'శివం భజే' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

'శివం భజే' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
  • అశ్విన్ బాబు హీరోగా 'శివం భజే'
  • కసరత్తు తగ్గిన కంటెంట్ 
  • ఆకట్టుకోని కథాకథనాలు 
  • ఆడియన్స్ గెస్ చేసే ట్విస్ట్
  • లోపించిన లవ్ ..  రొమాన్స్

అశ్విన్ బాబు హీరోగా 'శివం భజే' అనే సినిమాను దర్శకుడు అప్సర్ తెరకెక్కించాడు. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. దిగాంగన సూర్యవన్షి . అర్బాజ్ ఖాన్ .. మురళీశర్మ .. తులసి .. హైపర్ ఆది ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

చందూ (అశ్విన్ బాబు) ఓ మధ్యతరగతి యువకుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అతను, లోన్ రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. తన తండ్రిని దూరం చేసిన శివుడి పట్ల అతను కోపంతో ఉంటాడు. ఇక కెమికల్స్ తయారీకి సంబంధించిన ఒక సంస్థలో శైలజ ( దిగాంగన) అని చేస్తూ ఉంటుంది. తొలిసారి ఆమెను చూసిన సమయంలోనే చందూ మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతని పట్ల ఇష్టం చూపుతూ ఉంటుంది. 

లోన్ రికవరీ ఏజెంటుగా లోన్ విషయంలో ఒక గ్యాంగ్ తో చందూ గొడవపడతాడు. అతనిపై పగబట్టిన ఆ గ్యాంగ్ ఒకసారి చందూపై దాడి చేస్తుంది. ఆ దాడిలో చందూ చూపుపోతుంది. అయితే అతనికి వేరేవాళ్ల కళ్లను అమర్చుతారు. అప్పటి నుంచి చందూ ప్రవర్తన వింతగా మారిపోతుంది. తనకి ఏవో దృశ్యాలు కనిపిస్తున్నాయనీ, అందుకు కారణమేమిటో తెలియడం లేదని చందూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాడు. 

ఇదిలా ఉండగా చైనా - పాకిస్థాన్ దేశాలు భారతదేశంలో మారణకాండను సృష్టించడం కోసం, ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. అందుకు సంబంధించిన కొంతమంది మనుషులు, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకూ పనిచేస్తూ ఉంటారు. ఇదే సమయంలో సిటీలో సాగర్ .. మల్లికార్జున్ .. రాధాకృష్ణ మూర్తి చనిపోతారు. ఈ ముగ్గురూ కూడా కెమికల్స్ తయారు చేసే సంస్థకి చెందినవారు కావడంతో, ఏసీపీ మురళి (అర్బాజ్ ఖాన్) రంగంలోకి దిగుతాడు. 

సాగర్ .. మల్లి కార్జున్ .. రాధాకృష్ణమూర్తి చనిపోయిన తరువాత చందూకి ఒక విషయం అర్థమవుతుంది. తన కళ్లలో కనిపించినవారు ఆ తరువాత చనిపోతున్నారని అంటాడు. అలా ఎందుకు జరుగుతుందో తనకి తెలియడం లేదని చెబుతాడు. అప్పుడు అతని కళ్లను పరిశీలించి చూసిన నిశాంత్ చతుర్వేది (మురళి శర్మ) షాక్ అవుతాడు.   

చందూకు ఎవరి కళ్లను అమర్చుతారు? అతనికి కనిపిస్తున్న దృశ్యాల వెనుక కథా కమామిషూ ఏమిటి? అతణ్ణి పరీక్షించిన డాక్టర్ ఎందుకు షాక్ అవుతాడు?  చందూ - శైలజ ప్రేమ ఫలిస్తుందా? చైనా - పాకిస్థాన్ పన్నాగాలు ఎలాంటి ప్రభావితం చూపుతాయి? చివరికి చందూ శివుడిని నమ్ముతాడా? అనేది మిగతా కథ. 

ఈ మధ్య కాలంలో సాధారణమైన కథలకు దైవశక్తిని .. దైవానుగ్రహాన్ని జోడిస్తున్నారు.  అలా చేసిన కొన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ కథ కూడా అదే దారిలో నడుస్తుంది. ఐతే అనుకున్న స్థాయిలోప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకు కారణం కథాకథనాలను పట్టుగా అల్లుకోకపోవడమేనని చెప్పుకోవచ్చు. 

ఈ కథ నాలుగు వైపుల నుంచి కదులుతుంది. ఒక వైపు నుంచి చైనా - పాకిస్థాన్ వ్యూహాలు, ఒక వైపు నుంచి వరుస హత్యలు .. మరొక వైపున ఏసీపీ జరిపే విచారణ .. ఇంకో వైపు నుంచి చందూ కంటి ఆపరేషన్. ఇలా నాలుగు వైపుల నుంచి కథను మొదలుపెట్టేసి ..  ప్రతి ట్రాకులోను ఒక అయోమయాన్ని క్రియేట్ చేశారు. అందువలన తెరపై ఏం జరుగుతుందనే విషయంలో సాధారణమైన ప్రేక్షకులకు ఒక క్లారిటీ రాదు. 

దిగాంగనా గ్లామరస్ హీరోయిన్ .. అందువలన లవ్ .. రొమాన్స్ .. ఒక రేంజ్ లో ఉంటాయని మాస్ ఆడియన్స్ ఆశిస్తారు. కానీ దర్శకుడు అలాంటి ఆలోచనే చేయకపోవడం ఆడియన్స్ కి అసహనాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి .. కానీ వాటి వెనుక బలమైన ఎమోషన్ లేదు. అందువలన సన్నివేశాలు ఎప్పటికప్పుడు తేలిపోతూ ఉంటాయి. 

ఇక చివరివరకూ ఒక పాత్ర విషయంలో సస్పెన్స్ మెయింటెయిన్ చేయాలనుకున్నప్పుడు, ఆ ఆర్టిస్టు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను ఎక్కువగా చేసిన ఒక ఆర్టిస్టును మొదటి నుంచి మంచివాడిగా చూపించి, ఆ తరువాత విలన్ చూపించడం 'కిక్'ను ఇవ్వదు. ఈ సినిమా విషయంలో జరిగిన పెద్ద పొరపాటు ఇదే.  అందువల్లనే ఆడియన్స్ థ్రిల్ ఫీలవ్వలేదు. 

హీరో - హీరోయిన్స్ మధ్య లవ్ - రొమాన్స్ లేవు గనుక, డ్యూయెట్లకు ఛాన్స్ లేదు. హైపర్ ఆది పంచ్ లే అప్పుడప్పుడు కాస్త నవ్వు ముఖం పెట్టేలా చేస్తాయి. కథాపరంగా యాక్షన్ .. ఎమోషన్స్ ఉన్నాయిగానీ, అవి కనెక్ట్ కావు. వికాస్ బాడిస నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. దాశరథి శివేంద్ర కెమెరా పనితనం .. చోటాకె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే.
విదేశీ కుట్ర .. వరుస హత్యలు .. హీరోను దైవం వైపు మళ్లించే విధానం వంటి అంశాల చిత్రీకరణలో మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదేమోనని అనిపిస్తుంది.

Movie Name: Shivam Bhaje

Release Date: 2024-08-31
Cast: Ashwin Babu, Digangana Suryavanshi, Arbaaj Khan, Thulasi, Hyper Adi
Director: Apsar
Producer: Maheshwar Reddy
Music: Vikas Baadisa
Banner: Ganga Entertainments

Shivam Bhaje Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews