'డియర్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • ఈ నెల 11న తమిళంలో విడుదలైన 'డియర్' 
  • రొమాంటిక్ డ్రామా జోనర్లో రూపొందిన సినిమా 
  • దారితప్పిన కథ .. ఆకట్టుకోని కథనం
  • వినోదానికి దూరంగా వెళ్లిన కంటెంట్ 

తమిళంలోనే కాదు .. తెలుగులోను ఐశ్వర్య రాజేశ్ కి మంచి ఇమేజ్ ఉంది. సహజమైన నటనతో పాత్రలో ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకత. ఐశ్వర్య రాజేశ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ వైపు నుంచి అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానుల కోసం ఆమె చేసిన సినిమానే 'డియర్'. జీవీ ప్రకాశ్ కుమార్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన విడుదలైంది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నెల తిరక్కుండానే 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ  .. మలయాళ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అర్జున్ (జీవీ ప్రకాశ్ కుమార్) ఓ మధ్యతరగతి యువకుడు. అతని చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. తల్లి లక్ష్మి (రోహిణి) అన్నయ్య చరణ్ (కాళీ వెంకట్) వదిన కల్పన .. ఇది అతని కుటుంబం. అన్నయ్య సొంతంగా ఒక ఫ్యాక్టరీని రన్ చేస్తూ ఉంటాడు. తండ్రి ఇల్లు వదిలేసి వెళ్లిన కారణంగా, ఆ అన్నదమ్ములిద్దరూ ఎన్నో కష్టాలు పడతారు. అందువలన ఆ ఇద్దరికీ కూడా తండ్రిపై కోపం ఉంటుంది. లక్ష్మి మాత్రం తన భర్త గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. 

అర్జున్ ఒక న్యూస్ ఛానల్ లో పని చేస్తూ ఉంటాడు. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయాలనీ, అది తన తల్లి చూసి ఆనందించాలనేది అతని కోరిక. ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ, చిన్నపాటి శబ్దానికి కూడా వెంటనే మెలకువ వచ్చేయడం అతనికి ఉన్న సమస్య. దానిని ఎలా అధిగమించాలో తెలియక అతను సతమతమవుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఇంట్లో వాళ్లంతా కలిసి అతనికి దీపిక (ఐశ్వర్య రాజేశ్)తో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు.

దీపిక విషయానికి వస్తే .. ఆమెది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. తల్లి .. తండ్రి .. తను .. ఇదే ఆమె కుటుంబం. దీపికకి ఒక సమస్య ఉంటుంది. నిద్రలో ఆమె గురకపెడుతుంది. పెళ్లి అయిన తరువాత ఎలాంటి సమస్యలు రాకూడదని భావించి, పెళ్లి చూపుల్లోనే ఆమె అబ్బయిలకు ఆ విషయం చెబుతూ ఉంటుంది .. అక్కడే సంబంధాలు తప్పిపోతుంటాయి. అలాంటి సమయంలోనే అర్జున్ తో పెళ్లి చూపులు జరుగుతాయి. తల్లి మందలించడం వలన, తన సమస్యను అర్జున్ దగ్గర ఆమె దాచేస్తుంది. అర్జున్ కూడా తన సమస్య గురించి ఆమెతో ప్రస్తావించడు. 

ఇద్దరికీ కూడా వివాహం జరుగుతుంది. ఫస్టు నైట్ రోజున తన సమస్యను అర్జున్ బయటపెడతాడు. దాంతో తన గురక విషయం చెప్పడానికి దీపిక భయపడుతుంది. ఆ రాత్రంతా నిద్రకేపోకూడదని అనుకుంటుంది. కానీ నిద్ర ఆపుకోలేక ఫస్టు నైట్ రోజునే బయటపడిపోతుంది. ఆమె గురక చూసి అర్జున్ టెన్షన్ పడిపోతాడు. నిద్రలేకపోతే తన హెల్త్ దెబ్బతింటుందని ఆమెతో చెబుతాడు. దాంతో ఒకరోజు ఒకరు నిద్రపోతే .. మరొకరు మెలకువతో ఉండాలని ప్లాన్ చేసుకుంటారు.     
   
 నిద్రలేమి వలన అర్జున్ తన ఆఫీసులో అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది .. ఉద్యోగాన్ని  కోల్పోవలసి వస్తుంది. దాంతో అతను తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. దీపిక నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తాను గర్భవతినని ఆమె చెబుతున్నా అతను వినిపించుకోడు. ఒక వైపున అర్జున్ తో ఇబ్బందిపడుతున్న దీపిక, తన అత్తగారి మనసు తెలుసుకుని ఆమె దగ్గరికి మావగారిని తీసుకురవాలని నిర్ణయించుకుంటుంది. అర్జున్ తో ఆమెకి విడాకులు జరిగిపోతాయా? మావగారిని ఆ ఇంటికి తిరిగి తీసుకురావాలనే దీపిక ప్రయత్నం నెరవేరుతుందా? అనేది మిగతా కథ.

చిన్నపాటి శబ్దానికి నిద్రలేచిపోయే భర్త .. గురక సమస్య ఉన్న భార్య .. ఈ ఇద్దరి చుట్టూ తిరిగే కథనే ఈ సినిమా. కొత్తగా పెళ్లైన జంటలో అందం .. ఆకర్షణ .. ఆశలు .. ఇవన్నీ కూడా ఒకరి బలహీనతలు ఒకరికి కనిపించనీయవు. ఒకవేళ ఏదైనా ఒక సమస్య వీటన్నింటినీ డామినేట్ చేసి ముందుకు వెళ్లిందంటే ఆ సమస్య స్థాయి చాలా తీవ్రంగా ఉందనుకోవాలి. ఇక్కడ అర్జున్ కి తనభార్య అంటే ఇష్టమే .. కానీ ఆమె గురకను భరించలేనని ఫిక్స్ అవుతాడు. అలవాటు చేసుకోవడానికి ట్రై చేయమని ఆమె అంటే అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. 

కొత్తగా పెళ్లైన జంట మధ్య గొడవలు కూడా ముచ్చటగానే అనిపిస్తాయి .. అలకలు కూడా అందంగానే కనిపిస్తాయి అనుకుని ఈ సినిమా చూడాలనుకోవడం సహజం. కానీ హీరో - హీరోయిన్ జంటను మధ్యలో వదిలేసి, హీరోయిన్ అత్తా మామలను కలపడం వైపు దర్శకుడు పరిగెత్తాడు. కొత్త జంట విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే, హీరో తల్లి పాతికేళ్ల క్రితం తనని వదిలేసి వెళ్లిన భర్తను గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆమె కన్నీళ్లు తుడవడానికి ఇదే కోడలు రంగంలోకి దిగుతుంది.

కొత్తగా కాపురం మొదలెట్టిన ఆలుమగల అల్లరి .. అలకలను చూడాలనుకున్నవారికి, ఆ ఇద్దరూ కలిసి తమ పెద్దవాళ్లను కలపడానికి ప్రయత్నించడం అసహనాన్ని కలిగిస్తుంది. ప్రధానమైన కథలో పండవలసిన వినోదం .. వండవలసిన ఎమోషన్ ను సరైన సమయంలో వదిలేసి దర్శకుడు వేరే ట్రాక్ లోకి వెళ్లడమే లోపంగా కనిపిస్తుంది. కామెడీ .. రొమాన్స్ .. పాటల వైపు నుంచి కూడా ఆడియన్స్ ను మెప్పించడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు.

జగదీశ్ ఫొటోగ్రఫీ .. జీవీ ప్రకాశ్ సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి .. రుకేశ్ ఎడిటింగ్ ఓకే. కథలో కొత్తదనం లేకపోవడం .. వినోదపరమైన అంశాలను పట్టించుకోకపోవడం .. స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండటం .. సన్నివేశాలు ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడం అసంతృప్తిని కలిగిస్తాయి. ఐశ్వర్య రాజేశ్ మంచి ఆర్టిస్ట్ .. కథపై సరైన కసరత్తు జరగకపోవడం వలన, ఆమె కూడా ఏమీ చేయలేకపోయింది. మొదటి ఎత్తుకున్న పాయింట్ చుట్టూ, లవ్.. రొమాన్స్ .. కామెడీ .. మంచి బీట్స్  అల్లుకుని ఉంటే, ఈ సినిమా మరింత బెటర్ గా ఉండేదేమో. 

Movie Name: Dear

Release Date: 2024-04-29
Cast: G V Prakash Kumar, Aishwarya Rajesh, Rohini, Kaali Venkat, Ilavarasu, Thalaivasal Vijay
Director: Anand Ravichandran
Producer: Varun Tripuraneni -Abhishek
Music: GV Prakash Kumar
Banner: Nutmeg Produtions

Dear Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews