'షో టైమ్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • సినిమా నేపథ్యంలో నడిచే సిరీస్
  • వారసత్వ పోరాటం చుట్టూ తిరిగే కథ
  • ప్రధానమైన పాత్రను పోషించిన ఇమ్రాన్ హాష్మి   
  • అందుబాటులోకి వచ్చిన 4 ఎపిసోడ్స్ 
  • డీటేల్డ్ గా చెప్పడానికి ట్రై చేసిన డైరెక్టర్

గతంలో సినిమాకి సంబంధించిన రంగుల ప్రపంచం .. తెరవెనుక జరిగే నాటకీయ పరిణామాల నేపథ్యంలో భారీ సిరీస్ లు వచ్చాయి. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన మరో సిరీస్ 'షో టైమ్'. కరణ్ జొహార్ - అపూర్వ మెహతా నిర్మించిన ఈ సిరీస్ కీ, మిహిర్ దేశాయ్ - అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో ఈ సిరీస్ కి సంబంధించిన 4 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా 40 ఏళ్లుగా విక్టర్ ఖన్నా (నసీరుద్దీన్ షా) చక్రం తిప్పుతాడు. ఆయనకి వయసైపోవడంతో వారసుడిగా రఘు ఖన్నా ( ఇమ్రాన్ హష్మీ) రంగంలోకి దిగుతాడు. అయితే ట్రెండ్ పేరుతో ఇష్టం వచ్చిన సినిమాలను అతను నిర్మిస్తూ ఉండటం, విక్టర్ ఖన్నాకి అసంతృప్తిని కలిగిస్తుంది. అదే సమయంలో ఆ సంస్థ నుంచి వచ్చిన ఒక సినిమాను గురించి మహిక (మహిమ) విమర్శిస్తుంది. తాను పనిచేస్తున్న టీవీ ఛానల్ లో ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఆమె ఆ పనిచేస్తూ ఉంటుంది. 

అలా రఘు ఖన్నా సినిమాను గురించి విమర్శించిన కారణంగా, అతను ఆమెను జాబ్ లో నుంచి తీసేయిస్తాడు. జరిగింది తెలుసుకున్న విక్టర్ ఖన్నా, మహికను ఇంటికి పిలిపించి మాట్లాడతాడు. ఆ మరునాడే అతను ఆ స్టూడియోపై హక్కులను మహిక పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. తన మనవరాలు మహికకి బాధ్యతలను అప్పగిస్తూ 'విల్లు' రాస్తాడు. టీవీలో చూసిన తరువాతనే, తాను ఆయన మనవరాలిననే విషయం మహికకు తెలుస్తుంది. ఆ తరువాత తన తల్లికి కాల్ చేసి అసలు విషయం తెలుసుకుంటుంది. 

విక్టర్ ఖన్నా స్టూడియోకి, ఆయన రెండో భార్య కుటుంబానికి సంబంధించినవారు యజమానులు కావడాన్ని రఘు ఖన్నా తట్టుకోలేకపోతాడు. ఉన్న ప్రాజెక్టులు కొనసాగకుండా, కొత్త ప్రాజెక్టులకి సంబంధించిన ఒప్పందాలు జరగకుండా అడ్డుపడటం మొదలుపెడతాడు. అదే సమయంలో రఘు ఖన్నా కారణంగా గర్భవతి అయిన తరువాత అతని నిజస్వరూపం యాస్మిన్ ( మౌని రాయ్) కి అర్థమవుతుంది. ఇక స్టార్ హీరోతో ఉన్నప్పటికీ, తన కెరియర్ పట్ల మందిర (శ్రియ) అసంతృప్తిగా ఉంటుంది.

తమ సంస్థలో ఈగో ప్రొబ్లెమ్స్ కారణంగా ఆగిపోయిన '1857' సినిమాను తిరిగి పట్టాలెక్కించడానికి మహిక చాలా కష్టపడుతుంది. హీరో అర్మాన్ (రాజీవ్ ఖండేల్వెల్) ను .. దర్శకుడు సత్య కృష్ణన్ (నీరజ్ మాధవ్)ను ఒప్పిస్తుంది. సంస్థకి సంబంధించిన మిగతా భాగస్వాములను మెప్పిస్తుంది. ఈ సినిమాపై దెబ్బకొట్టడానికి రఘు ఖన్నా ఏం చేస్తాడు? ఫలితంగా మహిక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ. 

ఈ సిరీస్ .. సినిమా నేపథ్యంలో నడిచే ఒక వారసత్వ పోరాటంగా చెప్పుకోవాలి. స్టూడియో అధినేత అయిన ఒక నిర్మాత మొదటి భార్య తనయుడికీ, రెండో భార్య కుటుంబానికి చెందిన మనవరాలికి మధ్య జరిగే యుద్ధం ఇది. ఇక ఇండస్ట్రీలో అవసరాన్ని బట్టి .. అవకాశాలను బట్టి ఎవరు ఎలా మారతారనేది ఎవరూ చెప్పలేరు. అలాంటి ఒక వాతావరణాన్ని దర్శకుడు సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించాడు. 

 ఈ కథ అంతా ప్రధానమైన నాలుగు పాత్రల మధ్య కొనసాగుతూ ఉంటుంది. ఆ నాలుగు పాత్రలలో ఒక హీరో .. దర్శకుడు .. నిర్మాత .. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారసురాలు కనిపిస్తారు. అయితే ఈ నాలుగు ఎపిసోడ్స్ కూడా చాలా నిదానంగా .. నింపాదిగా నడుస్తాయి. ప్రతి ట్రాక్ ను దర్శకుడు డీటేల్డ్ గా చెబుతూ వచ్చాడు. కథనంలో ఎక్కడా వేగం కనిపించదు. ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ ఏ ట్రాక్ వైపు నుంచి కనిపించదు. నిర్మాణపరమైన విలువల విషయంలో మాత్రం వంక బెట్టడానికి లేదనే చెప్పాలి.

నసీరుద్దీన్ షా పాత్ర నిడివి తక్కువే అయినా, తన పాత్రతో ఆయన ఒక నిండుదనాన్ని తీసుకొచ్చాడు. ఇక ఇమ్రాన్ హష్మీ .. రాజీవ్ .. మౌనీ రాయ్ .. మహిమ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఈ నాలుగు ఎపిసోడ్స్ లో శ్రియ పోర్షన్ తక్కువే. వివేక్ షా ఫొటోగ్రఫీ .. ఆనంద్ నేపథ్య సంగీతం కథకి తగినట్టుగానే అనిపిస్తాయి. జూన్ నుంచి మిగతా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతాయనే క్లారిటీ ఇచ్చారు. 

రానున్న ఎపిసోడ్స్ కి ఈ ఎపిసోడ్స్ ను లీడ్ గానే భావించాలి. సినిమా సక్సెస్ అయితేనే థియేటర్లో నిలబడుతుంది. సినిమా సక్సెస్ అయితేనే దానికి పనిచేసినవారికి విలువ ఉంటుంది. ఇక్కడ ఎవరి కెరియర్ ను గురించి వారే ఆలోచన చేస్తారు. ఎదుటివారి పరిస్థితులను పట్టించుకునే అవకాశం ఉండదనే విషయాన్ని ఈ 4 నాలుగు ఎపిసోడ్స్ ద్వారా  చెప్పారు. కాకపోతే ఇదే విషయాన్ని రెండు ఎపిసోడ్స్ లో కూడా చెప్పచ్చునని అనిపించకమానదు.

Movie Name: Showtime

Release Date: 2024-03-08
Cast: Emraan Hashmi, Mouni Roy, Naseeruddin Shah, Mahima Makwana, Shriya Saran, Rajeev Khandelwal
Director: Mihir Desai- Archith Kumar
Producer: Karan Johar - Apoorva Mehta
Music: Anand
Banner: Dharmatic Entertainment

Showtime Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews