'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

మనసుపడిన అమ్మాయిని మనువాడాలనుకున్న ఓ యువకుడు, అందుకు అడ్డుపడుతోన్న ఆత్మలపై చేసే పోరాటమే 'రాజుగారి గది 3'. హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడేవారిని ఈ సినిమా ఇటు నవ్వించలేకపోయింది .. అటు భయపెట్టలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అంచనాలను అందుకోలేకపోయింది. 
కొంతమంది మాంత్రికులు కొన్ని శక్తులను ప్రయోగించడం, ఆ శక్తులు సృష్టించే అవరోధాలను అధిగమించి నాయకుడు విజయాన్ని సాధించడం వంటి తరహాలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి తరహా కథాంశంతోనే దర్శకుడు ఓంకార్ 'రాజుగారి గది 3' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో నవ్వించిందో .. ఏ మేరకు భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే .. మాయ (అవికా గోర్) ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తోన్న శశి (బ్రహ్మాజీ) 'మాయ'పై మనసు పారేసుకుంటాడు. మాయకి ఐ లవ్ యూ చెప్పిన ఆయనపై ఒక దెయ్యం దాడి చేస్తుంది. దాంతో కాలనీలో తనని ఇబ్బంది పెడుతున్న అశ్విన్ (అశ్విన్ బాబు)ని మాయ ప్రేమలో పడేలా చేయాలనుకుంటాడు. దెయ్యం దాడి చేస్తే ఆ కాలనీ నుంచి అశ్విన్ పారిపోతాడని భావిస్తాడు. మాయని ప్రేమిస్తున్నట్టు చెప్పిన అశ్విన్ పై కూడా దెయ్యం దాడి చేస్తుంది. ఇందుకు కారణం మాయ తండ్రి అయిన మలయాళ మాంత్రికుడు 'గరుడ పిళ్లై' (అజయ్ ఘోష్) అని తెలుసుకుని అశ్విన్ కేరళ వెళతాడు. అక్కడ ఏం జరుగుతుందో .. ఎలాంటి పర్యవసానాలు చోటుచేసుకుంటాయనేది మిగతా కథగా నడుస్తుంది.

దర్శకుడు ఓంకార్ 'రాజుగారి గది' టైటిల్ కింద చేసిన 3వ సినిమా ఇది. ఒక వైపున కామెడీని .. మరో వైపున హారర్ ని .. ఇంకో వైపున సస్పెన్స్ ను కలిపి నడపడానికి ప్రయత్నించాడు. అయితే ఈ మూడు అంశాలను కలిపి ఆసక్తికరంగా నడిపించడంలో ఆయన సక్సెస్ కాలేకపోయాడు. కథా వస్తువు బలంగా లేనప్పుడు కథనం కూడా నీరసంగానే సాగుతుంది. దాంతో సహజంగానే సన్నివేశాలు పేలవంగా తేలిపోతుంటాయి. ఈ సినిమా విషయంలో ఇదే జరిగింది. దెయ్యాలు మేకప్ వేసుకుని తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయేగానీ, నిజం దెయ్యాలుగా మాత్రం అనిపించకపోవడాన్నే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కథ బలంగా లేదు .. కథనంలో పట్టు లేదు. పాత్రలను తీర్చిదిద్దే విషయంపై శ్రద్ధ పెట్టినట్టుగా కనిపించదు. మలయాళ  మాంత్రికుడిగా అజయ్ ఘోష్ కనిపించగానే అక్కడి నుంచి కథ లేస్తుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఆ పాత్రను జోకర్ కంటే దారుణంగా మార్చేశాడు. అలీ పాత్రను కామెడీ పరంగా సరిగ్గా వాడుకోలేకపోయాడు. దెయ్యలతో కామెడీ చేయించడం మరీ ఘోరం. ఇక అసలు పాయింట్ కి 18వ శతాబ్దానికి పెట్టిన ముడిని, సామాన్య ప్రేక్షకులు అర్థం చేసుకునేంత సమయం లేదు. నిజానికి ఇదే అసలైన పాయింట్ .. దీనిని విపులంగా చెప్పవలసింది.

అజయ్ ఘోష్ ఎదుట అశ్విన్ - అలీ చేసిన రచ్చ చూస్తున్నప్పుడు, అసలు స్క్రిప్ట్ అనేది ఉందా? లేక ఎవరి నోటికి వచ్చిన డైలాగ్స్ వాళ్లు చెబుతున్నారా? అనిపిస్తుంది. కథానాయకుడిగా అశ్విన్ తన పాత్రకి న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. మాయ పాత్రలో అవిక ఫరవాలేదనిపించింది. అజయ్ ఘోష్ .. ఊర్వశి వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ తరహా పాత్రలను చేయకపోవడం మంచిది. ఆ పాత్రల్లో వాళ్లను చూడటం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక అలీ .. ధనరాజ్ పాత్రల ప్రయోజనం ఏమిటనే విషయం కూడా అర్థం కాదు.

 సంగీతం విషయానికొస్తే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తమిళ వాసన వస్తుంది. సాహిత్యాన్ని మ్యూజిక్ చాలా వరకూ డామినేట్ చేసేసింది. 'రా రా .. రా రా నా గదిలోకి' అనే ఐటమ్ సాంగ్ మాత్రం మాస్ ఆడియన్స్ ను హుషారెత్తించేదిలా వుంది. రీ రికార్డింగ్ విషయానికొస్తే గందరగోళంగా అనిపించిన సందర్భాలే ఎక్కువ. ఎడిటింగ్ విషయానికొస్తే అజయ్ ఘోష్ .. ఊర్వశి ఎపిసోడ్ ను ట్రిమ్ చేయవలసింది. అశ్విన్ ఆటోతో రౌండ్స్ వేస్తూ కాలనీ వాళ్లకి నిద్రలేకుండా చేసే సీన్ .. శివశంకర్ మాస్టర్ సీన్ .. ధన్ రాజ్ ఆరుబయటికి వెళ్లే సీన్ ను లేపేయవలసింది. ఫొటోగ్రఫీ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కొన్ని చోట్ల బాగున్నాయి.
 
బలమైన కథాకథనాలను సిద్ధం చేసుకోకుండా .. పాత్రలను స్పష్టంగా డిజైన్ చేసుకోకుండా బరిలోకి దిగితే ఎలాంటి అవుట్ పుట్ వస్తుందనడానికి ఈ సినిమా నిదర్శనంగా నిలుస్తుంది. 'రాజుగారి గది' .. 'రాజుగారి గది 2' సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని ప్రమోషన్స్ లో ఓంకార్ చెప్పాడు. కానీ ఆ రెండు సినిమాలకి రెండు మెట్ల కిందనే ఈ సినిమా నిలిచిపోతుందని చెప్పొచ్చు.            

Movie Name: Raju Gari Gadi 3

Release Date: 2019-10-18
Cast: Ashwin, Avika Gor, Ali, Brahmaji, Ajay Ghosh, Urvasi, Dhan Raj
Director: Ohmkar
Producer: Ohmkar
Music: Shabir
Banner: OAK Entertainments

Raju Gari Gadi 3 Rating: 2.00 out of 5


More Movie Reviews