'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' మూవీ రివ్యూ

ఒక వైపున షార్ట్ ఫిల్మ్స్ లో నటించే ముగ్గురు స్నేహితులు .. మరో వైపున డ్రగ్స్ ను అక్రమంగా తరలించే మాఫియా ముఠా .. వాళ్ల రహస్యాలకి సంబంధించిన ఆధారాలతో తప్పించుకు తిరిగే యువతి .. ఆ ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసుల చుట్టూ తిరిగే కథ ఇది. కసరత్తు చేయని కథతో .. పై పై అల్లేసిన కథనంతో చుట్టేసిన ఈ సినిమా అలరించడం సంగతి అటుంచితే, గందరగోళానికి గురిచేయడంలోనే సక్సెస్ అయింది.
కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి ఒక్కో మెట్టూ పైకెక్కుతూ, ప్రధానమైన పాత్రలతో పాటు, కామెడీ హీరోగాను చేసే స్థాయికి చేరుకున్నాడు. మంచి టైమింగుతో నవ్వించే శ్రీనివాస రెడ్డి, దర్శక నిర్మాతగా ఈ సారి ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం పేరే .. 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'. తన తోటి హాస్య నటుల సహకారంతో ఆయన చేసిన ఈ సాహసం ఏ స్థాయిలో ఫలించిందో, దర్శక నిర్మాతగా ఆయనకి ఎన్నేసి మార్కులు తెచ్చిపెట్టిందో ఇప్పుడు చూద్దాం.

శ్రీను (శ్రీనివాస రెడ్డి) అతని స్నేహితులు షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తుంటారు. చాలీచాలని డబ్బులతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో శ్రీను కొన్న భూటాన్ లాటరీ టికెట్ కి 2 కోట్లు తగులుతాయి. అదే సమయంలో ఆ లాటరీ టికెట్ మిస్సవుతుంది. దాంతో దాని కోసం వాళ్ల ముగ్గురూ గాలించడం మొదలుపెడతారు. ఇక డ్రగ్స్ ను అక్రమంగా తరలించే కోబ్రా('చిత్రం' శ్రీను) తమ ఆధారాలు సంపాదించిన ప్రియాంక కోసం తన మనుషులతో వెతికిస్తుంటాడు. మాఫియా ముఠాను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ స్వతంత్ర (వెన్నెల కిషోర్) రంగంలోకి దిగుతాడు. వీళ్లందరి మధ్య జరిగే దాగుడుమూతల ఆట మాదిరిగా మిగతా కథ నడుస్తుంది.

కమెడియన్ గా ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి, తొలిసారి దర్శకనిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ఇది. చిత్రపరిశ్రమలో నటుడిగా సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తున్న కారణంగా, శ్రీనివాస రెడ్డి ఒక మంచి కథనే ఎంపిక చేసుకుని ఉంటాడని చాలామంది అనుకుంటారు. కథనంపై గల అవగాహనతో  హాస్యాన్ని పరుగులు తీయించి ఉంటాడని భావిస్తారు. కానీ ఈ విషయంలో శ్రీనివాస రెడ్డి అందరి అంచనాలను తలక్రిందులు చేశాడనే చెప్పాలి.

కథను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? .. ఎలా చెప్పాలి? .. ఎలా ముగించాలి? అనే విషయంలో శ్రీనివాస రెడ్డి  చాలా తడబడ్డాడు. పాత్రల పేర్లను రిజిస్టర్ చేయించలేనంత స్థాయిలో ఆయన విఫలమయ్యాడు. ఏ పాత్రకి కుటుంబ నేపథ్యం లేకుండా .. ప్రతి పాత్రను ఒంటరిగా పరిచయం చేస్తూ, లేని కథలో నుంచి కామెడీని పిండటానికి ప్రయత్నించాడు. శ్రీనివాస రెడ్డి కథపై శ్రద్ధ పెట్టలేదనీ .. కథనంపై దృష్టి పెట్టలేదనే విషయం, సినిమా మొదలైన కొద్ది సేపటికే అర్థమైపోతుంది. ఇంతకాలం ఫీల్డ్ లో వుండి శ్రీనివాస రెడ్డి ఎంచుకున్న కథ ఇదా? అనే ఆశ్చర్యం కలగక మానదు.

'బతుకు ఎడ్ల బండి'.. 'రసగుల్లా' ఎపిసోడ్స్ ఆరంభంలో ఫరవాలేదనిపించినా, ఆ తరువాత శ్రుతి మించడంతో వెగటు పుడుతుంది. హీరోయిన్ గానీ .. పాటలుగానీ లేకుండా చేసిన ప్రయోగం వలన విసుగు పుడుతుంది. సంగీతం .. రీ రికార్డింగ్ .. ఎడిటింగ్ ఇవేవి ఈ కథను ఒక సినిమా స్థాయిలో నిలబెట్టలేకపోయాయి. శ్రీనివాస రెడ్డి .. వెన్నెల కిషోర్ .. షకలక శంకర్ .. రఘుబాబు .. సత్యం రాజేశ్ .. సత్య .. ఇలా ఈ సినిమాలో కావాల్సినంతమంది కమెడియన్లు వున్నారు .. లేనిదల్లా కామెడీనే. హాస్యం పేరుతో వాళ్లు చేసిందంతా గందరగోళంగా కనిపిస్తుంది .. అయోమయంగా అనిపిస్తుంది. కన్ఫ్యూజన్లో నుంచి కామెడీని రాబట్టడానికి శ్రీనివాస రెడ్డి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నంలో కామెడీ వికటించడంతో కన్ఫ్యూజన్ మాత్రమే మిగిలిపోయింది.      
 

Movie Name: Bhagyanagara Veedhullo Gammathu

Release Date: 2019-12-06
Cast: Srinivasa Reddy, Vennela Kishore, Raghu Babu, Shakalaka Shankar, Sathyam Rajesh, Sathya, Chithram Srinu, Praveen 
Director: Y. Srinivasa Reddy 
Producer: Y. Srinivasa Reddy 
Music: Saketh Komanduri 
Banner: Flying Colours Entertainments

Bhagyanagara Veedhullo Gammathu Rating: 1.50 out of 5


More Movie Reviews