'బెంచ్ లైఫ్' (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • నిహారిక కొణిదెల నుంచి 'బెంచ్ లైఫ్'
  • సాఫ్ట్ వేర్ లైఫ్ స్టైల్ నేపథ్యంలో సాగే కథ 
  • కథ .. కథనం ప్రధానమైన బలం 
  • సరదాగా .. ఎమోషనల్ గా సాగే సిరీస్ 
  • యూత్ కీ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్  

నిహారిక కొణిదెలకి ముందుచూపు ఎక్కువేనని చెప్పాలి. తన కెరియర్ తొలినాళ్లలోనే వెబ్ సిరీస్ లను చేయడమే అందుకు నిదర్శనం. అప్పటి నుంచి కంటెంట్ ఉన్న కథలకు నిర్మాతగా ఆమె  వ్యవహరిస్తూనే వచ్చింది. యూత్ కి కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్ లను ఒక నిర్మాతగా అందిస్తూనే ఉంది. అలాంటి నిహారిక తన బ్యానర్ నుంచి వదిలిన మరో వెబ్ సిరీస్ గా 'బెంచ్ లైఫ్' కనిపిస్తుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 5 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

బాలు (వైభవ్) మీనాక్షి (రితికా సింగ్) రవి (చరణ్ పేరి) ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తూ ఉంటారు. ఈ ముగ్గురూ మంచి స్నేహితులు. అయితే ముగ్గురూ కూడా 'బెంచ్' మీద ఉంటారు. ఇటు శాలరీ వస్తుంది .. అటు పని ఒత్తిడీ ఉండదు గనుక, బెంచ్ పై లైఫ్ హ్యాపీగా ఉంటుందనేది బాలు అభిప్రాయం. అదే ఆఫీసులో బాలుకంటే పై స్థాయిలో 'ఈషా' ( ఆకాంక్ష సింగ్) పనిచేస్తూ ఉంటుంది. బాలు ఆమెను మౌనంగా ఆరాధిస్తూ ఉంటాడు. ఆమె కంట్లో పడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 

ఇక మీనాక్షి విషయానికి వస్తే, బెంచ్ లో ఉన్నప్పుడే ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని సినిమా చేసేయాలనేది ఆమె ఆశ. అందుకోసం ఆమె తన పాట్లు తను పడుతూ ఉంటుంది. అయితే ఇది ఎంతమాత్రం ఆమె తల్లి (తులసి)కి ఇష్టం ఉండదు. సినిమా డైరెక్షన్ ఆలోచనలు మానేసి, బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని పోరుతూ ఉంటుంది. అంతేకాదు సాధ్యమైనంత త్వరగా మీనాక్షికి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.     

ఇక రవి విషయానికి వస్తే, అతనికి గాయత్రి (నయన్ సారిక)తో పెళ్లి అవుతుంది. ఆమె చూపించే ప్రేమ తనని ఇబ్బందిపెడుతున్నట్టుగా రవి భావిస్తూ ఉంటాడు. తను బెంచ్ పై ఉన్నప్పటికీ, ఇంటి దగ్గర పనులు తప్పించుకోవడం కోసం ఆఫీసుకి వెళుతుంటాడు. భార్యకి దూరంగా ఏ 'గోవా'నో వెళ్లిపోయి, ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేయాలనేది అతని కోరిక. సోషల్ మీడియాతో టచ్ లేకపోవడం వలన, అతను చెప్పిన మాటలను గాయత్రి నమ్మేస్తూ ఉంటుంది.

 ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ ఆఫీసులో ప్రసాద్ ( రాజేంద్ర ప్రసాద్) చేరతాడు. అతను ఈషాకు తండ్రి. అక్కడ అతను చేరడం ఈషాకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు. కూతురును కలుసుకుని మాట్లాడడానికి అతను ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంటుంది. అతను ఈషా తండ్రి అనే విషయం బాలుకి తెలియదు. దాంతో ఈషా గురించిన విషయాలను అతను ప్రసాద్ తో పంచుకుంటూ ఉంటాడు. 

అప్పుడు ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఈషా అతనితో ఎందుకు మాట్లాడటం లేదు? బాలు ప్రేమను ఆమె అర్థం చేసుకుంటుందా? దర్శకురాలు కావాలనే మీనాక్షి కోరిక నెరవేరుతుందా? తన భర్త తనతో అన్నీ అబద్ధాలే చెబుతున్నాడని తెలుసుకున్న గాయత్రి ఏం చేస్తుంది? అనేది మిగతా కథ.

సాఫ్ట్ వేర్ లైఫ్ స్టైల్ .. అక్కడి వాతావరణం .. వాళ్ల ఆలోచనా విధానం .. ఉద్యోగ భయం .. కొంతమంది లైఫ్ ను చాలా తేలికగా తీసుకుంటే, మరికొంతమంది మరింత భారం చేసుకోవడం వంటి అంశాలను కలుపుకుంటూ దర్శకుడు ఈ కథను రెడీ చేసుకున్న తీరు బాగుంది. సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అయితే ఈ పాత్రలన్నింటి వైపు నుంచి ఎమోషన్స్ ను టచ్ చేస్తూ వెళ్లే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. 

తండ్రీకూతుళ్లు .. తల్లీకూతుళ్లు .. భార్యాభర్తలు .. ప్రేమికులు .. ఇలా నాలుగు వైపుల నుంచి ఎమోషన్స్ తో కూడిన కథను అల్లుకొచ్చిన విధానం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. సరదాగా సాగుతూ .. హాయిగా నవ్విస్తూ .. అక్కడక్కడా మనసును భారం చేస్తూ ముందుకు వెళ్లే ఈ కథ, సాఫ్ట్ వేర్ లైఫ్ స్టైల్ తెలిసిన యూత్ ను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా తప్పకుండా ఆకట్టుకుంటుంది.

 దర్శకుడు ప్రతి పాత్రను మలచిన తీరు .. నీట్ గా స్క్రీన్ ప్లే చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు  కథకి తగినట్టుగా ఉన్నాయి. ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. రాజేంద్రప్రసాద్ .. తనికెళ్ల భరణి .. తులసి పాత్రలు ఈ సిరీస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ వైపుకు తీసుకెళతాయి. ధనుష్ బాషా ఫొటోగ్రఫీ .. దండి సంగీతం .. పవన్ పూడి ఎడిటింగ్ బాగున్నాయి.  

ఆడపిల్ల చుట్టూ అతిగా పరిధులు గీయకూడదు .. అత్తవారింటికి వెళ్లడమే ఆమె జీవిత ధ్యేయం అనుకోకూడదు. భార్య చూపించే అనురాగాన్ని అడ్డుగోడగా భావించకూడదు. ఒక యువకుడిని పెళ్లి చేసుకోవాలంటే అతను తమకంటే పై స్థాయిలో .. నలుగురూ గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఉండాలని అమ్మాయిలు భావిస్తుంటారు. అవేవీ లేకపోయినా ప్రేమ పంచడం .. బాధ్యతగా ఉండటం తెలిస్తే చాలు .. నచ్చిన పని చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది అనే ఒక సందేశాలను వినోదంతో పాటు కలిపి అందించిన తీరు ఆకట్టుకుంటుంది. 

Movie Name: Bench Life

Release Date: 2024-09-12
Cast: Vaibhav Reddy, Rithika Singh, Aakanksha Singh, Nayan Sarika, Rajendra Prasad, Tulasi
Director: Manasa Sharma
Producer: Niharika Konidela
Music: P K Dandi
Banner: Pink Elephant Pictures

Bench Life Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews