'తుండు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • పోలీస్ కథకు కామెడీ టచ్
  • బలంలేని ప్రధానమైన పాత్రలు  
  • బలహీనమైన కథాకథనాలు 
  • నిరాశ కలిగించే సాగతీత సన్నివేశాలు
  • సిల్లీ సీన్స్ తో మెప్పించలేకపోయిన కంటెంట్

మలయాళంలో బిజూ మీనన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 'రణం' .. 'ఖతార్నాక్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. ఆయన కథానాయకుడిగా నటించిన 'తుండు' సినిమా, ఈ ఫిబ్రవరి 16వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి, మలయాళంతో పాటు, తెలుగు .. కనడ భాషల్లోను ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.
 
కేరళలోని 'త్రిస్సూర్' పోలీస్ స్టేషన్ లో బేబి (బిజూమీనన్) కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్య సీనా (ఉన్నిమయ ప్రసాద్)  ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ ఉంటుంది. టీనేజ్ కి వచ్చిన కొడుకు స్కూల్ లో చదువుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ లో పై అధికారిగా శిబిన్ చంద్రన్ ( షైన్ టామ్ చాకో) ఉంటాడు. అతనికీ .. బేబీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. అతని కారణంగా బేబీ అనేక అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. ప్రమోషన్ కి సంబంధించిన టెస్ట్ రాసి పాస్ అయితే, అతని డిజిగ్నేషన్ మారుతుందని సహచరులు చెబుతూ ఉంటారు. 

అతని కొడుకు చిట్టీలు పెట్టి పరీక్ష రాస్తూ దొరికిపోతాడు. దాంతో బేబీని పిలిపించి ప్రిన్సిపాల్ చీవాట్లు పెడుతుంది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని రిక్వెస్ట్ చేసి వస్తాడు బేబి. కొడుకు చేసిన పనిని  అతను మరింత అవమానంగా భావిస్తాడు. స్టేషన్ లో పై అధికారి టార్చర్ నుంచి బయటపడాలంటే, ప్రమోషన్ కి సంబంధించిన టెస్ట్ రాయవలసిందేనని నిర్ణయించుకుంటాడు. అయితే 21 ఏళ్లనుంచి సర్వీస్ లో ఉన్న అతనికి, మళ్లీ పుస్తకం పట్టాలంటే బద్ధకం అనిపిస్తుంది. 

డిపార్టుమెంట్ నిర్వహించే పరీక్ష గనుక పెద్దగా ఎవరూ పట్టించుకోరనీ, అందువలన చీటీలు పెట్టి రాయమని సహచరులు బలంగా చెబుతారు. దాంతో ఎగ్జామ్ హాల్ కి చిట్టీలు తీసుకుని వెళ్లి రాయడం మొదలుపెడతాడు. స్క్వాడ్ గా వచ్చిన సత్యచంద్రన్ (బైజు) బేబిని పట్టుకుంటాడు. దాంతో ఆ సంఘటన మీడియాలో వచ్చేస్తుంది. అవమానభారంతో బేబీ ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? శిబిన్ టార్చర్ నుంచి బయటపడాలనే అతని కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.

దర్శకుడు రియాజ్ షరీఫ్ .. కనప్పన్ తో కలిసి రాసుకున్న కథ ఇది. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్, తనకి ఎదురవుతున్న అవమానాలకు కారణం తన స్థాయి తక్కువగా ఉండటమేనని భావిస్తాడు. తన స్థాయిని పెంచుకోవడానికి అతను చేసే ప్రయత్నాలతో నడిచే కథ ఇది. మొదటి నుంచి చివరివరకూ కథ ఒకే ఫ్లోలో వెళుతుంది. ఎక్కడా ఎలాంటి మలుపులు .. ట్విస్టులు కనిపించవు. భారీ పోలీస్ డైలాగులు వినిపించవు. అలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది అంతే. 

సాధారణంగా పోలీస్ కథలు అనగానే హీరోను చాలా పవర్ఫుల్ గా చూపిస్తారు. అతని స్పీడ్ .. డైలాగ్ చెప్పే రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పై అధికారులు సైతం అతణ్ణి చూసి కాస్త కంగారు పడతారు. అతను సస్పెన్షన్ లో ఉన్నా అనధికారికంగా కొన్ని బాధ్యతలను అతనికి అప్పగిస్తారు. క్లైమాక్స్ లో  అతను ఆడియన్స్ వైపుకు నడుచుకుంటూ వస్తుంటే, వెనక నుంచి అంతా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇలాంటి ఓక్ కాన్సెప్ట్ కి ఈ కథ పూర్తి భిన్నంగా నడుస్తుంది.

ఇక ఈ కథలో బలమైన విలన్ బయట నుంచి ఎవరూ ఉండరు. అలాగే కష్టతరమైన కేసును కథానాయకుడు ఛేదించడానికి అవకాశం లేకుండా అతణ్ణి ఒక సాధారణమైన కానిస్టేబుల్ గానే చూపిస్తూ వెళ్లారు. పై అధికారుల కారణంగా అవమానాలు .. అసంతృప్తితో కథానాయకుడి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఈ కారణంగా అతను ఎప్పుడు చూసినా డీలాపడిపోయి కనిపిస్తూ ఉంటాడు. కథానాయకుడైన పోలీస్ ఆఫీసర్ ను యాక్టివ్ గా మాత్రమే చూస్తూ వచ్చిన ఆడియన్స్ కి నిరాశను కలిగించే ప్రధానమైన అంశం ఇదే.

సాధారణంగా పోలీస్ డ్రామా జోనర్లో వచ్చే సినిమాలలో కథానాయకుడిని కామెడీగా చూపించే సాహసం చేయరు. అవసరమైతే అతని చుట్టూ ఉన్నవారిలో నుంచి అలాంటి కంటెంట్ ను రాబటే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సినిమాలో కథానాయకుడితో కాకుండా, అతను చేసే పనులలో నుంచి కామెడీని రాబట్టడానికి ప్రయత్నించారు.  వాటిలో కథానాయకుడు చిట్టీలు పెట్టి పరీక్షలు రాయడం .. పోలీస్ వ్యాన్ లో పొరపాటున టియర్ గ్యాస్ ప్రయోగం జరగడం .. పోలీస్ ట్రైనింగ్ డాగ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ మాత్రమే నవ్విస్తాయి.

పోలీస్ ట్రైనింగ్ డాగ్ చనిపోవడం .. పోలీస్ ట్రైనింగ్ డాగ్ ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లడం .. కథానాయకుడు చిట్టీలు పెట్టి పరీక్షలు రాయడం .. ఇలా సాగతీతగా కనిపించే సన్నివేశాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తాయి. నవ్వు రాకపోగా సిల్లీగా అనిపిస్తాయి. బిజూమీనన్ .. షైన్ టామ్ చాకో నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలిసిన పనిలేదు.  జింషీ ఖాలిద్ ఫొటోగ్రఫీ .. నబూ ఉస్మాన్ ఎడిటింగ్ ఫరవాలేదు. గోపీసుందర్ అందించిన నేపథ్య సంగీతం, కథకి తగినట్టుగా ఉంది.     

ఇక విలన్ గా షైన్ టామ్ చాకో పాత్ర వైపు నుంచి మంచి విలనిజాన్ని చూపించవచ్చు. కానీ దర్శకుడు ఆ పాత్రపై ఆ స్థాయిలో దృష్టిపెట్టలేదు. అలాగే బిజూ మీనన్ కి ఉన్న ఇమేజ్ కి భిన్నమైన పాత్రను ఎంచుకోవడం కూడా కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. కథానాయకుడు ఏదైనా సాధించి వచ్చి తానేమిటనేది చూపిస్తే ఆడియన్స్ కి ఉండే కిక్కు వేరు. కానీ సాధించేవరకు చేసే పోరాటం వరకూ మాత్రమే చూపించి వదిలేస్తే ఆడియన్స్ డీలాపడిపోతారు. ఈ సినిమా విషయంలో జరిగింది అదే. 

Movie Name: Thundu

Release Date: 2024-03-15
Cast: Biju Menon, Shine Tom Chacko, Unnimaya Prasad, Gokulan, Baiju, Raffi
Director: Riyas Shareef
Producer: Ashiq Usman - Jimshi Khalid
Music: Gopi Sundar
Banner: Ashiq Usman Productions

Thundu Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews