'స్వాగ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • ఈ నెల 4న విడుదలైన 'స్వాగ్'
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • శ్రీవిష్ణు పాత్రలు .. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువైపోవడం
  • ఫలితంగా ఏర్పడిన గందరగోళం 
  • ఆశించిన స్థాయిలో లేని కామెడీ

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమానే 'స్వాగ్'. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా రీతూ వర్మ నటించింది. ఈ నెల 4వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

శ్వాగణిక వంశస్థులు రాచరికాన్ని అనుభవిస్తూ వస్తారు. వారి కాలంలో అంతా ఆడవారి పెత్తనమే  నడుస్తుంది. అందువలన పాలనా అధికారం అంతా కూడా ఆడవారి కనుసన్నల్లోనే నడుస్తుంది. ఆ తరువాత జరిగిన కొన్ని అనూహ్య పరిణామాల వలన, ఆ వంశానికి చెందినవారు చెల్లాచెదురవుతారు. ఆ వంశంలో 'యయాతి' (శ్రీ విష్ణు) చివరివాడు. అందువలన ఆయన వారసులు వస్తే, వారి కోసం దాచిన 'నిధి'ని అప్పగించాలని విజయమ్మ (వడి ఉక్కరసి) .. మహర్షి ( గోపరాజు రమణ ఎదురుచూస్తూ ఉంటారు.  

ఆ వంశానికి చెందిన పురుషులు వస్తే, తన పెత్తనం చెల్లదని భావించిన మహర్షి, ఆ వంశానికి చెందిన స్త్రీలు వచ్చినా ఆ నిధిలో కొంత భాగం ఇచ్చేద్దామని విజయమ్మతో చెబుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న భవభూతి (శ్రీ విష్ణు)కి ఈ విషయం తెలుస్తుంది. 'యయాతి' పోలికలు తనకి ఉండటంతో, తానే వారసుడినని చెప్పి ఆ ఇంట్లో అడుగుపెడతాడు. అదే సమయంలో అనుభూతి (రీతూ వర్మ) అక్కడికి వస్తుంది. తన తల్లి రుక్మిణి ( రీతూ వర్మ) అదే వంశానికి చెందినదనీ, తానే వారసురాలినని వాదిస్తుంది. 

'యయాతి' వారసుల దగ్గర ఒక రాగి పలక ఉంటుందనీ, దానిని చూపించమని విజయమ్మ వాళ్లు భవభూతిని అడుగుతారు. తానే యయాతిలా ఉండగా .. రాగి పలక దేనికని అతను అడుగుతాడు. పోలిక ప్రధానమనుకుంటే, అతని వారసుడు కూడా అలాగే ఉండాలనీ .. ఒకవేళ అతని కొడుకు కూడా అదే పోలికతో ఉంటే ఖజానా అతనికే దక్కుతుందని విజయమ్మ - మహర్షి చెబుతారు. భార్యను కోల్పోయిన తనకి వారసుడు ఎక్కడ దొరుకుతాడనే ఆలోచనలో భవభూతి పడతాడు.

భవభూతి భార్య రేవతి ( మీరా జాస్మిన్). వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వారి కాపురం అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది. రేవతికి తరచూ గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. తన కడుపులో పెరుగుతున్నది ఆడపిల్లని తెలుసుకుని, తన భర్తనే తనని మోసం చేశాడనే విషయం ఆమెకి ఆలస్యంగా తెలుస్తుంది. మనసు ముక్కలైపోవడంతో అతని జీవితంలో నుంచి తప్పుకుంటుంది. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లోనే భవభూతి ఎక్కువగా ఉంటూ ఉంటాడు.  

అలా ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న తన కోసం వారసుడు ఎక్కడి నుంచి ఊడిపడతాడు? అనే ఒక నిరాశా వాదంలోకి అతను జారిపోతాడు. సరిగ్గా ఆ సమయంలోనే అచ్చు తన పోలికలతో ఉన్న 'సింగ' ( శ్రీ విష్ణు) ఎంట్రీ ఇస్తాడు. అతనిని చూసి భవభూతి ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో అచ్చు తన మాదిరిగానే ఉన్న 'విభూతి' (శ్రీవిష్ణు) కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాళ్లిద్దరూ ఎవరు? భవభూతి పోలికలతో ఎందుకున్నారు? చివరికి ఆ ఖజానా ఎవరికి దక్కుతుంది? అనేది కథ.

 బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. రాచరికం .. నిధి .. వారసులకు మాత్రమే దానిని అందజేయాలనే ఒక ప్రయత్నం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అటు ప్రాచీన కాలాన్ని టచ్ చేస్తూనే .. ఆధునిక కాలంలో ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. రాజవంశానికి చెందిన వారసులుగా ఐదు పాత్రలలో శ్రీవిష్ణు నటించాడు. రెండు కాలాలకి చెందిన రెండు పాత్రలలో రీతూ వర్మ కనిపిస్తుంది. నిధి చుట్టూ అల్లుకున్న ఈ కథ చుట్టూ కావాల్సినంత కామెడీని అల్లేసి ఉంటారని అనుకోవడం సహజం. కానీ అలా జరగకపోవడమే విచారకరం. 

శ్రీ విష్ణు ఐదు పాత్రలను పోషించాడు. ఐదు పాత్రలలోను ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడు. ఐదు పాత్రలను కూడా వైవిధ్యభరితంగా మలిచారు. గెటప్స్ తోనే కొంత కామెడీని వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ విషయంలోనూ కేర్ తీసుకున్నారు. ఈ పాత్రల సంఖ్య ఎక్కువైపోవడం .. తరచూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వస్తుండటం వలన సగటు ప్రేక్షకుడు అయోమయంలో పడతాడు. ఒక క్లారిటీకి వచ్చే ప్రయత్నంలో ఇబ్బంది పడతాడు. 

ఇక పురుషాధిక్యత .. స్త్రీ ఆధిపత్యానికి సంబంధించిన అంశాల వరకూ తీసుకుని ఉంటే నీట్ గా ఉండేది. ఈ రెండు గొడవల మధ్యలోకి 'ట్రాన్స్ జెండర్' అంశాన్ని తీసుకొచ్చారు. ఆ పాత్రను కూడా శ్రీ విష్ణునే పోషించాడు. ఈ పాత్ర వైపు నుంచి ఎమోషన్స్ వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ పాత్ర చిన్నప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ మొదలై చాలాదూరం ప్రయాణిస్తుంది. ఆ సమయంలో అసలు కథ పక్కకి పోతుంది. ఇది రొటీన్ ఫ్లాష్ బ్యాక్ కావడం అసహనాన్ని కలిగిస్తుంది.

వివేక్ సాగర్ నేపథ్య సంగీతం .. వేద రామన్ ఫొటోగ్రఫీ పరవాలేదు. విప్లవ్ నైషధం ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. అంతగా అవసరం లేని ఫ్లాష్ బ్యాక్ ల నిడివి కాస్త తగ్గిస్తే బాగుండేదని అనిపిస్తుంది. శ్రీ విష్ణు పాత్రలు ఎక్కువైపోవడం .. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువైపోవడం .. గెటప్స్ డిజైన్ చేయడంలో చూపినంత శ్రద్ధను కామెడీపై పెట్టకపోవడం .. కథను చెప్పడంలో క్లారిటీ లోపించిన  కారణంగా  ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.  

Movie Name: Swag

Release Date: 2024-10-25
Cast: Sree Vishnu, Ritu Varma, Meera Jasmine, Sunil, Daksha Nagarkar
Director: Hasith Goli
Producer: T G Vishwa Prasad
Music: Vivek Sagar
Banner: People Media Factory

Swag Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews