'చుండూరు పోలీస్ స్టేషన్' (ఆహా) మూవీ రివ్యూ!

  • మలయాళంలో హిట్ కొట్టిన 'నాయట్టు'
  • రాజకీయం .. రౌడీయిజం .. పోలీస్ వ్యవస్థ చుట్టూ తిరిగే కథ
  • కథ .. స్క్రీన్ ప్లే ప్రధానమైన బలం 
  • ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే కంటెంట్ 
  • కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా  

పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ జోనర్ కి ఒక కొత్త పాయింటును యాడ్ చేస్తూ, దర్శకుడు మార్టిన్ ప్రకట్ మలయాళంలో ఒక సినిమాను రూపొందించాడు .. ఆ సినిమా పేరే 'నాయట్టు'. 2021 ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమా విడుదలై అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇదే సినిమాను శ్రీకాంత్ హీరోగా 'కోట బొమ్మాళి పీఎస్' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో 'నాయట్టు' సినిమా తెలుగు వెర్షన్ ఈ రోజు నుంచి 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

మణి (జోజు జార్జ్) ఒక పోలీస్ స్టేషన్ లో ఏఎస్ ఐగా  విధులు నిర్వహిస్తుంటాడు. అతనికి టీనేజ్ కి వచ్చిన ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి సంప్రదాయ నృత్యంలో మంచి పేరు తెచ్చుకోవాలని అతను కలలు కంటూ ఉంటాడు. అదే పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ గా సునీత (నిమిషా సజయన్) పని చేస్తూ ఉంటుంది. తండ్రిలేని కుటుంబాన్ని ఆమె ఒంటి చేత్తో ఈదుతూ ఉంటుంది. అయితే దూరపు బంధువుల నుంచి ఆమె కాస్త ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటుంది.

ఇక అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా ప్రవీణ్ ( కుంచాకో బోబన్) జాయిన్ అవుతాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకుంటూనే అతను డ్యూటీకి హాజరవుతూ ఉంటాడు. బై ఎలక్షన్స్ దగ్గర పడటంతో ఆ ప్రాంతమంతా అదే హడావిడి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ లోకల్ రౌడీ బిజూ .. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ, తన హవా కొనసాగిస్తూ ఉంటాడు. బిజూ వెనక అతని సామాజిక వర్గం ఉండటంతో, ఓట్ల కోసం రాజకీయ నాయకులు అతని ఆగడాలను వెనకేసుకు వస్తుంటారు. 
   
అలాంటి బిజూ నిర్లక్ష్య ధోరణి పట్ల మణి - ప్రవీణ్ మండిపడతారు .. అతనిని సెల్లో వేస్తారు. అయితే అతని వెనక ముఖ్యమంత్రి ఉండటం వలన, బిజూ వెంటనే బయటికి వస్తాడు. ఆ రోజు రాత్రి మణి .. ప్రవీణ్ .. సునీత ఓ ఫంక్షన్ కి వెళ్లి పోలీస్ జీప్ లో తిరిగి వస్తుంటారు. మణి తాగి ఉండటం వలన అతని మేనల్లుడు రాహుల్ జీప్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒక టర్నింగ్ లో బిజూ స్నేహితుడు జయన్ ను పోలీస్ జీప్ ఢీ కొడుతుంది. ఆ సమయంలో జీప్ డ్రైవ్ చేస్తున్న రాహుల్ పారిపోతాడు. 

జయన్ ను మణి వాళ్లు హాస్పిటల్ కి తీసుకుని వెళతారు. ఆ సమయంలో బిజూ వాళ్లు వేరే పనిపై హాస్పిటల్ దగ్గరే ఉంటారు. జయన్ చనిపోయాడని తెలిసి .. కావాలనే మణి - ప్రవీణ్ - సునీత అతణ్ణి హత్య చేశారని భావించి వెంటపడతారు. జరిగింది డిపార్టుమెంటుకు చెప్పడానికి మణి వాళ్లు ప్రయత్నిస్తారు. అయితే ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒత్తిడి ఉండటంతో, డిపార్టుమెంటువారు మణి వాళ్లను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తారు. దాంతో మణి - ప్రవీణ్ - సునీత అక్కడి నుంచి తప్పించుకుంటారు. 

ముగ్గురు పోలీస్ లు ఊళ్లో నుంచి బయటపడతారు గానీ ఎక్కడికి వెళ్లాలనేది తెలియదు. ఓట్ల కోసం అధికారంలో ఉన్నవారు ముగ్గురు పోలీసులను బాధితులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఉంటారు. ఆ పోలీసులను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ ను రంగంలోకి దింపుతారు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఈ కేసు నుంచి బయటపడతారా? కుటుంబానికి అండగా .. సమాజం పట్ల నిజాయితీగా నిలబడాలనే వారి కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ. 

సాధారణంగా నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులు వెంటపడుతూ ఉంటారు. అలా కాకుండా పోలీసులను బంధించడానికి పోలీసులే వెంటపడే కథ ఇది. ఓట్ల కోసం రాజకీయనాయకులు ఆడే ఆటలో .. వాళ్ల నీడలో రోజులు నెట్టుకొచ్చే అధికారుల స్వార్థానికి, నిజాయితీ పరులైన పోలీస్ అధికారులు ఎలా బలైపోతుంటారు? అనేది ఆసక్తికరంగా అందించిన కథ ఇది. చాలా తక్కువ పాత్రలతో ఈ సందేశాన్ని దర్శకుడు ఆడియన్స్ కి బలంగా కనెక్ట్ చేయగలిగాడు. 

డబ్బు కోసం నీతి తప్పడం .. మాట తప్పడం కొంతమందికి చాలా తేలికైన విషయం. ఎదుటివారిలోని నిజాయితీని బ్రతికించడం కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడేవారు మరికొందరు. ఈ రెండు స్వభావాల మధ్య  .. సంఘర్షణల మధ్య నడిచే కథ ఇది .. నలిగే కథ ఇది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ఈ కథ చకచకా మలుపులు తీసుకుంటుంది. చివరికి ఎమోషనల్ గా హార్ట్ ను టచ్ చేస్తూ, సరైన ముగింపుతో సంతృప్తిని ఇస్తుంది.

బలమైన కథ .. ఆసక్తికరమైన కథనం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. షిజూ ఖాలిద్ ఫొటోగ్రఫీ .. విష్ణు విజయ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. లొకేషన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనే చెప్పాలి. రంగులు మార్చుకునే రాజకీయాలు .. వాళ్ల అండ చూసుకుని బలం పుంజుకునే రౌడీయిజం .. వాళ్లకి సహకరించే అవినీతి పోలీస్ అధికారులతో పాటు, నితీకి నిలబడి ..  ప్రాణాలను సైతం లెక్కచేయని పోలీస్ అధికారులను కూడా పరిచయం చేసే ఈ సినిమాను, కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు. 


Movie Name: Nayattu

Release Date: 2024-04-26
Cast: Joju George, Kunchako Boban, Nimisha Sajayan, Jaffar Idukki
Director: Martin Prakkat
Producer: Ranjith
Music: Vishnu Vijay
Banner: Gold Coin Motion Picture Company

Nayattu Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews