'వాజా' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • ఆగస్టులో థియేటర్లకు వచ్చిన 'వాజా'
  • పెద్ద విజయాన్ని సాధించిన చిన్న సినిమా 
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్
  • యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన దర్శకుడు 
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చే కంటెంట్

ఓటీటీలు పుంజుకున్న తరువాత ఎక్కువ మేలు జరిగిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే, అది మలయాళ ఇండస్ట్రీనే అని చెప్పాలి. చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రయోగాలు చేయడంలో .. సాహసాలు చేయడంలో .. విజయాలను సాధించడంలో మలయాళ ఇండస్ట్రీ ముందుంది. ఈ విషయాన్ని నిరూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమానే 'వాజా'. 'బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్' అనేది ట్యాగ్ లైన్. ఆగస్టులో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

విష్ణు (అమిత్ మోహన్) అజూ థామస్ ( సిజూ సన్నీ) మూసా (జోమోన్) ఈ ముగ్గురూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వాళ్లు కాలేజ్ స్థాయికి దగ్గరవుతూ ఉండగా, కలామ్ (అనురాజ్) వివేక్ ఆనంద్ (అన్షిద్)తో పరిచయమవుతుంది. అప్పటి నుంచి ఐదుగురు ఒక జట్టు అవుతారు. అందరూ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారే. అయినా ఎలాంటి బరువు బాధ్యతలు పట్టకుండా జీవితాన్ని చాలా సరదాగా గడిపేస్తూ ఉంటారు. 

ఈ ఐదుగురు ఒకే కాలేజ్ లో చేరితే చదవరని భావించిన పేరెంట్స్, వేరు వేరు కాలేజ్ లలో తమ పిల్లలను చేర్పించాలని భావిస్తారు. అయితే విష్ణు ఏ కాలేజ్ లో చేరాడో తెలుసుకుని మిగతా వాళ్లంతా కలిసి అదే కాలేజ్ లో చేరిపోవడంతో పేరెంట్స్ షాక్ అవుతారు. కాలేజ్ లో చేరిన రోజునే తమ తోటి స్టూడెంట్స్ ను మాత్రమే కాకుండా, లెక్చరర్ ను సైతం కొట్టేసి రెబల్స్ అనే బిరుదును సొంతం చేసుకుంటారు. 

'మాయ' అనే యువతితో అజూ, 'రీతూ' అనే యువతితో విష్ణు లవ్ లో పడతారు. అయితే ప్రేమ విషయంలో చేదు అనుభవాలే ఎదురైనా, ప్రేమ కంటే స్నేహమే గొప్పదనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటారు. ఈ ఐదుగురి పేరెంట్స్ కి కూడా, కాలేజ్ నుంచి కబురు వస్తే వెళ్లి ప్రిన్స్ పాల్ ను రిక్వెస్ట్ చేసుకోవడం, పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వస్తే వెళ్లి బ్రతిమాలు కోవడం ఒక పనిగా మారిపోతుంది. 

అలాంటి పరిస్థితుల్లోనే ఈ ఐదుగురు స్నేహితులు డ్రగ్స్ కేసులో పోలీస్ స్టేషన్ కి వెళతారు. తమ పిల్లలు తమని ఆ స్థాయి వరకూ తీసుకుని రావడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతారు. ఇక వాళ్లు తనని క్షమించరని భావించిన విష్ణు, తమ ఇంటిపై నుంచి దూకేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటన మిగతావారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?. పేరెంట్స్ కలను వాళ్లు నిజం చేయగలుగుతారా? అనేది మిగతా కథ.         

విపిన్ దాస్ అల్లిన ఈ కథకు దృశ్యరూపాన్ని ఇచ్చిన దర్శకుడు ఆనంద్ మీనన్. కాలేజ్ ఏజ్ .. క్యాంపస్ హుషారు .. ప్రేమలు .. అల్లర్లు .. గొడవలు .. పేరెంట్స్ మాట వినకపోవడం .. బలాదూర్ తిరిగేయడం .. ఇలాంటి అంశాలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయినా ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి ఒక కారణం ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ వైపు నుంచి కూడా కథ చెప్పడం, వాళ్ల ఎమోషన్స్ ను టచ్ చేయడమే కారణమని చెప్పచ్చు.  

 సాధారణంగా కాలేజ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేసే సమయమని చాలామంది అనుకుంటారు. కాలేజ్ క్యాంపస్ అంటే ఆటలు .. గొడవలకు వేదికగా భావిస్తారు. చదువును చివరికి నెట్టేసి మిగతా వాటికి ప్రాధాన్యతనిస్తారు. కానీ జీవితమనే యుద్ధరంగంలోకి అడుగుపెట్టడానికి అవసరమైన శిక్షణను పొందే ప్రదేశమే కాలేజ్ అనే విషయం గుర్తుకు రాదు. అలాంటప్పుడు అటు స్టూడెంట్స్ .. ఇటు పేరెంట్స్ ఎంతగా స్ట్రగుల్ అవుతారనేది ఆవిష్కరించే కథనే ఇది.

దర్శకుడు ఈ కథను చాలా సహజంగా .. సరదాగా నడిపిస్తూ వెళ్లి, చివరి 40 నిమిషాల్లో ఇచ్చిన ఎమోషనల్ టచ్ కళ్లను తడిచేస్తుంది. ఎదిగిన పిల్లల కోసం మరోసారి యుద్ధం చేయడానికి వయసుమళ్లిన తల్లిదండ్రులు సిద్ధపడటం ఉద్వేగానికి గురిచేస్తుంది. ముందుగా నడిచే మూడొంతుల కథ ఒక ఎత్తయితే, చివరి 40 నిమిషాలు ఒక ఎత్తు. దర్శకుడు కథపై పట్టుతో .. పూర్తి అవగాహనతో కథను మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. అరవింద్ కెమెరా పనితనం .. రజత్ ప్రకాశ్ నేపథ్య సంగీతం .. కణ్ణన్ మోహన్ ఎడిటింగ్ కథకి తగిన స్థాయిలోనే కనిపిస్తాయి. స్నేహమంటే ఒకరికోసం ఒకరు ఆవేశపడటం కాదు. అందరూ కలిసి ఒక బలమైన ఆశయాన్ని పట్టుకుని పట్టుదలతో ముందుకు వెళ్లడం, కన్నవాళ్ల కళ్లలో సంతోషాన్ని చూడటం అనే సందేశం ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది.

Movie Name: Vaazha

Release Date: 2024-09-23
Cast: Siju Sunny, Joemon Jtothir, Amith Mohan, Saaf Boi, Anuraj, Anshid, Basil Joseph
Director: Anand Menen
Producer: Vipin Das
Music: Rajath Prakash
Banner: WBTS Productions

Vaazha Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews