'లిటిల్ హార్ట్స్' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Little Hearts

Release Date: 2024-10-24
Cast: Shane Nigam, Mahima Nambiar, Baburaj, Shine Tom Chacko, Jaffer Idukki
Director: Anto Jose Pereira
Producer: Sandra Thomas
Music: Kailas Menon
Banner: Hnuman Media
Rating: 2.50 out of 5
  • మలయాళంలో రూపొందిన 'లిటిల్ హార్ట్స్'
  • జూన్ 7న విడుదలైన సినిమా 
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • మూడు పెళ్లిళ్ల చుట్టూ తిరిగే కథ 
  • ఓ మాదిరిగా అనిపించే కంటెంట్

మలయాళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాలలో 'లిటిల్ హార్ట్స్' ఒకటి.షేన్ నిగమ్ - మహిమ నంబియార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఆంటోజోస్ పెరీరా .. అబీ ట్రెసా పాల్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూన్లో థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కేరళలోని ఓ మారుమూల గ్రామీణ ప్రాంతం అది. అక్కడ శిబి (షేన్ నిగమ్) బేబీ (బాబూ రాజ్) అనే తండ్రీ కొడుకులు నివసిస్తూ ఉంటారు. తల్లి లేని తనని ఆ లోటు లేకుండా పెంచిన బేబీ అంటే, శిబికి ప్రాణం. ఇద్దరూ కూడా జాన్సన్ (రేంజి పణికర్) తోటకు సంబంధించిన పనులను చూసుకుంటూ ఉంటారు. జాన్సన్ కి ఒక కొడుకు .. కూతురు. వారి పేర్లే షరోన్ ( షైన్ టామ్ చాకో) శోషా ( మహిమ నంబియార్)

శిబి ఎక్కువగా జాన్సన్ ఇంట్లోనే పెరుగుతాడు. అందువలన ఆ ఇంట్లో ఒక సభ్యుడిగానే ఉంటూ ఉంటాడు. శిబి తండ్రి .. సిసిలీతో ప్రేమలో పడతాడు. ఆమెకి 16 ఏళ్ల కూతురు ఉంటుంది. ఆమెకి భర్త ఉంటాడు .. కానీ ఇంకా విడాకులు కాలేదు. అది వాళ్ల పెళ్లికి అడ్డుగోడగా నిలుస్తుంది. తన చెల్లెలి సిసిలీని మాయ చేశావంటూ ఆమె అన్నయ్య పాపన్ తరచూ బేబీతో గొడవపడుతూ ఉంటాడు. బేబీతో తన తల్లి సాన్నిహిత్యంగా ఉండటం సిసిలీ కూతురికి కూడా ఇష్టం ఉండదు. 

తన తండ్రి మనసు తెలుసుకున్న శిబి, సిసిలీతో అతని వివాహాన్ని జరిపించాలని అనుకుంటాడు. అదే సమయంలో శోషాకి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. అయితే ఆమె ఆ సంబంధాన్ని కావాలనే చెడగొడుతుంది. అందుకు కారణం ఏమిటని శిబి అడిగితే, అతని పట్ల తాను పెంచుకున్న ప్రేమనే అని చెబుతుంది. అతనిని తప్ప తానువేరెవరినీ పెళ్లి చేసుకోననీ, లండన్ నుంచి తన అన్నయ్య షరోన్ రాగానే తమ గురించి చెబుతానని అంటుంది. 

లండన్ నుంచి షరోన్ వస్తాడు. అతనితో పాటు అతని లండన్ మిత్రుడు కూడా వస్తాడు. తనతో పాటు వచ్చింది తన స్నేహితుడు కాదనీ, తన పార్ట్నర్ అని శిబితో షరోన్ చెబుతాడు. అతనినే తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని అంటాడు. ఇలాంటివి లండన్ లో జరుగుతూనే ఉంటాయనీ, ఈ విషయంలో తన తల్లిదండ్రులను ఒప్పించవలసిన బాధ్యత అతనిపైనే ఉందని చెబుతాడు.         

శిబి ఒక వైపున తన పెళ్లి విషయంలో శోషా కుటుంబ సభ్యులను ఒప్పించవలసి ఉంది.  మరో వైపున షరోన్ 'గే' అనే విషయంతో పాటు, అదే రూట్లో అతను చేసుకోనున్నపెళ్లికి అతని పేరెంట్స్ ను ఒప్పించవలసి వస్తుంది. తన తండ్రి పెళ్లిని సిసిలీతో జరిపించడానికి ఆమె కూతురును .. ఆమె అన్నయ్యను ఒప్పించడమే కష్టమని అనుకుంటూ ఉంటే, ఆమె భర్త జోయ్ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు శిబి ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.

ఇది మూడు కుటుంబాల కథ .. మూడు పెళ్లిళ్ల కథ. దర్శకుడు గ్రామీణ నేపథ్యంలో కథను .. పరిమితమైన పాత్రలతో కూడిన కథను సెట్ చేసుకున్న తీరు బాగుంది. ప్రతి పాత్రకు ఒక ప్రయోజనం ఉంది. ఆ పాత్రలను నడిపించే విషయంలో పూర్తి క్లారిటీ కనిపిస్తుంది. అందువలన కథ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నా బోర్ అనిపించదు. సున్నితమైన రొమాన్స్ ను .. కామెడీని టచ్ చేస్తూ ఈ కథ నడుస్తూ ఉంటుంది.
 
తెరపై అనవసరమైన పాత్రలు గానీ .. సన్నివేశాలు గాని కనిపించవు. పడిపడి నవ్వుకునేంత సన్నివేశాలు కూడా ఏమీ లేవు. కాకపోతే కాస్త సరదాగా .. సందడిగా సాగిపోతూ ఉంటుంది అంతే. మూడు పెళ్లిళ్లకు సంబంధించిన చిక్కుముడులను ఎలా విప్పాలనే ఒక డైలమాలో హీరో పడిపోవడం .. ఆ విషయంలో అతను పడిన పాట్లు కాస్త ఎంటర్టైన్ చేస్తాయి అంతే. 

ఈ సినిమాకి లొకేషన్స్ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పుకోవాలి. కైలాస్ మీనన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ కూడా ఓకే. ఇది సింపుల్ కంటెంట్ తో కూడిన  ఓ మాదిరి కథ. అనూహ్యమైన సన్నివేశాలు గానీ .. ట్విస్టులుగాని ఏమీ ఉండవు. ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలుగానీ .. డైలాగ్స్ గాని కనిపించవు. ఫ్యామిలీతో కలిసి సరదాగా కాసేపు చూడొచ్చు అంతే.

Trailer

More Movie Reviews