'అబ్రహం ఓజ్లర్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • జయరామ్ కథానాయకుడిగా రూపొందిన 'అబ్రహం ఓజ్లర్'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
  • కీలకమైన పాత్రను పోషించిన మమ్ముట్టి 
  • ఉత్కంఠభరితంగా సాగని కథాకథనాలు 
  • ఎక్కడా కనిపించని యాక్షన్ .. ఎమోషన్  

మలయాళంలో సీనియర్ స్టార్ గా జయరామ్ కి మంచి ఇమేజ్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే. ఆయన పోలీస్ ఆఫీసర్ గా చేసిన 'అబ్రహం ఓజ్లర్' సినిమా , జనవరి 11వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాలో, మమ్ముట్టి కీలకమైన పాత్రను పోషించడం విశేషం. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే తెలుగుతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

అబ్రహం ఓజ్లర్ (జయరామ్) కేరలోని త్రిస్సూర్ లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన తన భార్య అనీషా .. కొత్తూరు జెన్నీతో కలిసి సరదాగా మున్నార్ వెళతాడు. అతను లేని సమయంలో అతని భార్య పిల్లలను వినీత్ (అర్జున్ అశోకన్) అనే వాడు చంపేస్తాడు. ఆ తరువాత పోలీసులకు దొరికిపోతాడు. ఓజ్లర్ భార్య బిడ్డలను తాను చంపినట్టుగా గుర్తు ఉందనీ, అయితే ఆ శరీర భాగాలను ఏం చేశాననేది తనకి గుర్తు లేదని వినీత్ చెబుతాడు. అంతకుముందు డ్రగ్స్ తీసుకోవడమే అందుకు కారణమని అంటాడు. 

భార్యాబిడ్డలను కోల్పోయిన ఓజ్లర్, జాబ్ కి రిజైన్ చేయాలనుకుంటే, పై అధికారులు వారిస్తారు. తన భార్యాబిడ్డలను ఏం చేసింది కనుక్కోవడానికి మూడేళ్లుగా అతను జైల్లో ఉన్న వినీత్ ను కలుసుకుంటూనే ఉంటాడు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. హంతకుడు ప్రతి డెడ్ బాడీ దగ్గర బర్త్ డే గ్రీటింగ్ పెట్టేసి వెళుతూ ఉంటాడు. డాక్టర్ లు సర్జరీస్ కి ఉపయోగించే పదునైన పరికరాన్ని హంతకుడు వాడుతున్నాడనే విషయాన్ని గుర్తిస్తారు. హంతకుడు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్ గానీ .. టీజర్ గాని అయ్యుండొచ్చని భావిస్తారు. 

ఏసీపీ ఓజ్లర్ తన టీమ్ తో కలిసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పై ఫోకస్ చేస్తాడు. హత్యలు ఒక్కరే చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. అయితే హత్యకి గురైనవాళ్లలో ఒకరికి ఒకరికి మధ్య సంబంధాలేమైనా ఉన్నాయా? అనే సందేహం ఓజ్లర్ లో తలెత్తుతుంది. ఆ క్రమంలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అరుణ్ .. అతని అక్క సుజా (అనశ్వర రాజన్) పేర్లు తెరపైకి వస్తాయి. ఆ కేసు అనేక మలుపులు తిరుగుతూ, గతంలో గొంతు ఆపరేషన్ చేయించుకుని 'మాట' కోల్పోయిన కృష్ణదాస్ (సజూ కురుప్) దగ్గరికి వెళుతుంది. 

 ఈ కేసు విషయంలో అలెగ్జాండర్ (మమ్ముట్టి) జేవీ (జగదీశ్) శివకుమార్ (రఘునాథ్) సెల్వరాజ్ (రవి వెంకట్రామన్) పేర్లు తెరపైకి వస్తాయి. వీళ్లంతా ఎవరు? వీళ్లకి .. జరుగుతున్న వరుస హత్యలకు సంబంధం ఏమిటి? డాక్టర్ అరుణ్ - సుజా గతంలో ఏం జరిగింది? తన భార్యాబిడ్డలను వినీత్ ఏం చేశాడనేది తెలుసుకోవడానికి ఓజ్లర్ చేసే ప్రయత్నం ఫలిస్తుందా? అనే సందేహాలను రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.

మలయాళంలో క్రైమ్ కథలకు ఆ భాషలోనే కాదు, ఇతర భాషల్లోను మంచి క్రేజ్ ఉంది. ఈ తరహా కథలను ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో వాళ్ల స్టైల్ ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అందువలన వారానికి ఒకటైనా క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లు థియేటర్లకు వస్తుంటాయి. అలాంటి ఒక కథనే రణధీర్ కృష్ణన్ తయారు చేశాడు. ఈ సినిమాకి మిథున్ మాన్యువల్ దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి చివరివరకూ వరుస హత్యకేసుల చుట్టూనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. 

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను మలయాళ దర్శకులు నడిపించే విధానం చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. వాళ్లకి ఈ జోనర్ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. అందువలన ఈ తరహా కథలు ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. అలా వచ్చిన ఈ సినిమా,  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోగలిగిందా? అంటే లేదనే చెప్పాలి. అందుకు కారణం కథ .. కథనం .. కీలకంగా కనిపించే ఫ్లాష్ బ్యాక్ అనే చెప్పవలసి ఉంటుంది. 

వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది తెలుసుకునే దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఆడియన్స్ ఆశించే స్పీడ్ లో అది ఉండదు. ఎవరు చేశారనేది గంటన్నర చూపించిన దర్శకుడు .. ఎందుకు చేశారనేది గంటసేపు చూపించాడు. హంతకుడు ఎవరనేది తెలిసిపోయిన తరువాత, ఇక ఎందుకు చేశాడో తెలుసుకోవడానికి ప్రేక్షకుడు అంత సమయాన్ని కేటాయించలేడు. పైగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా లేకపోతే మరింత బోర్ ఫీలవుతాడు, ఈ కథ విషయంలో జరిగింది అదే. 

ఇక ప్రస్తుతం జరిగే కథలో జయరామ్ .. మమ్ముట్టి ఉంటారు. ఎక్కువ నిడివి కలిగిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని ఆర్టిస్టులు పెద్దగా క్రేజ్ లేనివారు కావడం మరో మైనస్ గా అనిపిస్తుంది. అనశ్వర రాజన్ ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, తెరపై ఆమె కనిపించేది కొంతసేపే. పోలీస్ కథ అంటే యాక్షన్ .. ఎమోషన్ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ కథలో ఆ రెండూ కనిపించవు. కొన్ని చోట్ల ప్రేక్షకుడు కాస్త ఆలోచన చేసుకుని క్లారిటీకి రావలసి ఉంటుంది. 

జయరామ్ .. మమ్ముట్టి .. అనశ్వర రాజన్ గొప్ప ఆర్టిస్టులని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కానీ వాళ్ల పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు. ఫస్టాఫ్ కాస్త ఫరవాలేదనిపించినా, సెకండాఫ్ మరింత నీరసంగా నడుస్తుంది. మిథున్ ముకుందన్ నేపథ్య సంగీతం .. థేని ఈశ్వర్ ఫొటోగ్రఫీ ఫరవాలేదు.  సమీర్ మహ్మద్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై మరికాస్త దృష్టి పెడితే బాగుండేదనిపిస్తుంది.  ఈ సినిమా మలయాళంలో 40 కోట్లను వసూలు చేసింది. ఇది వాళ్లకి బాగా అలవాటైన జోనరే కానీ, అక్కడి నుంచి గతంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఈ కథ బలహీనంగానే కనిపిస్తుంది. 

Movie Name: Abraham Ozler

Release Date: 2024-03-20
Cast: Jayaram,Mammootty ,Anaswara Rajan,Arjun Ashokan,Anoop Menon,
Director: Midhun Manuel Thomas
Producer: Irshad M. Hassan
Music: Midhun Mukundan
Banner: Nerambokku - Manual Movie Makers

Abraham Ozler Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews