'రాజావారు రాణిగారు' మూవీ రివ్యూ
రాణిపట్ల తన మనసులోని ప్రేమను బయటపెట్టలేక రాజా మౌనంగా ఆరాధిస్తూ ఉంటాడు. కాలేజ్ చదువు కోసం ఊరెళ్లిన రాణి తిరిగిరాగానే ఆమెను ప్రేమిస్తున్నట్టుగా చెప్పాలనుకుంటాడు. ఈ లోగా రాణి తండ్రి ఆమెను తన మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అప్పుడు రాజా ఏం చేస్తాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేదే కథ. పస లేని కథ ..పట్టులేని కథనంతో ఈ పల్లెటూరి ప్రేమకథ ఆకట్టుకోలేకపోయింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథలను చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని కనబరుస్తుంటారు. పల్లెటూరి పచ్చదనం .. అక్కడి మనుషుల్లోని ఆప్యాయత .. స్వచ్ఛమైన పలకరింపుల నేపథ్యంలో ప్రేమకథలు నడుస్తూ ఉంటాయి గనుక అంతగా ఆదరిస్తుంటారు. ఈ తరహా కథలు మనసుకు లంగరు వేసి జ్ఞాపకాల తీరాలకి లాక్కెళుతూ ఉంటాయి. అలాంటి వాతావరణంలో రూపొందిన ఈ సినిమా ఏ స్థాయిలో అలరించిందో .. ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
అదో అందమైన పల్లెటూరు .. పేరు 'రామాపురం'. ఆ ఊళ్లో ఆర్.ఎం.పి. డాక్టర్ కొడుకు రాజా(కిరణ్).. రేషన్ డీలర్ కూతురు రాణి (రహస్య). ఒకే ఊరు కావడం వలన .. ఒకే స్కూల్లో చదవడం వలన ఇద్దరి మధ్య చనువు ఏర్పడుతుంది. స్కూల్ ఫైనల్ పూర్తయినా, రాణి పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేయడానికి రాజా ధైర్యం చేయలేకపోతాడు. రాణి కాలేజ్ చదువు కోసం ఆమె తండ్రి అమ్మమ్మగారి ఊరుకి పంపిస్తాడు. రాణి ఏ ఊరు వెళ్లిందో .. ఏ కాలేజ్ లో చేరిందో తెలియక, ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రాజా. అతని బాధ చూడలేక స్నేహితులైన చౌదరి .. నాయుడు కలిసి రాణి ఆ ఊరు వచ్చేలా చేస్తారు. రాణిని ప్రేమిస్తున్నట్టుగా చెప్పమని రాజాని ఒత్తిడి చేస్తారు. అదే సమయంలో రాణి బావ ఊరు నుంచి రావడం .. అతనితో రాణి పెళ్లి జరిపించాలని ఆమె తండ్రి నిర్ణయించుకోవడం జరిగిపోతాయి. అప్పుడు రాజా ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.
దర్శకుడు రవికిరణ్ కోలా తొలి ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందించాడు. పల్లెటూరి ప్రేమకథను తెరపై స్వచ్ఛంగా ఆవిష్కరించడానికీ .. సన్నివేశాలకి సహజత్వాన్ని ఆపాదించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. చాలా తక్కువ పాత్రలతో కథను నడిపించే సాహసం చేశాడు. అయితే ఈ విషయాల్లో ఆయన కొంతవరకే సక్సెస్ అయ్యాడు. మలుపులు లేని కథ .. మనసును పట్టుకోని కథనంతో ప్రతి సన్నివేశాన్ని సాగదీస్తూ వెళ్లాడు.
ప్రేమకథ అనగానే ప్రేమికులు ఇద్దరూ గువ్వల్లా రివ్వున ఎగురుతూ ఉండాలనీ, పాటలు పాడుకుంటూ పరుగులు తీయాలని యూత్ కోరుకుంటుంది. ఎడబాటే అయినా .. విరహమే అయినా కొంతసేపు మాత్రమే వుండాలని వాళ్లు భావిస్తారు. ఆ వెంటనే కలుసుకోవడంలోని ఆనందాన్ని అనుభవించడానికి ఇష్టపడతారు. కానీ కథ ఆరంభంలో కనిపించే హీరోయిన్, విశ్రాంతి వరకూ అడ్రెస్ వుండదు. హీరోగారు ఆ ఊరు దాటకుండా హీరోయిన్ ఎక్కడుందో కనుక్కునేందుకు చేసే ప్రయత్నాలతోనే ప్రేక్షకులు కాలక్షేపం చేయవలసి ఉంటుంది. దర్శకుడు ఇక్కడే పొరపాటు చేశాడు .. హీరోగారి అనుభూతిని ఆవిష్కరించడంలో కాలయాపన చేశాడు.
రాజా పాత్రలో కిరణ్ .. రాణి పాత్రలో రహస్య పాత్ర పరిధిలో నటించారు. ఈ ప్రేమకథకు ఈ ఇద్దరి ఎంపిక కుదరలేదనే అనిపిస్తుంది. హీరో స్నేహితులుగా రాజ్ కుమార్ - యజుర్వేద్ నటన ఫరవాలేదు.
సంగీతం పరంగా చూసుకుంటే జె. క్రిష్ సమకూర్చిన బాణీలలో, 'నీవే నేనై సాగే ..' అనే పాట బాగుంది. ఒకటి రెండు పాటలు గ్రామీణ నేపథ్యానికి సెట్ కాలేదేమోనని అనిపిస్తుంది.
రీ రికార్డింగ్ ఓ మాదిరిగా వుంది. ఎడిటింగ్ విషయానికొస్తే విశ్రాంతి తరువాత హీరో - స్నేహితుల కాంబినేషన్లో వచ్చే సీన్ .. హీరో ఫ్రెండ్స్ లవ్ ట్రాక్ సీన్స్ .. క్రికెట్ ఆటలో గొడవ సీన్ అనవసరమనిపిస్తాయి. ఫీల్ పేరుతో సన్నివేశాల నిడివిని సాగనీయకుండా చూస్తే బాగుండేది. విద్యాసాగర్ - అమర్ దీప్ కెమెరా పనితనం బాగుంది. పల్లె అందాలను చాలా అందంగా .. హృద్యంగా ఆవిష్కరించారు. సంభాషణలు నేటివిటీకి తగినట్టుగా వున్నాయి. 'అప్పుడు దూరంగా వెళుతున్నట్టు అనిపించింది .. ఇప్పుడేమో దూరమవుతున్నట్టు అనిపిస్తోంది' .. 'ఇష్టపడటం తెలుసు .. బయట పడటం తెలియదు' వంటి గుర్తుండిపోయే మాటలు కొన్ని వున్నాయి.
ప్రేమ ఒక అనుభూతి పరిమళం .. ఆ ఫీల్ ను కథగా చదువుకోవడానికి బాగుంటుంది. కానీ తెరపైకి దృశ్య రూపంగా వచ్చేసరికి దానిని చూపించడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు. హీరో .. హీరోయిన్ల మధ్య కథా పరంగా గ్యాప్ పెరగడంతో అనవసరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి .. వాటి నిడివి కూడా పెరిగిపోయింది. హీరో పాత్రలో తమని ఊహించుకునే కుర్రాళ్లు కూడా డీలాపడిపోతారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందువలన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ప్రేమకథల్లో ఒకటిగానే ఈ సినిమా నిలిచిపోతుందని చెప్పొచ్చు.

Movie Name: Rajavaru Ranigaru
Release Date: 2019-11-29
Cast: Kiran, Rahasya, Raj Kumar, Yazurved, Divya, Sneha, Madhuri
Director: RaviKiran Kola
Producer: Mano Vikas
Music: Jay. Krish
Banner: S.L. Entertainments
Review By: Peddinti