'తిప్పరా మీసం' మూవీ రివ్యూ

చిన్నతనంలోనే చెడు బాట పట్టిన కొడుకు .. అతనితో పాటే పెరుగుతూ వచ్చిన వ్యసనాలు. అతను మంచి మార్గంలోకి అడుగుపెట్టే రోజు కోసం ఎదురుచూసే తల్లి. ఆమె ప్రేమకి ద్వేషాన్ని ఫలితంగా ముట్టజెప్పే కొడుకు. ఇలా తల్లీకొడుకుల మధ్య నడిచే కథ ఇది. ప్రధానమైన కథకు వినోదపరమైన మిగతా అంశాలను జోడించకపోవడం వలన, ఈ సినిమా ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు.

శ్రీవిష్ణు మంచి నటుడు .. ఈ విషయాన్ని ఆయన తన తొలి చిత్రంతోనే నిరూపించుకున్నాడు. అప్పటి నుంచి కూడా వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ, కెరియర్ పరంగా ఒక్కో మెట్టూ పైకెక్కుతూ వెళుతున్నాడు. అలా ఈ మధ్య ఆయన చేసిన 'బ్రోచేవారెవరురా' విజయంతో పాటు ప్రశంసలు అందుకుంది. అలాంటి శ్రీవిష్ణు చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందన్నది ఇప్పుడు చూద్దాం.

మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంటాడు. తల్లి లలిత (రోహిణి) అతన్ని బాగా చదివించి ప్రయోజకుడిని చేయాలనుకుంటుంది. అయితే స్కూల్ కి వెళ్లే వయసులోనే మణిశంకర్ దారితప్పుతాడు. అతణ్ణి సరైన దారిలోపెట్టడం కోసం తల్లి చేసిన ప్రయత్నాలు, ఆమె పట్ల అతనికి ద్వేషం పెరిగేలా చేస్తాయి. ఆ ద్వేషంతో కొన్నేళ్లపాటు  తల్లికి దూరమైన అతను, ఓ పబ్ లో డీజేగా పనిచేస్తూ, విచ్చలవిడి జీవితాన్ని గడుపుతుంటాడు.

అలాంటి సమయంలోనే అతనికి 'మోనిక' (నిక్కీ తంబోలి)తో పరిచయం ఏర్పడుతుంది .. అది కాస్తా ప్రేమగా మారుతుంది. మాదక ద్రవ్యాలకి .. క్రికెట్ బెట్టింగులకి అలవాటుపడిన మణిశంకర్, జోసఫ్ అనే బుకీకి 30 లక్షల అప్పు పడతాడు. ఆ డబ్బుకోసం తన ఆస్తి తనకి రాసివ్వమంటూ తల్లితో గొడవపడతాడు. చివరికి కోర్టుకి కూడా వెళతాడు. అప్పుడు అతనికి ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి? అది మణిశంకర్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది? అనే అంశాలతో మిగతా కథ నడుస్తుంది.

దర్శకుడు కృష్ణవిజయ్ ఈ సినిమాకి 'తిప్పరా మీసం' అనే టైటిల్ పెడితే పౌరుషంతో కూడిన ఆ రేంజ్ సీన్స్ వుంటాయని ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ సినిమాలో కల్పించుకుని తిప్పితే తప్ప, హీరో మీసం తిప్పే సందర్భాలుగానీ .. ఆ స్థాయి సన్నివేశాలుగాని ఎక్కడా కనిపించవు. హీరో తన కోసం .. తనని నమ్ముకున్నవాళ్ల కోసం మీసం తిప్పి ప్రధానమైన ప్రతినాయకుడిని మట్టి కరిపించాడా అంటే అదీ లేదు.

శ్రీవిష్ణు పాత్రను నెగెటివ్ షేడ్స్ లో దర్శకుడు చాలా బాగా మలిచాడు. అయితే హీరోలో మార్పు చూపించడమనేది ఆలస్యమైపోయింది. తాగుడు .. బెట్టింగులు .. అర్థంపర్థం లేని పందాలతోనే సినిమా చాలావరకూ నడుస్తుంది. ప్రేక్షకులు థియేటర్లో నుంచి బయటికి వచ్చే సమయంలో హీరో మారడం వలన కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అంతేకాదు వ్యసనాల కారణంగా హీరో .. తన కుటుంబాన్ని దూరం పెడితే, అదే వ్యసనాల కారణంగా హీరోయిన్ అతనికి దూరమవుతుంది. దాంతో ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ కి అవకాశం లేకుండా పోయింది.

ఇక ప్రధానమైన విలన్ ఎప్పుడూ హీరో చేతిలో చనిపోయినప్పుడే ఆడియన్స్ కి కిక్ ఉంటుంది. అది మరొకరి ఖాతాలో వేయడం వలన ఆడియన్స్ నిరాశ చెందుతారు. హీరోకి త్యాగం ఆపాదించాలనుకుంటే అందుకు మరో మార్గాన్ని ఎంచుకోవలసింది. దర్శకుడు తీసుకున్న ఈ నిర్ణయాల వలన, వ్యసనపరుడైన హీరో లీలావిశేషాలు ఒక్కొక్కటిగా తెరపైకి వచ్చి వెళుతుంటాయి .. కానీ ప్రేక్షకులకు ఏమీ అనిపించదు. ఎందుకంటే చివరివరకూ ఎక్కడా ఎలాంటి ట్విస్టులు లేవు. అప్పటివరకూ ఆడియన్స్ ను కూర్చోబెట్టే రొమాంటిక్ సాంగ్స్ లేవు .. కనీసం నవ్వు ముఖం పెట్టించే కామెడీ కూడా లేదు.  సంగీతం .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ పనితీరు ఒక మాదిరిగానే వున్నాయి. ఎడిటింగ్ విషయానికొస్తే హీరో చిన్నప్పటి సీన్స్ ను ట్రిమ్ చేయవలసింది.  

మణిశంకర్ పాత్రలో శ్రీవిష్ణు చాలా బాగా చేశాడు. అన్నిరకాల వ్యసనాలకు హక్కుదారుడినన్నట్టుగా తన పాత్రకి న్యాయం చేశాడు. లుక్ పరంగాను .. బాడీ లాంగ్వేజ్ పరంగాను కొత్తదనాన్ని చూపించాడు. తల్లిపట్ల ద్వేషాన్నీ .. ఆమె పట్ల ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాల్లో మెప్పించాడు. హీరోకి లవర్ పాత్రలో నిక్కీ తంబోలి నటించింది. నిక్కీ తంబోలి ఇంట్రడక్షన్ సీన్లోనే ప్రేక్షకులు నీరుగారిపోతారు. అందుకు కారణం ఆమె గ్లామర్ .. హీరోయిన్ రేంజ్ లో లేకపోవడమే. హీరోకి తల్లిగా సీనియర్ నటి 'రోహిణి' తనదైన శైలిలో పాత్రను పండించింది. కొడుకులో మంచి మార్పు కోసం ఆరాటపడే పాత్రలో మెప్పించింది. ఇక హీరో మేనమామ పాత్రలో బెనర్జీ, ఆ పాత్రపై తనదైన మార్క్ వేశాడు. ఇక హీరోను టార్చర్ పెట్టే జోసెఫ్ .. కాళీ .. దుర్గా పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన, అవి ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.

దర్శకుడు ఎంచుకున్న కథా వస్తువు మంచిదే అయినా, ప్రేక్షకులకు వినోదాన్ని అందించే మిగతా అంశాలను ప్రధానమైన కథకు జోడించడంలో విఫలమయ్యాడు. ఎవరినీ కేర్ చేయని స్వభావం కలిగిన హీరో, ఒక క్రికెట్ బుకీకి భయపడి, అతనికి ఇవ్వాల్సిన డబ్బు కోసం తల్లిపై కేసు పెట్టడం సిల్లీగా అనిపిస్తుంది. జోసఫ్ .. కాళీ .. దుర్గాలలో అసలు విలన్ ఎవరు? అనే ప్రశ్నను ప్రేక్షకులే వేసుకునే పరిస్థితి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి పాత్రను హైలైట్ చేసి, మీసం తిప్పేసి వాళ్లతో హీరో తలపడితే బాగుండేది. సినిమా అనేది వినోద సాధనం .. కథలో ప్రధానమైన రసం ఏదైనా ప్రేక్షకులకు ప్రధానంగా కావలసింది వినోదమే. ఆ వినోదమే లోపిస్తే ఎలా ఉంటుందనడానికి ఈ సినిమాయే ఒక ఉదాహరణ.

Movie Name: Thipparaa Meesam

Release Date: 2019-11-08
Cast: Sree Vishnu, Nikki Thamboli, Rohini, Banerjee
Director: Krishna Vijay
Producer: Rizwan
Music: Suresh Bobbili
Banner: Rizwan Entertainments   

Thipparaa Meesam Rating: 2.00 out of 5


More Movie Reviews