'లంబసింగి' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • మార్చి 15వ తేదీన విడుదలైన సినిమా
  • నక్సలైట్ నేపథ్యంలో నడిచే ప్రేమకథ  
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • ఆసక్తికరంగా లేని కథాకథనాలు 
  • నీరసంగా నడిచే సన్నివేశాలు 

నక్సలైట్ నేపథ్యంలో సాగే కథతో ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. పోలీసులకు .. నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సన్నివేశాలతో చాలానే కథలు పలకరించాయి. అలాంటి ఒక నేపథ్యంలో రూపొందిన సినిమానే 'లంబసింగి'. మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పడు చూద్దాం. 

వీరబాబు ( భరత్ రాజ్) కి కానిస్టేబుల్ గా ఫస్టు పోస్టింగ్ 'లంబసింగి'లో పడుతుంది. దాంతో అతను ఆ ఊరికి చేరుకుంటాడు. అక్కడి సంత బజారులో అతను హరిత ( దివి)ని చూస్తాడు. తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి మళ్లీ ఎక్కడ తారసపడుతుందా అని చూస్తూ ఉంటాడు. నక్సలైట్ నాయకుడిగా చాలా కాలం పాటు దళంలో పనిచేసిన కోనప్ప (వంశీరాజ్) ఎస్ పీ (నిఖిల్) ముందు లొంగిపోతాడు. ప్రతిరోజు అతను పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టవలసి ఉంటుంది. 

కోనప్ప కాలికి గాయమైందని తెలిసి, అతని సంతకం తీసుకురావడానికి వీరబాబు వెళతాడు. తాను సంత బజారులో చూసిన అమ్మాయి .. కోనప్ప కూతురనే విషయం అప్పుడే అతనికి తెలుస్తుంది. అప్పటి నుంచి అతను ఆమెతో పరిచయం పెంచుకోవడం కోసం, కోనప్ప ఇంటికి `వెళ్లడమే తన పనిగా పెట్టుకుంటాడు. విద్య - వైద్యం విషయంలో హరిత అందరికీ సాయపడుతూ ఉండటం చూసిన వీరబాబు, ఆమెను మరింతగా ఆరాధించడం మొదలుపెడతాడు.

పెళ్లంటూ చేసుకుంటే హరితనే చేసుకోవాలని బలంగా నిర్ణయించుకుంటాడు. తన మనసులోని మాటను తన తల్లిదండ్రులకు కూడా చెబుతాడు.  సమయం చూసి హరితకి హన ప్రేమ విషయం చెబుతాడు. అందుకు ఆమె పెద్దగా స్పందించకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎలాగైనా ఒప్పించాలనే పట్టుదలతో ఆమె చుట్టూ తిరగడం మొదలుపెడతాడు. డిపార్టుమెంటులో ఒకరిద్దరు సున్నితంగా హెచ్చరించినా అతను పట్టించుకోడు.         
 
ఆ ఊరు ఎమ్మెల్యే  సోమ్లానాయక్ ఎన్నికలలో గెలవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఊహించని విధంగా అతను ఒక బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన నక్సలైట్లు, అక్కడున్న ఆయుధ సామాగ్రిని ఎత్తుకుపోతారు. ఆ సమయంలో డ్యూటీలోనే ఉన్న వీరబాబు ఏమీ చేయలేకపోతాడు. ఫలితంగా అతనిపై సస్పెన్షన్ వేటు పడుతుంది. అపుడు వీరబాబు ఏం చేస్తాడు? ఎమ్మెల్యే హత్యకి కారకులెవరు? హరిత - వీరబాబు ప్రేమ .. పెళ్లి వరకూ వెళుతుందా? అనేది మిగతా కథ.

దర్శకుడు నవీన్ గాంధి రాసుకున్న కథ ఇది. ఒక పోలీస్ .. ఒక నక్సలైట్ ఫ్యామిలీలోని యువతి ప్రేమలో పడటం వలన ఏం జరుగుతుంది? అనేదే ప్రధానమైన కథాంశం. పోలీసులకు .. నక్సలైట్లకు మధ్య జరిగే ఈ ప్రేమకథకు 'లంబసింగి' ప్రధానమైన వేదిక. 'లంబసింగి' ఆహ్లదకరమైన వాతావరణం .. అక్కడి ప్రకృతి ఈ ప్రేమకథకు చాలా హెల్ప్ అవుతుందని భావించడం సహజం. కానీ ఈ కథకి ప్రకృతిని కనెక్ట్ చేయలేకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. 

ఇక కథానాయకుడు ఎంతో ప్యాషన్ తో పోలీస్ జాబ్ లో చేరతాడు. అతనికిగల ఉత్సాహమే అతనిని 'లంబసింగి' వంటి ప్రాంతానికి తీసుకొస్తుంది. కానీ బస్సు దిగుతూనే తాను వచ్చిన పని మరిచిపోయి లవ్ లో పడే బలహీనుడు. ఒక పక్కన నక్సలైట్ పై తోటి పోలీసులు ఎటాక్ చేస్తుంటే తన ప్రేమ గురించి ఆలోచన చేస్తుంటాడు. తన సస్పెండ్ అయినా పట్టించుకోడు .. ఆ అమ్మాయి తండ్రి నక్సలైట్ నాయకుడైనా పట్టించుకోడు. 

ప్రేమంటే అంతే మరి .. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనీయదు .. కళ్లు హెరుచుకునే ఉన్నా ఏమీ కనబడనీయదు అనుకుందామంటే, అంత గాఢమైన ప్రేమ సన్నివేశాలు నాయకా నాయికల మధ్య కనిపించవు. ప్రధానమైన పాత్రలలో ఏ పాత్ర ఏదీ సాధించకపోవడం ఆడియన్స్ ను మరింత నీరు గార్చేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫరవాలేదనుకుంటే, క్లైమాక్స్ తేలిపోతుంది. హీరోకి ఇదే ఫస్టు మూవీ అనుకుంటా. యాక్టింగ్ రాక తాను ఇబ్బంది పడ్డాడు. ప్రేక్షకులను ఇబ్బందిపెట్టాడు. దర్శకుడు చాలా పాత్రల నుంచి సరైన అవుట్ పుట్ వచ్చేవరకూ వెయిట్ చేయలేదు. 

నామమాత్రం కథ .. అంతంత మాత్రం స్క్రీన్ ప్లే. జరగబోయేదేవిటో ఆడియన్స్ ముందుగానే గ్రహిస్తూ ఉంటారు .. వాళ్ల అంచనానే ప్రతిసారి కరెక్ట్ అవుతూ వస్తుంటుంది. బలహీనమైన కథకు తన ఫొటోగ్రఫీతో కొంతవరకూ సపోర్ట్ చేయడానికి బుజ్జి ప్రయత్నించాడు. ఇక ధృవన్ బాణీలు కొంతవరకూ ఫరవాలేదు. కథకు ఎదురీదలేకపోతున్న ప్రేక్షకులకు చిన్నపాటి రిలీఫ్ ను ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ కూడా కథకి తగినట్టుగానే ఉంది. 

పోరాటం నేపథ్యంలో సాగే ప్రేమకథ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడు ముదురు ప్రేమకథలను ఆడియన్స్ అంగీకరించే పరిస్థితి లేదనేది వాస్తవం.  ప్రేమకు ప్రధానమైన బలం ప్రకృతి .. దానితో ముడిపడిన ఫీల్ .. వాటిని ఈ కథ వదిలేసింది. ఇక ప్రేమకథల్లో ఉండవలసింది త్యాగం .. అది ఈ కథలో శూన్యం. ఎమోషన్స్ పరంగా ఈ కథ ఎక్కడా కనెక్ట్ కాలేకపోయింది. ఏ పాత్రకి ఎలాంటి ప్రయోజనం లేకుండా ముగించడం, సగటు ప్రేక్షకుడికి కలిగే అతిపెద్ద అసంతృప్తి.

Movie Name: Lambasingi

Release Date: 2024-04-02
Cast: Bharath, Divi, Vamshi Raj, Kittayya, Nikhil, Janardhan, Anuradha
Director: NaveenGandhi
Producer: Anand
Music: Dhruvan
Banner: Concept Film Prodution

Lambasingi Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews