'మహారాజ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన 'మహారాజ్'
  • కథానాయకుడిగా ఆమీర్ ఖాన్ తనయుడి ఎంట్రీ
  • 18వ శతాబ్దంలో నడిచే కథ  
  • సెట్స్ .. ఫొటోగ్రఫీ .. బీజీఎమ్ హైలైట్
  • పెర్ఫెక్ట్ గా అనిపించే కంటెంట్  

'మహారాజ్' .. ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, జైదీప్ అహ్లావత్ కీలకమైన పాత్రను పోషించాడు. విడుదలకు ముందు ఈ సినిమా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ సినిమా కంటెంట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు గుజరాత్ కోర్టును ఆశ్రయించారు. ముందుగా నిలుపుదల ఉత్తర్వులు జారీచేసిన కోర్టు, ఆ తరువాత విడుదల చేసుకోవచ్చునని ఆదేశించింది. అలా నెట్ ఫ్లిక్స్ కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 1832లో గుజరాత్ - 'వడాల్' గ్రామంలో మొదలై, 1862 వరకూ 'బాంబే'లో జరుగుతుంది. వైష్ణవ దంపతులైన ముల్జీ జీవరాజ్ దంపతులకు కర్సన్ (జునైద్ ఖాన్) జన్మిస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా అక్కడివారి జీవన విధానాన్ని .. ఆచారవ్యవహారాలని పరిశీలిస్తూ పెరుగుతాడు. పదేళ్ల వయసులో అతని తల్లి చనిపోవడంతో, తండ్రి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆ సమయంలోనే అతను తన మేనమామతో కలిసి బాంబే వచ్చేస్తాడు.

కర్సన్ అభ్యుదయ భావాలతో ఎదుగుతాడు. ఒక ప్రెస్ లో జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయన, కిశోరీ (షాలినీ పాండే) ప్రేమలో పడతాడు. ఆ ప్రాంతంలో కృష్ణ మందిరం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రివేళ వరకూ అది భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. మహారాజ్ (జైదీప్ అహ్లావత్)
ఆశ్రమ నిర్వాహకుడిగా ఉంటాడు. తాను భగవంతుడి ప్రతినిధిగా ప్రకటించుకుని, తన సేవ చేయడంవలన ఇతరుల జీవితాలు తరిస్తాయనే ప్రచారం చేయిస్తాడు. 

మహారాజ్ దగ్గర 'ఖవాస్' అనే సహాయకుడు ఉంటాడు. అతని ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓ ఆధ్యాత్మిక వేడుకలో కిశోరిని చూసిన మహారాజ్ మనసు పారేసుకుంటాడు. 'చరణసేవ' పేరుతో మందిరానికి రప్పించి ఆమెను లోబరచుకుంటాడు. ఈ విషయం తెలిసిన కర్సన్, ఆ రోజు నుంచి ఆమెకి దూరంగా ఉండటం మొదలుపెడతాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత తన చెల్లెలిని కూడా మహారాజ్ వశపరచుకోవడానికి ప్రయత్నించడంతో, అతని నిజస్వరూపం కిశోరికి అర్థమవుతుంది.           

మహారాజ్ ఆధ్యాత్మిక ముసుగు కప్పుకున్న ఒక కాముకుడు అనే విషయం ఆమెకి అర్థమౌతుంది. కర్సన్ ఎంతగా చెప్పినా తాను నమ్మనందుకు బాధపడుతుంది. అదే సమయంలో లీలావతి అనే మరో యువతి కూడా మహారాజ్ కారణంగా మోసపోతుంది. ఆమె అన్నయ్య శ్యామ్ జీ ఓ రాత్రివేళ కర్సన్ సాయాన్ని కోరతాడు. వారికి సాయం చేయడానికి కర్సన్ వచ్చేసరికి ఆ అన్నాచెలెళ్లు కనిపించకుండా పోతారు. దాంతో కర్సన్ ఆలోచనలో పడతాడు. 

కిశోరి విషయంలో మనసు మార్చుకున్న కర్సన్ కీ ఆమె చనిపోయిందని తెలుస్తుంది. మహారాజ్ అసలు రూపం ఈ సమాజానికి తెలిసేలా చేయమని ఆమె రాసిన లెటర్ అతనికి చేరుతుంది. అపుడు అతను ఏం చేస్తాడు? మహారాజ్ పాపాలను బయటపెట్టడానికి ఆయన ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు? ఆ ప్రయత్నాల్లో అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? కర్సన్ ను అడ్డు తప్పించాడానికి మహారాజ్ ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు? అనేది మిగతా కథ.    

కొంతమంది స్వామీజీలు భక్తి ముసుగులో స్త్రీలను లైంగికంగా వేధించడమనేది చాలా ప్రాంతాల్లో .. చాలా సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. అలా బాంబేలో 18వ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన సినిమానే 'మహారాజ్'. ఆచారం పేరుతో .. సంప్రదాయం ముసుగులో ఆ రోజుల్లో జరిగిన ఈ దారుణాలను ఎదిరించే పాత్రలో హీరో కనిపిస్తాడు. హీరోయిన్ పాత్ర బలికావడంతోనే హీరో పోరాట ఉద్ధృతి పెరుగుతుంది. 

ఈ కథ ఓ యథార్థ సంఘటన. అందువలన వినోదపరమైన అంశాలు తక్కువగా కనిపిస్తాయి. లవ్ .. రొమాన్స్ ను టచ్ చేస్తూ, ఎమోషన్స్ తో ముందుకు వెళుతుంది. సినిమా మొదటి నుంచి చివరివరకూ చూస్తే .. ఇది ఎక్కడా పట్టుసడలని ఒక పెర్ఫెక్ట్ కంటెంట్ అనే చెప్పాలి. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది .. ప్రయోజనం ఉంటుంది. పాత్రలన్నీ కలిసి సహజత్వంవైపే వెళుతూ ఉంటాయి. అందువలన ఎక్కడా కృతకంగా అనిపించదు. 

ఈ కథ 18 శతాబ్దంలో జరుగుతుంది. అందువలన అప్పటి నిర్మాణాలు .. కాస్ట్యూమ్స్ .. వస్తువులు చూపించడం చాలా కష్టమైన విషయం. అయినా మొదటి నుంచి చివరివరకూ మనలను ఆ కాలంలోనే విహరింపజేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సెట్స్ .. లైటింగ్ ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పాలి. సోహెల్ ఖాన్ నేపథ్య సంగీతం .. రాజీవ్ రవి కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. శ్వేత వెంకట్ ఎడిటింగ్ బాగుంది.  

ఇక ఈ సినిమాలో పాత్రల స్వభావాలకి తగినవిధంగా .. సందర్భానికి తగినట్టుగా సంభాషణలు ఉన్నాయి. అనువాదం కోసం రాసిన డైలాగ్స్ మాదిరిగా కాకుండా, కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా మహారాజ్ కి తెలుగులో చెప్పిన వాయిస్ కూడా కరెక్టుగా సరిపోయింది. ఎక్కడా అభ్యంతరకరమైన సంభాషణలుగానీ .. సన్నివేశాలుగాని లేవు. అందువలన ధైర్యంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. 

Movie Name: Maharaj

Release Date: 2024-06-21
Cast: Junaid Khan, Jaideep Ahlavat, Shalini Pandey, Sharvari
Director: Siddharth P Malhotra
Producer: Adihya Chopra
Music: Sohail Khan
Banner: YRR Entertainments

Maharaj Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews