'బాక్' - మూవీ రివ్యూ

  • సుందర్ సి నుంచి వచ్చిన 'బాక్' 
  • అస్సామీ జానపద కథ ఆధారంగా రూపొందిన సినిమా 
  • ఆసక్తికరంగా అనిపించే కథాకథనాలు 
  • నిరాశపరిచిన కామెడీ ట్రాక్ 
  • ఆకట్టుకునే క్లైమాక్స్

తమిళంలో ' అరణ్మనై' టైటిల్ క్రింద సుందర్ సి. వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆ సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తున్నాడు. ఆ సిరీస్ అనువాదాలుగా ఇక్కడికి వచ్చిన 'చంద్రకళ' .. 'కళావతి' సినిమాలు ఘనవిజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో 'అరణ్మనై 4' సినిమాను తెలుగులో 'బాక్' పేరుతో నిన్న థియేటర్లలో విడుదల చేశారు. సుందర్ సి.తో పాటు తమన్నా - రాశి ఖన్నా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ బ్రహ్మపుత్ర నదీ తీరంలో మొదలవుతుంది. ఓ గ్రామానికి చెందిన పూజారి .. తన కూతురిని తీసుకుని పడవలో నదిని దాటుతూ ఉంటాడు. ఆ నదిలో 'బాక్' అనే దెయ్యం ఉందనీ, అది బయటికి రాకుండా కట్టడి చేయబడిందని అతను తన కూతురుతో చెబుతాడు. అయితే పడవను ముందుకు తీసుకుని వెళ్లడానికి అతను ఉపయోగించే కర్ర, ఆ దెయ్యాన్ని నీటిలో బంధించిన కుండకు తాకుతుంది. దాంతో 'బాక్' దెయ్యం నీటిపైకి రావడం .. ఆ పూజారి కూతురిని చంపేయడం జరిగిపోతాయి. 

ఆ పూజారి మంత్ర జలంతో ఆ ప్రేతాత్మ శక్తిని ఒక కుండలో బంధిస్తాడు. తన భార్య కోసం తన కూతురిగా నటిస్తూ ఉండమని చెబుతాడు. తన శక్తి పూజారి అధీనంలో ఉండటంతో 'బాక్' అందుకు అంగీకరిస్తుంది. ఒక ప్రాచీనకాలం నాటి అమ్మవారి ఆలయం గోపుర కలశంలో అతను ప్రేతాత్మ శక్తిని నిక్షిప్తం చేస్తాడు. ఇదిలా ఉండగా శివశంకర్ (సుందర్ సి) లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని మేనత్త (కోవై సరళ) అతని దగ్గరే ఉంటూ ఉంటుంది. శివాని (తమన్నా) అతని చెల్లెలు. ఆమె అంటే అతనికి ప్రాణం. 

తండ్రికీ .. అన్నయ్యకి ఇష్టం లేని పెళ్లిచేసుకున్న కారణంగా శివాని ఆ కుటుంబానికి దూరమవుతుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు .. వాళ్ల జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. వాళ్లు ఎక్కడ ఉన్నా చల్లగా ఉంటే చాలని శివశంకర్ అనుకుంటాడు. కానీ శివాని - ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నారనే కబురు వస్తుంది. దాంతో వెంటనే అతను మేనత్తను వెంటబెట్టుకుని అక్కడికి వెళతాడు. మేనల్లుడిని అక్కున చేర్చుకుంటాడు.

శివ శంకర్ మేనకోడలు షాక్ లో ఉంటుంది. ఆ అమ్మాయికి మాయ (రాశి ఖన్నా) ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ గా ఆ గ్రామస్తులకు సేవ చేస్తున్న మాయ, ఆ ఊరి జమిందార్ కూతురని తెలుసుకుంటాడు. తన చెల్లెలు .. బావ చనిపోయిన ప్రదేశం, వారి శవాలు లభించిన ప్రదేశం శివశంకర్ పరిశీలన చేస్తాడు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకోలేదనీ హత్య చేయబడ్డారనే అనుమానం కలుగుతుంది. 

ఆ సమయంలోనే అతనికి ఒక మాంత్రికుడు తారసపడతాడు. 'బాక్' అనే దెయ్యం తన బంధనాలు తెంచుకుని మళ్లీ బయటికి వచ్చిందనీ, అదే అతని చెల్లెలినీ .. బావను చంపిందని చెబుతాడు. త్వరలో అతని మేనకోడలిని చంపాలనే ఉద్దేశంతో ఉందని అంటాడు. ఆ మాటలు విన్న శివశంకర్ ఎలా స్పందిస్తాడు? అతని మేనకోడలీని ఆ దెయ్యం ఎందుకు చంపాలని అనుకుంటుంది? అది తెలుసుకున్న శివశంకర్ ఏం చేస్తాడు? అనేదే కథ.   

  ఈ సిరీస్ కి కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వం . నిర్మాణం సుందర్ సి ... కథానాయకుడు కూడా అతనే. ఈ సారి ఆయన ఈ కథను అస్సామీ జానపద సాహిత్యంలో కనిపించే ఒక దెయ్యం కథను స్ఫూర్తిగా తీసుకుని, దానికి సినిమా రూపాన్ని ఇచ్చాడు. ఈ తరహా సినిమాలు తీయడంలో అతనికి మంచి నైపుణ్యం ఉంది. ఇక ఈ తరహా కథల్లో నటించిన అనుభవం తమన్నా - రాశి ఖన్నాలకు ఉంది. అలాంటి ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని ఊహించుకోవడం సహజం. అదే వాళ్ల అసంతృప్తికి కారణం కూడా. 

ఈ సినిమాలో ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలు రెండు మూడు ఉన్నాయి. వెన్నెల కిశోర్ - శ్రీనివాస రెడ్డి కాంబినేషన్లో నడిపిన కామెడీ ట్రాక్, హారర్ సీన్స్ కి మించి భయపడతుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ను ముందుగా అనుకుని సెట్స్ పైకి వెళ్లారు. కామెడీ సీన్స్ ను మాత్రం సెట్స్ పైనే అనుకున్నట్టుగా అనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో ఇంత సిల్లీ కామెడీని ఆడియన్స్ చూసి ఉండరు. ఆడియన్స్ కమెడియన్స్ ను చూసి నవ్వరు .. వాళ్లు చేసే కామెడీని చూసి నవ్వుతారు అనే విషయాన్ని మరిచిపోయారు. 

రాశి ఖన్నాకి ఫస్టు టైమ్ దెయ్యం కనిపించే సీన్ .. తమన్నా పాత్ర తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నించే సీన్ .. క్లైమాక్స్ సీన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్ కోసం తయారు చేయించిన అమ్మవారి విగ్రహం .. ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా, ఆ పాత్రలకు జీవం పోశారు. నిర్మాణ విలువలకు వంకబెట్టవలసిన అవసరం లేదు. హిప్ హాప్ తమిళ నేపథ్యం బాగుంది. కృష్ణస్వామి కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. హారర్ కామెడీ జోనర్ ను ఇష్టపడేవారికి, ఫరవాలేదనిపించే సినిమా.     

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఎమోషన్స్ ..  క్లైమాక్స్  


మైనస్ పాయింట్స్ : వెన్నెల కిశోర్ .. శ్రీనివాస్ రెడ్డి కామెడీ ట్రాక్ 


Movie Name: Baak

Release Date: 2024-05-03
Cast: Sundar C, Tamannaah Bhatia, Raashii Khanna, Santhosh Prathap, Ramachandra Raju, Kovai Sarala
Director: Sundar C
Producer: Khushbu Sundar
Music: Hiphop Tamizha
Banner: Avni Cinemax

Baak Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews