'చారి 111' - (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • 'చారి 111' గా కనిపించే వెన్నెల కిశోర్
  • ఆయన పాత్రను సరిగ్గా డిజైన్ చేయని డైరెక్టర్ 
  • కంటెంట్ పై గట్టిగా జరగని కసరత్తు 
  • సిల్లీ కామెడీతో నడిచే సీన్స్  
  • కాస్త బెటర్ గా అనిపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్  

వెన్నెల కిశోర్ ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అవకాశాన్ని బట్టి హీరోగా కనిపిస్తూనే వస్తున్నాడు. అలా ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'చారి 111'. మార్చి 1వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రధానమంత్రి అధ్వర్యంలో కొంతమంది నిజాయతీ పరులైన అధికారులతో సీక్రెట్ ఆపరేషన్ ఏజన్సీని మొదలుపెడతారు. ఈ విషయం ప్రధానికి అత్యంత సన్నిహితులైన కొందరికి తప్ప మరెవరికీ తెలియదు.  ఈ సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించే సంస్థ పేరే 'రుద్రనేత్ర'. ప్రసాద్ రావు (మురళీశర్మ) నేతృత్వంలో .. హైదరాబాద్ నుంచే ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుంది. అలాంటి ఈ సంస్థలో చారి 111 ( వెన్నెల కిశోర్) ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. 

చారి కాస్త గడుసుదనం ఉన్న యువకుడు. ఆకతాయి పనుల కారణంగా ఆఫీసర్ రావుతో ఎప్పుడూ చీవాట్లు తింటూ ఉంటాడు. సస్పెన్షన్ లో ఉన్న అతను హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో హైదరాబాదులోని ఒక షాపింగ్ మాల్ లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ కేసును సాధ్యమైనంత త్వరగా పరిశోధించమని రావుపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అతను 'చారి 111' ను మళ్లీ రంగంలోకి దింపుతాడు. అతనికి అసిస్టెంట్ గా బంటీ (తాగుబోతు రమేశ్) ఉంటాడు.

 హైదరాబాదులో జరిగింది హ్యూమన్ బాంబు బ్లాస్ట్ లా అనిపించినప్పటికీ, ఒక రకమైన కెమికల్ వెపన్ కారణంగా అలా జరిగిందని పరిశోధనలో తెలుస్తుంది. క్యాప్సిల్ వంటి ఒక పదార్థాన్ని లోపలి తీసుకున్నవారు, కొంతసేపటి తరువాత బాంబ్ లా పేలిపోతారని నిర్ధారణ అవుతుంది. ఒక రకంగా ఇది కెమికల్ వార్ వంటిదనే మాట వినగానే ప్రసాదరావు కంగారుపడిపోతాడు. అయితే ఈ బ్లాస్ట్ వెనుక రావణ్ (చైతన్య) ఉండొచ్చుననే అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు.  

రావణ్ గురించి అతని టీమ్ ఆసక్తికరంగా ప్రసాద్ రావుని అడుగుతుంది. అప్పుడు తల్లీ కొడుకులుగా రావణ్ .. అతని తల్లిని గురించి ప్రసాదరావు ప్రస్తావిస్తాడు. తన తల్లి మరణంతో రావణ్ లో క్రూరత్వం పెరిగిపోయిందనీ, అందువలన దేశం మొత్తాన్ని శత్రువుగా భావించి విధ్వంసాన్ని సృష్టించే పనిలో ఉన్నాడని చెబుతాడు. తాను ఆర్మీలో పనిచేసేటప్పుడు తన టీమ్ చేతిలోనే ఆమె ప్రాణాలను కోల్పోయిందని అంటాడు.   

రావణ్ ఇప్పుడు పగతో రగిలిపోతూ ఉండటం వలన, తామంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రసాదరావు చెబుతాడు. దాంతో రావణ్ సంగతి చూసేందుకు చారి ధైర్యంగా రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? రావణ్ తల్లి ఏ కారణంగా ఆర్మీ జవాన్ల చేతిలో మరణిస్తుంది? ఆమెకీ .. ప్రస్తుతం జరుగుతున్న కెమికల్ వార్ కి మధ్య సంబంధం ఏమిటి? ఈ సంస్థ రహస్య కార్యకలాపాలు రావణ్ కి ఎలా తెలుస్తున్నాయి? అనేది మిగతా కథ. 

దర్శకుడు కీర్తికుమార్ కి రెండు మూడు సినిమాలకి పనిచేసిన అనుభవం ఉంది. తన సినిమాలకి తానే కథను రెడీ చేసుకునే టాలెంట్ ఉంది. సీక్రెట్ ఏజెంట్ తరహా కథలను కామెడీగా నడిపించే అవకాశం కూడా ఉండటంతో ఆయన ఈ వైపు వచ్చాడు. చారి పాత్రలో వెన్నెల కిశోర్ ను మరోసారి హీరోగా చూపించాడు. హాస్య ప్రధానమైన ఈ సినిమా, ఆడియన్స్ ను నవ్వించడంలో సఫలీకృతమైందా అంటే, కాలేదనే చెప్పాలి. 

వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ను నవ్విస్తాయి. అయితే కథలో విషయం ఉండాలి .. ఆయన పోషించిన పాత్రలో దమ్ము ఉండాలి అంతే. కథలో .. పాత్రలో విషయం ఉంటే, ఆ పాత్రలు చేసే పనులకు ఆడియన్స్ నవ్వుతూ ఉంటారు. లేదంటే ఆ పాత్రలు నవ్వించడానికి నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. అలా వెన్నెల కిశోర్ పడిన పాట్లు మనకి ఈ సినిమా తెరపై కనిస్తాయి. 

కథ కామెడీ ప్రధానమైనదే అయినప్పటికీ, కంటెంట్ లో విషయం ఉండాలి. కథానాయకుడు తన ప్రయత్నం తాను చేస్తూ వెళుతుండగా, సందర్భాన్ని బట్టి నవ్వుతూ ఆడియన్స్ అతనిని ఫాలో అవుతూ ఉండాలి. కామెడీ సినిమానే కథా అని చెప్పేసి ఆకతాయి వేషాలతో అల్లరి చేయిస్తే ఆడియన్స్ అసహనానికి లోనవుతారు. ఈ సినిమా విషయంలో జరిగింది అదే. స్వయంగా ప్రధానమంత్రి జోక్యం ఉన్న ఒక సీక్రెట్ ఏజెన్సీ లో, చాలా ముఖ్యమైన బాధ్యతను ఇంత ఆకతాయికి ఎలా అప్పగించారు? అనే డౌటు సగటు ప్రేక్షకుడికి రాకుండా ఉండదు.

కథ మొత్తంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త బెటర్. హీరో నిర్వహించే ఆపరేషన్ లో ఎలాంటి ట్విస్టులు లేకపోవడం .. కథ ముందుకు వెళుతున్న కొద్దీ కామెడీ పాళ్లు తగ్గిపోవడం ఒక మైనస్ గా కనిపిస్తుంది. కంటెంట్ లో విషయం లేకపోవడం వలన వెన్నెల కిశోర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం .. రిచర్డ్ కెవిన్ .. కాశీష్ గ్రోవర్ ఎడిటింగ్ కంటెంట్ బాగుంటే రాణింపుకు వచ్చేవి. కథపై సరైన కసరత్తు లేకపోవడమే ప్రేక్షకులను నిరాశపరిచే  ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. 

Movie Name: Chari 111

Release Date: 2024-04-05
Cast: Vennela Kishore, Muralisharma, Samthuktha Vishvanathan, Pavani Reddy, Sathya
Director: TG Keerthi Kumar
Producer: Aditi Soni
Music: Simon K King
Banner: Barkat Studoos

Chari 111 Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews