'శశిమథనం' (ఈటీవీ విన్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • రొమాంటిక్ కామెడీగా 'శశి మథనం'
  • ప్రధాన పాత్రల్లో సోనియా సింగ్ - పవన్ సిద్ధూ
  • ఆకట్టుకునే కథాకథనాలు 
  • సరదాగా సాగే సన్నివేశాలు 
  • యూత్ తో పాటు ఫ్యామిలీ చూసే కంటెంట్ 

ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ కథల జోరు నడుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ లకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన వెబ్ సిరీస్ గా 'శశిమథనం' ఈ రోజున ట్రాక్ పైకి వచ్చింది. సోనియా సింగ్ - పవన్ సిద్ధూ జంటగా నటించిన ఈ సిరీస్ కీ, వినోద్ గాలి దర్శకత్వం వహించాడు. 6 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
 
మదన్ (పవన్ సిద్ధూ) వరంగల్ లో తన అన్నయ్య - వదినలతో కలిసి ఉంటాడు. అతని అన్నయ్య ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తూ ఉంటాడు. మదన్ ఏమీ చేయకపోయినా, అతని పట్ల గల ప్రేమతో ఏమీ అనకుండా సర్దుకుపోతుంటాడు. మదన్ హైదరాబాద్ కి చెందిన శశి (సోనియా సింగ్)తో ప్రేమలో ఉంటాడు. శశి తండ్రి అడ్వకేట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయనతో పాటు తల్లి .. తమ్ముడు .. తాత .. ఇదీ ఆమె కుటుంబం. ఒక రోజున వాళ్లంతా బంధువుల ఇంట్లో పెళ్లికి పది రోజుల ముందుగానే బయల్దేరతారు. 

మదన్ పేకాట కారణంగా భాస్కర్ అనే ఒక రౌడీకి 5 లక్షల అప్పు పడతాడు. అతనికి ఆ డబ్బు చెల్లించలేక కొన్ని రోజులపాటు ఎక్కడైనా దాక్కుందామని అనుకుంటాడు. అదే సమయంలో అతనికి శశి కాల్ చేసి పెళ్లికి వెళుతున్నట్టుగా చెబుతుంది. తన కోసం ఆమెను ఇంటిపట్టునే ఉండమని మదన్ బ్రతిమాలుతాడు. ఆమె కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్లగానే ఆ ఇంట్లో అడుగుపెడతాడు. అయితే శశి ఫ్యామిలీవాళ్లు వెళుతున్న పెళ్లి కేన్సిల్ కావడంతో, వాళ్లంతా మార్గమధ్యంలోనే వెనుదిరిగి వస్తారు.

శశి కుటుంబ సభ్యుల కంటపడకుండా బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో, ఆమె రూమ్ లో మదన్ దాక్కుంటాడు. తన కుటుంబ సభ్యులకు తెలియకుండా అతనిని దాచడానికి శశి నానా తంటాలు పడుతూ ఉంటుంది. అదే సమయంలో శశికి ఆమె మేనత్త రంగమ్మ (రూపాలక్ష్మి) ఒక సంబంధం తీసుకుని వస్తుంది. ఆమె పోలీస్ ఆఫీసర్ కావడం వలన, ఎక్కడ తనని పసిగడుతుందోనని శశి ఆందోళన చెందుతూ ఉంటుంది. 

శశి అనుకున్నట్టుగానే ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పును మేనత్త పసిగడుతుంది. అప్పటి నుంచి ఆమె శశిని మరింతగా గమనించడం మొదలుపెడుతుంది. ఆమె చూసిన సంబంధం వాళ్లు పెళ్లి చూపులకు శశి ఇంటికి వస్తారు. అదే సమయంలో శశి రూమ్ లోనే రంగమ్మ కంటపడతాడు మదన్. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? శశికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? మదన్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 

తాను ప్రేమించిన అబ్బాయిని ఒక అమ్మాయి తన పేరెంట్స్ కి తెలియకుండా ఇంట్లో దాచడం అనే సీన్స్ ను చాలా కథల్లో చూశాం. అయితే ఈ కథ మొత్తం అదే అంశంపై ఆధారపడి నడుస్తుంది. కథలో చాలా వరకూ ఒకే ఇంట్లో .. నాలుగు గోడల మధ్య జరుగుతుంది. అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్టు ఎపిసోడ్ లో కథ ట్రాక్ ఎక్కేవరకూ కాస్త డల్ గా అనిపిస్తుంది. ఇక అప్పటి నుంచి చివరివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఎక్కడా సాగతీత సన్నివేశాలు కనిపించవు. 

మొత్తం 6 ఎపిసోడ్స్ లో, 3వ ఎపిసోడ్ మరింత ఫన్ ను పంచిపెడుతుంది. ఈ ఎపిసోడ్ హైలైట్ గా అనిపిస్తుంది. రొమాంటిక్ కామెడీ అయినప్పటికీ, నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ ప్రేక్షకులలో ఉంటుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా సహజంగా కథను కనెక్ట్ చేశారు. సోనియా - పవన్ జోడీ చాలా క్యూట్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసే విషయంలోనూ దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడనే చెప్పాలి. 

రేహాన్ షేక్ ఫొటోగ్రఫీ బాగుంది. సింజిత్ నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి చాలా హెల్ప్ అయింది. అనిల్ కుమార్ ఎడిటింగ్ వర్క్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఇది రొమాంటిక్ కామెడీ అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు .. ఆ తరహా డైలాగులు వినిపించవు. ఫీల్ తో కూడిన లవ్ .. ఎమోషన్స్ తో సాగే ఈ సిరీస్, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది. 

Movie Name: Shashi Madhanam

Release Date: 2024-07-04
Cast: Soniya Singh, Pavan Siddhu, Keshav Deepak, Rupa lakshmi, Sri lalitha , Venkatesh
Director: Winod Gali
Producer: Harish Kohirkar
Music: Sinjith Yerramalli
Banner: Mark My Words

Shashi Madhanam Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews