'డెరిక్ అబ్రహం' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Derick Abraham

Release Date: 2024-08-10
Cast: Mammootty, Anson Paul, Kanika, Tarushi, Renji Panicker, Yog Japee, Siddique
Director: Shaji Padoor
Producer: TL George - Joby George
Music: Gopi Sundar
Banner: Goodwill Entertainments
Rating: 2.75 out of 5
  • మమ్ముట్టి నుంచి మరో యాక్షన్ మూవీ 
  • ఆరేళ్ల తరువాత ఓటీటీకి వచ్చిన సినిమా 
  • అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ 
  • మమ్ముట్టి మార్క్ పోలీస్ స్టోరీ ఇది.

మలయాళంలో మమ్ముట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆయన పోలీస్ ఆఫీసర్ గా చాలా చిత్రాలలో నటించారు. అలాంటి సినిమాలలో 'అబ్రహమింతే సంతాతికల్' ఒకటి. 2018లో అక్కడి థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, 40 కోట్లకి పైగా వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా 'డెరిక్ అబ్రహం' టైటిల్ తో ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

డెరిక్ అబ్రహం ( మమ్ముట్టి) ఓ పోలీస్ ఆఫీసర్. టీనేజ్ లో తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన, తమ్ముడు ఫిలిప్ (ఆన్సన్ పౌల్)ను ఎంతో ప్రేమగా పెంచుతాడు. అబ్రహం చాలా నిజాయితీపరుడు. సిటీలో జరుగుతున్న వరుస హత్యలకి సంబంధించిన కేసు అతనికి అప్పగించబడుతుంది. వర్షం కురిసే రాత్రివేళలో మాత్రమే హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడు 'సుత్తి'ని ఆయుధంగా ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ హత్య కేసును పరిష్కరించే పనిలో అబ్రహం ఉంటాడు.

అబ్రహం తమ్ముడు ఫిలిప్ .. అలీన (తరుషి) ప్రేమించుకుంటారు. ఆ విషయం అబ్రాహానికి కూడా తెలుస్తుంది. తన తమ్ముడు తనతో చెప్పినప్పుడు వాళ్ల పెళ్లిని గురించి ఆలోచించాలని అనుకుంటాడు. అయితే ఊహించని విధంగా అలీన హత్య జరుగుతుంది. ఫిలిప్ హంతకుడు అంటూ అతణ్ణి అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకుని వెళతారు. ఈ విషయం వినగానే అబ్రహం నివ్వెరపోతాడు. ఏం జరిగిందని తమ్ముడిని అడుగుతాడు. 

తనకేమీ తెలియదనీ .. తాను అలీనాను హత్య చేయలేదని ఫిలిప్ చెబుతాడు. కానీ ఆధారాలన్నీ కూడా తమ్ముడే నేరస్థుడు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి. దాంతో ఫిలిప్ ముగ్గురు స్నేహతులను అబ్రహం కలుసుకుని, జరిగిన సంఘటన గురించి అడుగుతాడు. అలీనా హత్య జరిగిన చోటుకు ఫిలీప్ వెళ్లాడనీ, ఆమె హత్య జరిగిన ప్రదేశంలోనే అతను ఉన్నాడని వాళ్లు చెబుతారు. దాంతో తమ్ముడే అలీనాను చంపాడనే నిర్ణయానికి అబ్రహం వస్తాడు. 

ఆ స్టేషన్ కి సంబంధించిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, అబ్రహం పట్ల ద్వేషంతో ఉంటారు. గతంలో వాళ్ల కొడుకులు తప్పు చేసి దొరికిపోయినప్పుడు అబ్రహం సహకరించలేదనే కోపంతో ఉంటారు. అందువలన ఇప్పుడు అతని తమ్ముడు బయటికి రాకుండా చేసే ప్రయత్నాల్లో వాళ్లు ఉంటారు. అది గమనించిన అబ్రహం, ఈ కేసు విషయంలో తమ్ముడే దోషి అని నిరూపించి జైలుకు పంపిస్తాడు. దాంతో అన్నయ్యపై ఫిలిప్ పగ పెంచుకుంటాడు. 

ఫిలిప్ జైలుకు వెళ్లిన కొన్ని రోజులకు, అతని ముగ్గురి స్నేహితులతో ఒకరు అబ్రహం దగ్గరికి వస్తాడు. తాను చేసిన పాపం తనని వెంటాడుతుందంటూ, అలీనా హత్యతో ఫిలిప్ కి ఎలాంటి సంబంధం లేదనీ, తాగిన మత్తులో తామే ఆమె హత్యకు కారణమయ్యామని చెబుతాడు. దాంతో తన తమ్ముడు నిర్దోషి అని నిరూపించాలని అబ్రహం అనుకుంటాడు. అదే సమయంలో అతణ్ణి చంపాలనుకున్న ఫిలిప్ ని ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ విడిచిపెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ. 

 హానీఫ్ తయారు చేసిన కథ ఇది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, క్లిష్టమైన పరిస్థితులను .. శత్రువులను ఎదుర్కుంటూ ఎలా తన తమ్ముడిని రక్షించుకున్నాడనేదే ఈ కథ. అన్నదమ్ముల ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. స్నేహితులమని చెప్పుకునే వారి వలన కొంతమంది ఎలాంటి చిక్కుల్లో పడతారు? నిజాయితీ అనేది మనచుట్టూ ఎలా శత్రువులను తయారు చేస్తుంది? అలాంటివారిని ఎలా ఫేస్ చేయాలి అనేది ఈ కథలోని నీతి.

ముందుగా ఈ కథ .. ఒక సైకో చేసే వరుస హత్యలతో మొదలవుతుంది. ఆ తరువాత అబ్రహానికి తన తమ్ముడు చేసినట్టుగా చెబుతున్న మర్డర్ కేసును డీల్ చేయవలసి వస్తుంది. కథ .. స్క్రీన్ అద్భుతాలు చేయకపోయినా, బోర్ అనిపించకుండా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.  ఇలాంటి కథలు మమ్ముట్టి ఇంతకుముందు చాలానే చేశారు .. మనం కూడా ఈ తరహా అనువాద చిత్రాలను చూశాం. అందువలన పెద్ద ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించదు. మమ్ముట్టి మార్క్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.  


Trailer

More Movie Reviews