'లక్కీ భాస్కర్' - మూవీ రివ్యూ!

  • 'లక్కీ భాస్కర్'గా వచ్చిన దుల్కర్
  • బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో సాగే కంటెంట్ 
  • 1990లలో నడిచే కథాకథనాలు 
  • ఆసక్తికరమైన సన్నివేశాలు 
  • ఆలోచింపజేసే సందేశం

దుల్కర్ సల్మాన్ కి మలయాళంతో పాటు, తమిళ .. తెలుగు భాషల్లోను మంచి మార్కెట్ ఉంది. 'సీతారామం' సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆయన టైటిల్ రోల్ ను పోషించిన సినిమా 'లక్కీ భాస్కర్'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: ఈ కథ 1990లలో .. ముంబైలో మొదలవుతుంది. భాస్కర్ (దుల్కర్) ఓ ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్ గా  పనిచేస్తూ ఉంటాడు. భార్య సుమతి (మీనాక్షి చౌదరి) కొడుకు కార్తీక్ .. తండ్రి ప్రహ్లాద్ (సర్వదమన్ బెనర్జీ) ఓ తమ్ముడు .. చెల్లి ఇది అతని కుటుంబం. చాలీచాలని జీతంతో భాస్కర్ సతమతమవుతూ ఉంటాడు. తమ్ముడు - చెల్లి కాలేజ్ ఫీజులు .. కొడుకు స్కూల్ ఫీజ్ కట్టడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. 

ఇక భాస్కర్ భార్య సుమతికి ఫుడ్ బిజినెస్ చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. అందుకు తగిన పెట్టుబడి లేకపోవడమే ప్రధానమైన సమస్య. ఈ నేపథ్యంలో తనకి రానున్న ప్రమోషన్ పై భాస్కర్ ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అయితే పై అధికారుల స్వార్థం కారణంగా ఆ ప్రమోషన్ వేరొకరికి వెళ్లిపోతుంది. ఆ సంఘటన భాస్కర్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంతవరకూ చేసిన అప్పులు అతనిని భయపెడతాయి. తన కుటుంబ సభ్యుల అవసరాలు .. ఆశయాలు తీర్చడం కోసం అక్రమాలకు పాల్పడటం మినహా మరో మార్గం లేదని భావిస్తాడు. 

ఈ సమయంలోనే భాస్కర్ కి ఆంటోని (రాంకీ) పరిచయమవుతాడు. అక్రమ మార్గంలో ఉన్న అతనితో భాస్కర్ చేతులు కలుపుతాడు. అందుకోసం బ్యాంకు డబ్బును సర్దుబాటు చేస్తూ, తన తోటి ఉద్యోగస్తులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. బ్యాంకులో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా, మంచితనం మోసపోవడానికి మాత్రమే పనికొస్తుందనే విషయం అతనికి అర్థమవుతుంది. డబ్బు అవసరాలు తీరుస్తుంది .. అవమానాలను నివారిస్తుంది .. గౌరవాన్ని తెచ్చిపెడుతుందనడానికి నిదర్శనంగా అతనికి కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. 

అప్పటివరకూ బ్యాంకు ద్వారా సేవలను అందిస్తూ వచ్చిన భాస్కర్, అప్పటి నుంచి బ్యాంకును తన అవసరాల కోసం వాడుకోవడం మొదలుపెడతాడు. అలా కొంత కాలంలోనే అతను కారు .. బంగ్లా .. విలాసవంతమైన జీవితాన్ని అందుకోగలుగుతాడు. 6 వేల జీతంతో తన అవసరాలను తీర్చుకోవడానికి నానా ఇబ్బందులుపడే భాస్కర్ ఎకౌంట్ లోకి 100 కోట్లపైగా చేరతాయి. అలాంటి పరిస్థితుల్లో అతను సీబీఐకి దొరికిపోతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అతను లక్కీ భాస్కర్ ఎలా అవుతాడు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ : వెంకీ అట్లూరి మంచి రచయిత .. దర్శకుడు. 'సార్' (వాతి) వంటి హిట్ తరువాత అయన రూపొందించిన సినిమా ఇది. ఈ కథను ఆయనే తయారు చేసుకున్నాడు. ఈ కథ ఎక్కడ జరుగుతోంది? ఎప్పుడు జరుగుతోంది? ఎలా జరుగుతోంది? అనే మూడు అంశాలపై వెంకీ ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. 1990ల నాటి వాతావరణ పరిస్థితులను .. అప్పటి ముంబై నేపథ్యాన్ని తీసుకుని ఆయన ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. 

1990ల నాటి కాస్ట్యూమ్స్ .. వెహికల్స్ .. వస్తువులు ఇలా అన్ని విషయాల్లో శ్రద్ధ చూపించారు. ఈ విషయంలో ఎక్కడైనా కాస్త తేడా కొట్టిందంటే అది దుల్కర్ హెయిర్ స్టైల్ అనే చెప్పాలి. 1990లలో హెయిర్ స్టైల్స్ ఇంత దారుణంగా లేవే అనిపిస్తుంది. దర్శకుడు కథ ఎత్తుకున్న తీరు ఫస్టాఫ్ ను ఇంట్రెస్టింగ్ గా రన్ చేస్తే, ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.

తోటి ఉద్యోగస్తుల ముందు బాస్ తో భాస్కర్ అవమానించబడే సీన్, చివర్లో వాళ్లకి బుద్ధి చెప్పే సీన్ .. భాస్కర్ ను సున్నితంగా మందలిస్తూ తండ్రి చెప్పే నాలుగు మాటలకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా అనిపిస్తాయి. "రోజులో నాకు నచ్చినట్టుగా కొన్ని గంటలు గడవలేదని బాధపడుతూ కూర్చోవడం కరెక్టు కాదు" అనే డైలాగ్, ఈ కథ మొత్తాన్ని ప్రభావితం చేసే డైలాగ్. 

పనితీరు: దర్శకుడు తాను చెప్పదలచుకున్న అంశాన్ని చాలా క్లారిటీతో చెప్పాడు. డబ్బు వలన గౌరవం పెరుగుతుంది .. అయితే ఆ డబ్బును సంపాదించే మార్గం సరైనది  కానప్పుడు అది ఆ గౌరవాన్ని ఏదో ఒక రోజున కూల్చేస్తుంది. డబ్బు సుఖాన్ని ఇస్తుందిగానీ .. ప్రశాంతతను ఎప్పటికీ ఇవ్వలేదు. "కుటుంబం కోసం కొన్ని చెయ్యాలి .. అదే కుటుంబం కోసం అవసరమైతే అన్నింటినీ వదిలేయాలి" అనే సందేశాన్ని ఇచ్చే కథ ఇది. ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే హీరో - హీరోయిన్స్ వైపు నుంచి ఒక వర్గం ఆడియన్స్ కోరుకునే రొమాన్స్ .. డ్యూయెట్లు లేకపోవడం కాస్తంత అసంతృప్తిని కలిగిస్తుంది. 

నిమిష్ రవి ఫొటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను చాలా సహజంగా ఆయన తెరపై ఆవిష్కరించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం, కథలో నుంచి ప్రేక్షకులు జారిపోకుండా చూసుకుంటుంది. నవీన్ నూలి ఎడిటింగ్ మంచి మార్కులు కొట్టేస్తుంది. దుల్కర్ .. మీనాక్షి .. ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించిన నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. 

 బ్యాంక్ స్కామ్ కి సంబంధించిన నేపథ్యంతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, పాయింట్ అదే అయినా దాని వెనకున్న పర్పస్ వేరు .. ప్లే వేరు. ఇటు ఉద్యోగాన్ని .. అటు కుటుంబాన్ని టచ్ చేస్తూ ఈ కథ వెళుతుంది. యాక్షన్ జోలికి వెళ్లకుండా ఎమోషన్స్ వైపు నుంచి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. సుఖంగా బ్రతకడం కంటే ప్రశాంతంగా బ్రతకడంలోనే అసలైన ఆనందం ఉందని చాటిచెప్పే చిత్రం ఇది.

Movie Name: Lucky Bhaskar

Release Date: 2024-10-31
Cast: Dulquer Salmaan,Meenakshi Chaudhary, Ramki, Sachin Khedekar, Sai Kumar
Director: Venky Atluri
Producer: Suryadevara Naga Vamsi - Sai Soujanya
Music: G V Prakash Kumar
Banner: Sithara Entertainments Fortune Four Cinemas

Lucky Bhaskar Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews