'బాలుగాని టాకీస్'(ఆహా)మూవీ రివ్యూ!

Movie Name: Balu Gaani Talkies

Release Date: 2024-10-04
Cast: Shivaram, Sharanya Sharma, Raghu Kunche, Mime Madhu, Sudhakar Redy
Director: Vishwanathan Prathap
Producer: Srinidhi Sagar
Music: Smaran
Banner: Rise East Entertainment
Rating: 2.00 out of 5
  • శివరామ్ హీరోగా రూపొందిన సినిమా 
  • విలేజ్ నేపథ్యంలో సాగే కంటెంట్ 
  • కథాకథనాలపై జరగని కసరత్తు 
  • దారితప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ 
  • సాదాసీదాగా అనిపించే కథ ఇది  
 

'ఆహా' నుంచి ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఆ సినిమా పేరే 'బాలుగాని టాకీస్'. శివకుమార్ హీరోగా నటించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన నేరుగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. కొన్ని రోజులుగా 'ఆహా'వారు ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అది రాయలసీమ ప్రాంతంలోని 'చండ్రపల్లి' గ్రామం. అక్కడే మన కథానాయకుడు బాలరాజు (శివరామ్) తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. తండ్రి చనిపోయిన తరువాత బాబాయ్ (రఘు కుంచె)తో గొడవలు వస్తాయి. బాలరాజు తండ్రి చనిపోవడానికి కారకుడు కూడా అతని తమ్ముడే అనే టాక్ కూడా ఊళ్లో ఉంటుంది. బాలు పేరుమీద ఆ ఊళ్లో ఒక సినిమా థియేటర్ మాత్రమే ఉంటుంది. దానిని కూడా నొక్కేయడానికి అతని బాబాయ్ ట్రై చేస్తూ ఉంటాడు.

బాలు దగ్గర డబ్బు లేకపోవడం వలన ఊళ్లో అప్పులు చేస్తూ ఉంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు వేస్తుంటాడు. ఈ కారణంగా అతనికి పిల్లను ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. తన తండ్రికి ప్రాణప్రదమైన ఆ థియేటర్ ను వదులుకోకూడదని బాలు అనుకుంటాడు. ఒక్క పెద్ద సినిమా వేస్తే, తన అప్పులు తీరిపోతాయని భావిస్తాడు. అలా జరిగితే తన తండ్రిపేరు నిలబెట్టినట్టు అవుతుందని అనుకుంటాడు. 

అదే సమయంలో 'సింహా' సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాను తన థియేటర్ కు తీసుకుని రావాలంటే 10 లక్షలు అవసరమవుతాయి. దాంతో నేరుగా తన బాబాయ్ దగ్గరికి వెళ్లి డబ్బు అడుగుతాడు. థియేటర్ కాగితాలు తనఖా పెట్టి డబ్బు తీసుకుని వెళ్లమని అతని బాబాయ్ అంటాడు. అలాగే డబ్బు తీసుకుని ఆ సినిమా తన థియేటర్ కి వచ్చేలా బాలు చేస్తాడు. తెల్లవారితే తన థియేటర్లో షోలు మొదలవుతాయి.

ఆ సినిమా బాగా ఆడితే, శశితో తన పెళ్లి జరిగే అవకాశం ఉండటం బాలుకి ఆనందాన్ని కలిగిస్తుంది. అడల్ట్ సినిమాలతో తనకి వచ్చిన చెడ్డపేరు పోతుంది అనే ఉద్దేశంతో బాలు ఉంటాడు. అయితే ఆ రాత్రి ఓ వృద్ధుడు సినిమా చూస్తూ థియేటర్లో చనిపోతాడు. ఆ వృద్ధుడికి వెనకా ముందు ఎవరూ ఉండరు. కాకపోతే ఆ ఊళ్లో అందరికీ తలలో నాలుకలాంటివాడు. అలాంటివాడు థియేటర్లో చనిపోతే సినిమాకి ఎవరూ రారని బాలు కంగారు పడతాడు. ఆ వృద్ధుడి శవాన్ని ఒక బస్తాలో పెట్టి మూటగడతాడు. థియేటర్ నుంచి బయటికి తరలించాలని చూస్తాడు. అయితే ఈ లోగానే ఆ శవం మాయమవుతుంది. 

ఒక వైపున బాలు థియేటర్లో సినిమా జోరుగా నడుస్తూ ఉంటుంది. మరో వైపున అతను ఆ వృద్ధుడి శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించడం తాను చూశానంటూ సువర్ణ అనే యువతి బాలూను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. ఈ కేసులో అనుమానంతో అతని చుట్టూనే తిరుగుతూ భయపెడుతుంటాడు పోలీస్ ఆఫీసర్. బాలు ధోరణి శశికి కూడా సందేహాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి విడుదలైన ఆ వృద్ధుడి మనవడు ఊరుకి తిరిగొస్తాడు. 

అతని రాకతో ఏం జరుగుతుంది? ఆ వృద్ధుడిని ఎవరు చంపుతారు? అందుకు గల కారణం ఏమిటి? అతని శవాన్ని మాయం చేసింది ఎవరు? బాలు తన తండ్రి పేరును నిలబెడతాడా? శశితో అతని పెళ్లి జరుగుతుందా? అనేది మిగతా కథ. 

  ఈ కథ ఎలాంటి హడావిడి లేకుండా చాలా నిదానంగా మొదలవుతుంది. థియేటర్లో వృద్ధుడు చనిపోయేవరకూ కథలో వేగం కనిపించదు. థియేటర్లో వృద్ధుడు చనిపోయిన తరువాతనే కథ పుంజుకుంటుంది. ఒక వైపున విలన్ .. పోలీస్ ఆఫీసర్ .. వృద్ధుడి మనవడు, మరో వైపున తనని బ్లాక్ మెయిల్ చేసే యువతి .. తాను పెళ్లాడబోయే శశి మధ్యలో హీరో నలిగిపోయే పరిస్థితి ఆడియన్స్ లో ఆసక్తికి పెంచుతుంది. 

అయితే ఈ ముడిని దర్శకుడు ఎక్కువసేపు ఉంచలేదు. చాలా తేలికగా విప్పేస్తూ ఆ తరువాత సన్నివేశాలను పరిగెత్తించాడు. చకచకా ట్విస్టులు రివీల్ చేస్తూ వెళ్లిపోయాడు. ఆ సన్నివేశాలు తేలికగా ఉండటంతో తేలిపోయినట్టుగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవచ్చు.

ప్రతినాయకుడిగా రఘు కుంచె పాత్రను .. పోలీస్ ఆఫీసర్ పాత్రను .. శశి పాత్రను .. వృద్ధుడి మనవాడి పాత్రను ఇంకాస్త బెటర్ గా మలిచినట్టు అయితే బాగుండేదని అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ వంటి అంశాలు ఎక్కడా కనిపించవు. టైటిల్ ను బట్టి, కామెడీ ఉంటుందనే అనిపిస్తుంది. కామెడీ వైపు నుంచి చేసిన ప్రయత్నం ఫలించలేదనే చెప్పాలి.  గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింటుపై సరైన కసరత్తు చేయకపోవడం వలన ఇది ఒక సాదా సీదా సినిమాగా మిగిలిపోయిందని చెప్పాలి. 

Trailer

More Movie Reviews