'యువరాజ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • కన్నడలో 'యువ' టైటిల్ తో వచ్చిన సినిమా 
  • తెలుగులో 'యువరాజ్' పేరుతో ఓటీటీలోకి 
  • యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా సాగే కథ 
  • రొమాన్స్ - కామెడీ లోపించిన కంటెంట్ 
  • అక్కడక్కడ మాత్రమే కనెక్ట్ అయ్యే సీన్స్       

కన్నడలో రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయమయ్యాడు. ఆ హీరో పేరే యువరాజ్ కుమార్. రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన యువ రాజ్ కుమార్, హీరోగా 'యువ' అనే సినిమా చేశాడు. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి కూడా వచ్చేసింది. ఈ రోజు నుంచే ఈ సినిమా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ మంగుళూరులో జరుగుతుంది. యువ (యువరాజ్ కుమార్) ఓ మిడిల్ క్లాస్ కి చెందిన యువకుడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు. తండ్రి శంకర్ (అచ్యుత్ కుమార్).. తల్లి .. ఓ చెల్లి .. ఇది అతని ఫ్యామిలీ. తండ్రి ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. తన కొడుకు రెజ్లర్ గా నేషనల్స్ కి ఆడాలనీ, తన కూతురికి గొప్పగా పెళ్లి చేయాలనేది అతని కల. అయితే యువరాజ్ చేసిన ఒక పొరపాటు కారణంగా అతనిపై రెండేళ్ల నిషేధం పడుతుంది. దాంతో ఇక కూతురు పెళ్లైనా గ్రాండ్ గా చేయాలని అతను భావిస్తాడు. 

రెజ్లర్ గా పడిన నిషేధాన్ని మరిచిపోవడానికి యువ ప్రయత్నిస్తూ, ఇంజనీరింగును పూర్తి చేసే పనిలో పడతాడు. అతనికీ .. సిరి ( సప్తమి గౌడ)కి మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తూ ఉంటుంది. ఆమె హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. హాస్టల్స్ లో ఉన్న స్టూడెంట్స్ కి .. లోకల్ గా ఉన్న స్టూడెంట్స్ కి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కృపాల్ అనేవాడు, హాస్టల్ స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తాడు. 

కృపాల్ తండ్రి శ్రీమంతుడు కావడం వలన కాలేజ్ యాజమాన్యం అతనినేమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గొడవలతో జోక్యం చేసుకోవద్దని సిరి చెప్పినా యువ వినిపించుకోడు. అందువలన అతనితో ఆమె బ్రేకప్ చేసుకుంటుంది. అతను మాత్రం మౌనంగా ఉండిపోతాడు. కృపాల్ ద్వారా నర్సింహా ముఠాకి .. అతని కారణంగా గణేశన్ ముఠాకి యువ టార్గెట్ అవుతాడు. అదను చిక్కితే చాలు యువను అంతం చేయాలనే ఆలోచనలో వాళ్లు ఉంటారు.

తన ఆశయానికి అనుగుణంగా నడచుకోలేదని యువ పట్ల తండ్రి కోపంగా ఉంటాడు. యువకి చెప్పకుండానే తన కూతురు శ్వేత (హితా చంద్రశేఖర్) వివాహం జరిపిస్తాడు. చెల్లెలి ద్వారా విషయం తెలిసినా యువ మౌనంగానే ఉండిపోతాడు. తన చదువును పూర్తిచేసి, ఇంటికి చేరుకుంటాడు. శ్వేత పెళ్లిని గ్రాండ్ గా జరిపించడం కోసం అప్పులు చేసిన తండ్రి, ఇల్లొదిలి వెళ్లిపోయాడని తెలిసి షాక్ అవుతాడు. 

ఒక వైపున రెజ్లర్ గా ఎదుర్కుంటున్న నిషేధం. మరో వైపున కాలేజ్ వైపు నుంచి వెంటాడుతున్న రౌడీలు. ప్రేమించిన అమ్మాయి నుంచి ఎదురైన బ్రేకప్. ఇక ఇప్పుడు ఇల్లొదిలి పారిపోయిన తండ్రి. ఇలాంటి పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఎదురుకావడంతో యువ ఏం చేస్తాడు? అతను తీసుకునే నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? తాను అనుకున్నట్టుగా అన్ని సమస్యలకు ఆయన తెర దింపగలుగుతాడా .. లేదా? అనేది కథ.    
     
సంతోష్ ఆనంద్ రామ్ తయారు చేసుకున్న కథ ఇది. హీరో ఇంజనీరింగ్ చదువు .. ఒక వైపు స్పోర్ట్స్ కి సంబంధించిన అతని కెరియర్ .. మరో వైపు లవ్ .. ఇంకో వైపు ఫ్యామిలీ టెన్షన్స్  ఇలా నాలుగు  వైపులా నుంచి హీరో చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. వీటిని అధిగమించడం కోసం హీరో ఏం చేశాడనే అంశాలను కలుపుతూ వెళ్లాడు. యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.   

ఈ సినిమా ఫస్టాఫ్ అంతా హీరో కాలేజ్ లైఫ్ .. గొడవలు, సెకండాఫ్ అంతా తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం చేసే పోరాటం కనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్ లో లవ్ ఉంటుంది కానీ అది నామ మాత్రమే .. ఇక రొమాన్స్ జాడలు కూడా ఎక్కడా కనిపించవు. యాక్షన్ మాత్రం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. అప్పులు వసూలు చేయడానికి తన ఇంటికి రౌడీలు వచ్చినప్పుడు హీరో రియాక్ట్ అయ్యే తీరు .. ఫుడ్ డెలివరీ బాయ్స్ ఛేజింగ్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. 

నిర్మాణ విలువలకు వంక బెట్టవలసిన అవసరం లేదు. హీరోపై దర్శకుడు ఎక్కువ భారం .. బాధ్యతలు పెట్టేశాడేమో అనిపిస్తుంది. కథ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ హీరో సీరియస్ గా ఉంటాడు. హీరోనే హ్యాపీగా లేనప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. అదేవిధంగా హీరో అన్నీ చేయగలడు అనే విషయాన్ని ఈ ఒక్క సినిమాలోనే చెప్పేయాలనుకున్నారు. ఈ రెండు అంశాలు మైనస్ గా మారాయేమో అనిపిస్తుంది.

యువరాజ్ కుమార్ ఎలా చేశాడు అంటే చెప్పలేం. ఎందుకంటే మొదటి నుంచి చివరివరకూ సీరియస్ లుక్ ఒకటే కంటిన్యూ చేస్తూ వెళ్లాడు. హీరోయిన్ గా సప్తమీ గౌడ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. గ్లామర్ పరంగా ఆమెను ఉపయోగించుకునే ఆలోచన కూడా దర్శకుడు చేయలేదు. ఇక మిగతా వాళ్లు ఎవరి పాత్రకి వాళ్లు న్యాయం చేశారు. శ్రీషా కుదువల్లి ఫొటోగ్రఫీ .. ఆశిష్ ఎడిటింగ్ ఫరవాలేదు. అజనీశ్ లోకనాథ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.   

ఇంజనీరింగ్ పూర్తిచేసిన హీరో, 'బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా' అంటూ ఫుడ్ డెలివరీ బోయ్ గా అవమానాలను ఎదుర్కోవడం సిల్లీగా అనిపిస్తుంది. హీరోకి ఇతర పాత్రల ద్వారా బిల్డప్ ఇచ్చే డైలాగులు కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కథను నిలబెట్టే నాలుగు అంశాలు సీరియస్ గా కనిపించేవే కావడంతో కామెడీ మిస్సయింది. మొత్తంగా చూసుకుంటే అక్కడక్కడా కొన్ని సీన్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. 

Movie Name: Yuvaraj

Release Date: 2024-05-18
Cast: Yuva Rajkumar, Sapthami Gowda, Achyuth Kumar, Sudharani, Hitha Chandrashekar
Director: Santhosh Ananddram
Producer: Vijay Kiragandur
Music: Ajaneesh Loknath
Banner: Hombale Films

Yuvaraj Rating: 2.50 out of 5


More Movie Reviews