'తుఫాన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • ఈ నెల 9న థియేటర్లకు వచ్చిన 'తుఫాన్'
  • యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే కథ 
  • 23వ తేదీ నుంచి తెలుగులో అందుబాటులోకి 
  • నిరాశపరిచే కథాకథనాలు 
  • వినోదానికి దూరంగా నడిచే కంటెంట్   

తమిళంతో పాటు తెలుగులోను విజయ్ ఆంటోనీకి మంచి క్రేజ్ ఉంది. అందువలన తమిళంతో పాటు, తన సినిమాలన్నీ తెలుగులోను తప్పకుండా రిలీజ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. అలా తమిళంలో ఆయన చేసిన 'మజై పిడిక్కిత మనిథన్' సినిమా, ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా 'తుఫాన్' టైటిల్ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. 

సలీమ్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. చీఫ్ (శరత్ కుమార్) .. కెప్టెన్ ప్రభాకర్ (సత్యరాజ్) సూచనల మేరకు అతను పనిచేస్తూ ఉంటాడు. జీవితం పట్ల విరక్తి భావనతో సలీమ్ ఉంటాడు. అతణ్ణి ఒక సముద్రతీర ప్రాంతంలో చీఫ్ వదులుతాడు. అతను ఎవరో ఎవరికీ తెలియదనీ .. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా అక్కడ జీవించాలని సలీమ్ ను చీఫ్ హెచ్చరిస్తాడు. 

సముద్ర తీరంలో రత్నం (శరణ్య) ఆమె కొడుకు బర్మా (పృథ్వీ) ఒక చిన్నపాటి హోటల్ పెట్టుకుని బ్రతుకుతుంటారు. వాళ్ల ద్వారా ఆ ప్రాంతంలో సలీమ్ కి బస దొరుకుతుంది. ఆ సమయంలోనే ప్రమాదంలో పడిన ఒక కుక్కపిల్లను సలీమ్ కాపాడటంతో, అది ఆయనతోనే ఉంటూ ఉంటుంది. ఇక ఆ ప్రాంతంలో లోకల్ గ్యాంగ్ స్టర్ గా 'డాలి' (ధనుంజయ్) తన హవా కొనసాగిస్తూ ఉంటాడు.

అదే ప్రాంతంలో సౌమ్య (మేఘ ఆకాశ్) తన చెల్లెలితో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఆమె తండ్రి రాఘవన్ ( తలైవాసల్ విజయ్), డాలి కారణంగా చనిపోతాడు. తొలిచూపులోనే సౌమ్యపట్ల సలీమ్ ఆకర్షితుడవుతాడు. అయితే తనకి ఆశ్రయమిచ్చిన బర్మన్ ఆమెను ఆరాధిస్తున్నట్టు తెలుసుకుని తన ఆలోచనను మార్చుకుంటాడు. సౌమ్య మాత్రం సలీమ్ నే ప్రేమిస్తూ ఉంటుంది. 

ఇక పోలీస్ ఆఫీసర్ సుర్లా (మురళీశర్మ) డాలీని అరెస్టు చేసే సమయం కోసం వెయిట్ చేస్తుంటాడు. అయితే అతను ఎప్పటికప్పుడు చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటూ ఉంటాడు. తనపై సీక్రెట్ ఆపరేషన్ మొదలైందనే విషయం డాలీకి తెలిసిపోతుంది. దాంతో అతను సలీమ్ కి ఆశ్రయమిచ్చిన రత్నం ఫ్యామిలీపై .. అతనితో సన్నిహితంగా ఉండే సౌమ్యపై దాడి చేస్తాడు. అప్పుడు సలీమ్ ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనేది  కథ.

ఇది ఒక సీక్రెట్ ఏజెంట్ కథ.  గతం చేసిన ఒక గాయం కారణంగా అతను నిర్లిప్తంగా ఉంటూ ఉంటాడు. లోకం దృష్టిలో అతను చనిపోయాడు. కానీ తాను ఎవరన్నది తెలియని ఒక ప్రాంతంలో ఒక ఆపరేషన్ నిమిత్తం అతణ్ణి నియమిస్తారు. అక్కడి ఎమోషన్స్ అతణ్ణి ఎలా కదిలిస్తాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే ఒక కథనంతో ఈ సినిమా నడుస్తూ ఉంటుంది.
హీరో యాక్షన్లోకి దిగడం వరకూ ఫస్టు పార్థుగా .. ఆ తరువాత సెకండ్ పార్టు ఆడియన్స్ ను పలకరిస్తాయి. 

విజయ్ ఆంటోని సినిమాలు ఒక కాన్సెప్ట్ కి లోబడి కొనసాగుతాయి. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు అతనికి నప్పవు కూడా. అదే పంథాలో ఈ కథ కూడా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కారణంగా ఫస్టాఫ్ అంతా హీరో దిగాలు పడిపోయినట్టుగా ఉంటాడు. దాంతో ప్రేక్షకులు కూడా ఉస్సూరుమంటూ ఉండవలసిన పరిస్థితి. ఇక సెకండాఫ్ నుంచి హీరో కాస్త యాక్టివ్ అవుతాడు. అయితే ఇక్కడ కూడా అతనికి లవ్ ట్రాక్ ఏమీ ఉండదు. సీరియస్ గానే తాను అనుకున్నది చేస్తూ వెళుతుంటాడు. 

ఈ సినిమా చూసిన తరువాత ఇలాంటి కథలను ఇంతకుముందు  చాలానే చూశాం గదా అనిపిస్తుంది. పాత అంశాల మధ్య కొత్తగా మెరిసే పాయింట్ ఏమీ లేదే అనే ఒక భావన కలుగుతుంది. సీనియర్ స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, వినోదపరమైన అంశాలు లేని ఒక సాదాసీదా కథగానే ఇది తోస్తుంది. విజయ్ మిల్టన్ ఫొటోగ్రఫీ .. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం ఫరవాలేదు. ప్రవీణ్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది.

హీరో ఎందుకు మూడీగా ఉంటున్నాడు అనే విషయం ప్రేక్షకులకు చెప్పడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అప్పటివరకూ ఆడియన్స్ అయోమయంలోనే ఉంటారు. ఇక సత్యరాజ్ .. శరత్ కుమార్ వ్యూహం ఏమిటనేది కూడా ఆడియన్స్ కి అర్థం కాదు. హీరోయిన్ కాళ్లపై విలన్ పడటం .. తనని ప్రేమిస్తున్న హీరోయిన్ ను హీరో తన ఫ్రెండ్ కి లింక్ చేయడం లోపాలుగా అనిపిస్తాయి. ఆశించినస్థాయిలో అలరించలేకపోయిన యాక్షన్ డ్రామా ఇది. 

Movie Name: Toofan

Release Date: 2024-08-23
Cast: Vijay Antony, Sarathkumar , Sathyaraj , Dhananjaya,Megha Akash , Murali Sharma
Director: Vijay Milton
Producer: Kamal Bohra
Music: Achu Rajamani
Banner: Infiniti Film Ventures

Toofan Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews