'బ్రోచేవారెవరురా' మూవీ రివ్యూ

తండ్రి ప్రేమకి నోచుకోని 'మిత్ర' తనకి నచ్చినట్టుగా బతకాలనుకుంటుంది. అందుకు అవసరమైన డబ్బుకోసం కిడ్నాప్ డ్రామా ఆడిన రాహుల్ బృందం ఎలాంటి చిక్కుల్లో పడిందనే కథాకథనాలతో ఈ సినిమా సాగుతుంది. యూత్ తో పాటు మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఈ సినిమాలో బాగానే వున్నాయి.
తెలుగు తెరపై కిడ్నాపింగ్ కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. అలాగే మెగాఫోన్ పట్టాలనే ఉత్సాహంతో అడుగుముందుకేసిన కుర్రాళ్లు, ఆ ప్రయాణంలో ఎదుర్కునే పరిణామాలతో కూడిన కథలు కూడా తెలుగు తెరను పలకరించాయి. ఈ రెండు కథలకి ముడిపెడుతూ .. కావాల్సినంత కామెడీని దట్టిస్తూ దర్శకుడు వివేక్ ఆత్రేయ చేసిన ఒక సరికొత్త ప్రయోగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'బ్రోచేవారెవరురా'

కథలోకి తొగిచూస్తే .. మిత్ర (నివేదా థామస్) తల్లిదండ్రులు చాలాకాలం క్రితమే విడిపోతారు. అప్పటి నుంచి ఇంటర్ కి వచ్చేవరకూ ఆమె తల్లి దగ్గరే పెరుగుతుంది. తాను ఇంటర్ లోకి వచ్చాక తల్లి చనిపోవడంతో, తండ్రి అంటే ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఇంటికి వచ్చేస్తుంది. తండ్రి నుంచి ప్రేమ కరువవడంతో, కాలేజ్ లో తన క్లాస్ మేట్స్ అయిన శ్రీవిష్ణు(రాహుల్), ప్రియదర్శి (రాకేశ్), రాహుల్ రామకృష్ణ (రాంబాబు) టీమ్ తో ఆమె స్నేహం చేస్తుంది. ఒకానొక సందర్భంలో .. తన తండ్రి దగ్గర ఉండటం తనకి ఇష్టం లేదని మిత్ర చెప్పడంతో, ఆమెను వేరొక చోటికి పంపించేయాలని రాహుల్ బృందం భావిస్తుంది. 'భరతనాట్యం' విషయంలో ఆమె ఇష్టాన్ని గౌరవించి సహకరించాలని రాహుల్ బృందం నిర్ణయించుకుంటుంది.

మిత్ర ఇచ్చిన ఐడియా ప్రకారమే ఆమెది కిడ్నాప్ అని ఆమె తండ్రిని నమ్మించి హైదరాబాద్ కి పంపించేస్తారు. అయితే అక్కడే మిత్ర నిజమైన కిడ్నాపర్ల చేతిలో పడుతుంది. ఇక దర్శకుడు కావాలనే కోటి ఆశలతో, హీరోయిన్ షాలినీ (నివేదా పేతురాజ్)కి కథ వినిపిస్తాడు విశాల్ (సత్యదేవ్). షాలినీ వీలును బట్టి అంచలంచెలుగా ఆమెకి కథ వినిపిస్తూ వెళుతోన్న విశాల్, తల్లి నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ తో ఉలిక్కిపడతాడు. మిత్రకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? రాహుల్ బృందం ఎలాంటి చిక్కుల్లో పడుతుంది? దర్శకుడిని కావాలనే విశాల్ ఆశయం నెరవేరుతుందా? అనేవి తెరపైనే చూడాల్సిన ఘట్టాలు.

దర్శకుడు వివేక్ ఆత్రేయ కిడ్నాప్ సీన్ తోనే కథను ఎత్తుకున్నాడు. కిడ్నాప్ కి గురైంది ఎవరనే విషయాన్ని కొంత కథ జరిగిన తరువాత ఆయన రివీల్ చేసిన తీరు ఆసక్తికరంగా వుంది. ఈ మధ్యలో చోటుచేసుకునే సన్నివేశాలను ఆయన  కామెడీ టచ్ తో పరుగులు తీయించాడు. మిత్రను కిడ్నాప్ గ్యాంగ్ బారి నుంచి కాపాడటానికి కావలసిన పది లక్షలను ఎక్కడి నుంచైనా కాజేయడానికి రాహుల్ గ్యాంగ్ ప్లాన్ చేసిన దగ్గర నుంచి స్క్రీన్ ప్లేలో పట్టు పెంచుతూ వెళ్లాడు.

ఒక వైపున కిడ్నాపర్ల చెరలో మిత్ర .. ఆమెను కాపాడే ప్రయత్నంలో రాహుల్ బృందం .. వాళ్లను పట్టుకునేందుకు మిత్ర తండ్రి చేసే ప్రయత్నాలు, మరో వైపున రాహుల్ బృందాన్ని వెంటాడుతూ విశాల్.. ఇలా ఈ నాలుగు ట్రాకుల మధ్య వివేక్ ఆత్రేయ అల్లిన సన్నివేశాలు .. తిప్పిన మలుపులు ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే ఉంటాయి .. ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. 'అనగనగా ఒక రోజు' తరువాత మళ్లీ ఆ తరహా ఛేజింగ్ ను డిజైన్ చేయడంలో వివేక్ ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. డ్యూయెట్లు లేకపోయినా ఆ వెలితి తెలియకుండా ఆడియన్స్ ను సీట్లలో కూర్చోబెట్టిన ఘనత ఆయనదే. కథ .. కథనం .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. ముఖ్యమైన పాత్రలను తీర్చిదిద్దిన విషయంలో ఆయన ఎక్కువ క్రెడిట్ కొట్టేశాడు.

నటీనటుల విషయానికొస్తే .. రాహుల్ పాత్రలో ఆకతాయి కుర్రాడిగా శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. మార్కులు తక్కువొచ్చాయని తన పేపర్లను దాచేసి, మిత్ర మార్కులు చెప్పమని బెదిరించే క్లాస్ రూమ్ సీన్లో ఆయన పండించిన కామెడీ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. మిత్రను కిడ్నాప్ గ్యాంగ్ నుంచి విడిపించాల్సిన కీలకమైన సమయంలో ఫోన్ పోగొట్టుకుని టెన్షన్ పడే సీన్లోను ఆయన బాగా నటించాడు. ఇక నివేదా థామస్ ఇటు శ్రీవిష్ణు స్నేహితురాలిగా అల్లరి చేసింది .. అటు తల్లి ప్రేమకి దూరమై, తండ్రి ప్రేమకి నోచుకోని కూతురిలా ఎమోషన్స్ ను పండించింది. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ తమదైన శైలిలో కామెడీని కదను తొక్కించారు. సత్యదేవ్ .. ఆయనని ప్రేమించే హీరోయిన్ గా నివేదా పేతురాజ్ .. కిడ్నాపర్ గా అజయ్ ఘోష్ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక పిచ్చివాడి పాత్రలో బిత్తిరి సత్తి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

కథాపరంగా చూసుకుంటే ఈ సినిమాకి రీ రికార్డింగ్ ప్రాణం లాంటిది .. అది బాగా కుదిరింది. సాయిశ్రీరామ్ ఫొటో గ్రఫీ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఎడిటర్ గా రవితేజ గిరజాల పనితనం కారణంగా సన్నివేశాలన్నీ బిగి సడలకుండా పట్టుగా పరుగులు తీశాయి. కథా కథనాలే ప్రధాన బలంగా నడిచిన .. నవ్వించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే వుంది. 

Movie Name: Brochevarevarura

Release Date: 2019-06-28
Cast: Sri Vishnu, Niveda Thomas, Niveda Pethuraj, Sathya Dev, Rahul Ramakrishna
Director: Vivek Athreya
Producer: Vijay Kumar Manyam
Music: Vivek Sagar
Banner: Manyam Productions

Brochevarevarura Rating: 3.50 out of 5


More Movie Reviews