota Rating: 2.00 out of 5


More Movie Reviews